70% నిధులు పరికరాల కొనుగోలుకే! | 70% of funds to purchase the Medical devices | Sakshi
Sakshi News home page

70% నిధులు పరికరాల కొనుగోలుకే!

Dec 25 2014 2:19 AM | Updated on Oct 9 2018 7:52 PM

70% నిధులు పరికరాల కొనుగోలుకే! - Sakshi

70% నిధులు పరికరాల కొనుగోలుకే!

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి పనులకు 15 రోజుల్లోగా టెండర్లు పిలుస్తామని ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య వెల్లడించారు.

ఆసుపత్రుల అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు: ఉప ముఖ్యమంత్రి రాజయ్య
మిగతా నిధులు ఆధునీకరణకు..  నెల రోజుల్లోగా పనులు ప్రారంభం
300 మంది డాక్టర్లు, 250 నర్సుల పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడి

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి పనులకు 15 రోజుల్లోగా టెండర్లు పిలుస్తామని ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య వెల్లడించారు. నిధుల్లో 70 శాతాన్ని అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకే కేటాయిస్తామని, మిగతా మొత్తాన్ని ఆసుపత్రుల రూపురేఖలు మార్చడానికి వినియోగిస్తామని ఆయన తెలిపారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల పరిధిలోని ఉన్నతాధికారులతో రాజయ్య బుధవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆసుపత్రులకు కేటాయించిన నిధుల ఖర్చుకు ప్రణాళికలు, అంచనాలు సిద్ధమయ్యాయని చెప్పారు. 15 రోజుల్లో టెండర్లు పిలిచి, మరో 15 రోజుల్లోగా ప్రక్రియ పూర్తిచేసి జనవరి చివరి నాటికి లేదా ఫిబ్రవరి మొదటి వారంలోగా ఆసుపత్రుల పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
 
 వైద్య సిబ్బంది పోస్టులు భర్తీ
 జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 600 కోట్లు విడుదలయ్యాయని ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. ఆ నిధులతో ఔట్ సోర్సింగ్ పద్ధతిన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సహా మొత్తం 930 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. పలు జిల్లాల్లో ఉన్న 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక్కోటి  90 లక్షల రూపా యల వ్యయంతో కొత్త భవనాలను నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే గూడురు, ఊట్నూరు, నాగార్జునసాగర్, ఎల్లారెడ్డి, సదాశివపేటల్లోని సామాజిక ఆరోగ్య కేంద్రాలను 40.80 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా శాశ్వత ప్రాతిపదికన 300 మంది వైద్యులు, 250 నర్సుల పోస్టులను భర్తీ చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల బకాయిలు ఎక్కడా లేవని, దీనిపై ఏవైనా సమస్యలుంటే త్వరలో ఒక సమావేశం ఏరా్పాటు చేసి పరిష్కరిస్తామని తెలిపారు.
 
 108పై త్వరలో నిర్ణయం
 108 అంబులెన్సులను జీవీకే నిర్వహిస్తుందా? లేక ప్రభుత్వ ఆధ్వర్యంలోనా? అనేదానిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఉప ముఖ్యమంత్రి రాజయ్య చెప్పారు. 108, 104కు సంబంధించి 600 కొత్త వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం 15 రోజుల్లో టెండర్లను ఆహ్వానిస్తామన్నారు.
 
 ఆరోగ్యశ్రీ విభజనపై ఆలోచిస్తున్నామని, ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు వేర్వేరు బడ్జెట్లు కేటాయించారని గుర్తుచేశారు. ఉద్యోగులు ప్రభుత్వ ఆసుపత్రులకే  ఔట్ పేషెంట్లుగా వెళ్లాలన్న అంశంపై స్పందిస్తూ... ఉద్యోగులకు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు కేటాయిస్తున్నట్లు రాజయ్య చెప్పారు. అలాగే ప్రత్యేకంగా మందులు, క్యాంటిన్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. జర్నలిస్టులకు త్వరలోనే ఆరోగ్య కార్డులు అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement