‘బీజీ–3’ అమ్మితే ఏడేళ్ల జైలు శిక్ష 

 Agriculture Department which is sharpening laws - Sakshi

చట్టాలకు పదును పెడుతున్న వ్యవసాయశాఖ 

అమాయక రైతులకు అంటగడుతున్న దళారులు 

పలుచోట్ల దళారులకు వంతపాడుతున్న అధికారులు  

ఉమ్మడి పాలమూరు, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఎక్కువ సాగు 

సాక్షి, హైదరాబాద్‌: నిషేధిత బీజీ–3 పత్తి విత్తనం అమ్మితే ఏడేళ్లు జైలు శిక్ష విధించేలా చట్టం చేసేందుకు తెలంగాణ వ్యవసాయశాఖ కసరత్తు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ (ఈపీ) చట్టం 1986 రూల్‌ 13 ప్రకారం పర్యావరణానికి హానికలిగించే విత్తనాలు విక్రయిస్తే ఏడేళ్ల జైలుతోపాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈసారి ఈ చట్టాన్ని ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం 1966 విత్తన చట్టం ప్రకారమే కేసులు నమోదు చేస్తున్నారు.

ఈ చట్టం వల్ల నకిలీ, కల్తీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కేవలం రూ. 500 జరిమానా, ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. గతేడాది నకిలీ, కల్తీ పత్తి విత్తనాలు విక్రయించిన, తయారుచేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. చాలా మందిని అరెస్టు చేశారు. ఈసారి అంతకుమించి ఏడేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటేనే దీన్ని అరికట్టగలమన్న భావనలో సర్కారు ఉంది. పైగా పర్యావరణ చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. 

రైతులూ జాగ్రత్త! 
బీజీ–3 పత్తి విత్తనాలు కొనుగోలు చేసేముందు రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేస్తో్తంది. ఈ విత్తనాలు జీఎం (జెనిటికల్లీ మోడిఫైడ్‌) అని, వీటిని సాగు చేసినందుకుగాను ఇటీవల మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన రైతులపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే రైతులను దళారులు మోసపుచ్చి బీజీ–3 విత్తనాలను అంటగడుతున్నారు.  చాలా మంది రైతులకు ఈ విత్తనంపై అవగాహన లేకపోవడం, కలుపురాదని ఎక్కువ దిగుబడి వస్తుందని ప్రచారం చేస్తూ అక్రమార్కులు వారికి అంటగడుతున్నారు. ఈ పత్తి విత్తనాలు వేస్తే అత్యంత ప్రమాదకరమైన గ్లైఫోసేట్‌ పురుగుమందు వినియోగించాలి. ఇది జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసేవని, క్యాన్సర్‌కు కారకమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.

బీజీ–3 విత్తనాల విక్రయాలు రాష్ట్రంలో చాపకిందనీరులా జరుగుతున్నాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోకి విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. గత ఏడాది 694 శాంపిళ్లను పరీక్షించగా, 119 శాంపిళ్లలో బీజీ–3 లక్షణాలున్నట్లు నిర్ధారించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్‌ 2వ తేదీ వరకు బీజీ–3 లక్షణాలున్న విత్తనాలను నిర్ధారించేందుకు 17 శాంపిళ్లను పరీక్షించగా అందులో 8 శాంపిళ్లు బీజీ–3గా తేలినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఇప్పటికే 16 మందిని అరెస్ట్‌ చేశారు. ఆరుగురు డీలర్ల లైసెన్స్‌లను కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 112 క్వింటాళ్ల పత్తి విత్తనాలు సీజ్‌ చేయగా, 56,122 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. 

గణనీయంగా పత్తి సాగు 
ఈసారి ఇప్పటి వరకు సాగైన పంటల్లోనూ పత్తిదే అగ్రస్థానంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం ఇప్పటివరకు 11 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా.. అందులో అత్యధికంగా పత్తి 8.50 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది బీజీ–3 విత్తనం సాగు చేసినందుకు 45 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే కొందరు దళారులు, వ్యాపారులు, కొందరు అధికారుల నిర్లక్ష్యంతో బీజీ–3 విత్తన అడ్డాగా రాష్ట్రం మారింది. బీజీ–2 విత్తనం విఫలం కావడంతో కొన్ని కంపెనీలు ప్రమాదకరమైన బీజీ–3 విత్తనాన్ని రైతులకు అంటగడుతున్నాయి.

ఇప్పటికే జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌ టీమ్స్‌ పనిచేస్తున్నప్పటికీ దళారులు, అక్రమార్కులు ఈ ప్రమాదకరమైన విత్తనాలను అన్నదాతలకు పెద్దమొత్తంలోనే విక్రయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ వర్గాలే ధ్రువీకరించడం గమనార్హం. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా, ఆదిలాబాద్‌ జిల్లాల్లో బీజీ–3 విత్తన పంట చాపకింద నీరులా విస్తరిస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర నుంచి సరఫరా కావడంతో పాటు మన రాష్ట్రంలో రైతుల పొలాల్లోనే బీజీ–3 పత్తి విత్తన పంటను సాగు చేయించి, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top