ఏసీబీ వలలో వీఆర్‌ఓ | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో వీఆర్‌ఓ

Published Thu, Aug 13 2015 10:55 PM

ACB sleuths arrest village revenue officer

నకిరేకల్ : రెవెన్యూశాఖలో అవినీతి పెచ్చుమీరుతోంది. మండల అధికారులతోపాటు కిందిస్థాయి ఉద్యోగులు కూడా ప్రజలనుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. లంచాలను తినడం మరిగిన వీఆర్‌ఓ అలవాటులో భాగంగా ఓ రైతునుంచి పట్టామార్పిడీకోసం రూ.8వేలు డబ్బులు తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఎక్కడోకాదు నకిరేకల్ తహశీల్దార్ కార్యాలయంలోనే పట్టపగలు జరిగింది.  నల్లగొండ ఏసీబీ డీఎస్పీ కోటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా.. నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామ శివారులోని అడవిబొల్లారం గ్రామానికి చెందిన చిక్కుల్ల లింగయ్య అనే రైతు నకిరేకల్‌లో నివాసముంటున్నాడు. మూడేళ్ల కిందట తండ్రి సోమయ్య చనిపోగా అతని పేర ఉన్న 7ఎకరాల 7గుంటల భూమిని తల్లి, తన పేరు మీద మార్చాలని ఏడాది కిందట రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.
 
 ఈ మేరకు విచారణ చేసిన వీఆర్‌ఓ వెంకటేశ్వర్లు చుట్టూ మూడు నెలలుగా తిరుగుతున్నాడు. *50వేలు ఇస్తేగాని పట్టా మార్పిడీ జరగదని ఖరాకండీగా చెప్పాడు. దీంతో రైతు అంత పెద్ద మొత్తం ఇవ్వలేనని తాను కూడా అప్పులలో ఉన్నానని *8వేలు ఇస్తానని రాజీకుదిర్చాడు. తనను ఇంతలా వేదించిన వీఆర్‌ఓను వదిలేదిలేదని ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు వేసిన పథకం ప్రకారం గురువారం ఉదయం తహశీల్దార్ కార్యాలయంలో *8వేల నగదును తీసుకొచ్చాడు. వాటిని వీఆర్‌ఓ వెంకటేశ్వర్లుకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి *8వేలు, డాక్యూమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి ఏసీబీ కోర్టులో సమర్పిస్తామని డీఎస్పీ బి కోటేశ్వర్‌రావు, ఇన్‌స్పెక్టర్ లింగయ్య విలేకరులకు తెలిపారు. అవినీతి అధికారులను పట్టించాలనుకునేవారు 7382625525 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

 ఇంత అన్యాయమా.. : చిక్కుల లింగయ్య (రైతు)
 మా తండ్రి పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీద నా తల్లి పేరుమీద మార్పిడీ చేసుకునేందుకు ఏడాదికాలంగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. వీఆర్‌ఓ అన్యాయంగా రూ.50వేలు అడిగాడు. చివరికి తగ్గించుకుంటూ, కాళ్లవేళ్లాపడి *8వేలకు బేరం కుదిరింది. కష్టపడిన సొమ్ము అవినీతి అధికారి చేతిలో పెట్టలేక ఏసీబీకి ఫిర్యాదు చేశాను.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement