హైదరాబాద్‌కు చేరుకున్న అక్బరుద్దీన్‌

Akbaruddin arrives to Hyderabad - Sakshi

అనారోగ్యంతో లండన్‌ ఆసుపత్రిలో చికిత్స 

2 నెలల అనంతరం తిరిగి రాక 

సాక్షి, హైదరాబాద్‌: అనారోగ్యం కారణంగా లండన్‌లో చికిత్స పొందిన మజ్లిస్‌ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు చేరుకున్నారు. రెండు నెలల క్రితం సౌదీ అరేబియాలోని మక్కాలో ఉమ్రా ప్రార్థనల కోసం ఆయన తన కుటుంబసభ్యులతో కలసి వెళ్లారు. అక్కడ అనారోగ్యానికి గురికావడంతో రెగ్యులర్‌ చెకప్‌ల నిమిత్తం వెళ్లే లండన్‌లోని ఓ ఆసుపత్రికి ప్రయాణమయ్యారు. వైద్య పరీక్షలు చేయించుకొని కుటుంబసభ్యులతో కలసి అక్కడే విశ్రాంతి తీసుకుంటూ రంజాన్‌ పండుగ కూడా జరుపుకున్నారు. ఇరవై రోజుల క్రితం అక్బరుద్దీన్‌ తీవ్రమైన కడుపునొప్పికి గురై వాంతులు చేసుకోవడంతో కుటుంబసభ్యులు అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు.

ఎనిమిదేళ్ల క్రితం చాంద్రాయణగుట్ట సమీపంలో జరిగిన దాడి నుంచి ఆయన త్రుటిలో ప్రాణాలతో బయటపడినా తీవ్ర గాయాల కారణంగా తరచూ కడుపునొప్పికి గురవుతున్నారు. మెరుగైన వైద్యం కోసం 3 నెలలకోసారి లండన్‌ ఆసుప్రతికి వెళ్లి చికిత్స చేయించుకొని వస్తున్నారు. ఈ క్రమంలో అక్బర్‌ త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థించాలని రంజాన్‌ సందర్భంగా దారుస్సలాంలో జరిగిన కార్యక్రమంలో మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేయడంతో కార్యకర్తలు, అభిమానుల్లో కలకలం చెలరేగింది. అక్బరుద్దీన్‌ ఆరోగ్యం కోసం కార్యకర్తలు పెద్దఎత్తున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎట్టకేలకు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. ఆయన రాక విషయం తెలుసుకొని మజ్లిస్‌ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకొని ఘనస్వాగతం పలికారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top