దోచేశారు! | 688 gram panchayats Property taxes | Sakshi
Sakshi News home page

దోచేశారు!

Jan 25 2016 12:30 AM | Updated on Mar 28 2018 11:26 AM

దోచేశారు! - Sakshi

దోచేశారు!

జిల్లాలో 688 గ్రామ పంచాయతీలున్నాయి. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నిధులతోపాటు వాటి పరిధిలో వివిధ రకాల పన్నుల కింద ఆదాయం వస్తుంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో 688 గ్రామ పంచాయతీలున్నాయి. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నిధులతోపాటు వాటి పరిధిలో వివిధ రకాల పన్నుల కింద ఆదాయం వస్తుంది. ఈ ఏడాది ఆస్తిపన్నులు, పన్నేతర కేటగిరీల కింద ఏకంగా రూ.159.63 కోట్ల ఆదాయాన్ని ప్రతిపాదించారు. ఇలా వస్తున్న పంచాయతీల ఆదాయం అక్రమార్కుల పాలవుతోంది. వీటిపై వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపడితే పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. జిల్లాలో 75 పంచాయతీల్లో అవకతవకలపై చేపట్టిన ప్రాథమిక విచారణలో పలు అంశాలు బయటపడ్డాయి.
 
అక్రమ అనుమతులతో సొమ్ము..
పంచాయతీల్లో ఎక్కువగా జరుగుతున్న అక్రమాల్లో అక్రమ అనుమతులకు సంబంధించినవే ఉన్నాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు, ఓఆర్‌సీలు, ఎన్‌ఓసీల విషయంలో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నారు. ముఖ్యంగా లేఅవుట్ల అనుమతులు, లిటిగేషన్ భూములకు అనుమతులివ్వడం లాంటి పనుల్లో భారీగా ముడుపులు తీసుకుంటున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. నగర శివారు పంచాయతీల్లోనే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, ఘట్‌కేసర్, శామీర్‌పేట్, శంషాబాద్, మేడ్చల్, రాజేంద్రనగర్ మండలాల్లోని 75 పంచాయతీల్లో అవకతవకలపై విచారణ దాదాపు కొలిక్కి వచ్చింది.
 
45 మంది సర్పంచులకు మెమోలు..
అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తేల్చినవాటిలో ఎక్కువగా సర్పంచుల ప్రమేయమే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. 45 గ్రామ పంచాయతీల్లో సర్పంచుల జోక్యంతో పంచాయతీ ఆదాయానికి భారీగా గండి పడింది. అంతేకాకుండా మరో 30 మంది కార్యదర్శులు అక్రమంగా అనుమతులివ్వడంలో పాలకవర్గానికి సహకరించారు. వీరితోపాటు మరో 15 మంది వార్డు సభ్యులు కూడా అక్రమాలకు పాల్పడ్డారు. అధికారుల ప్రాథమిక విచారణలో బయటపడిన అంశాల అధారంగా జిల్లా పంచాయతీ శాఖ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

పూర్తిస్థాయి విచారణకు డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల విస్తరణ అధికారులతో విస్తరణకు ఆదేశించింది. రెండు వారాల్లో విచారణ ప్రక్రియ కొలిక్కి రానున్నదని, వెనువెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని పంచాయతీ శాఖలో ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement