80 శాతం నామినేషన్లను తిరస్కరించారన్న కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని దాద్రా, నగర్ హవేలీ పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే ఆరోపించారు. స్థానిక అధికారులతో కలిసి కుమ్మక్కై 80 శాతం వరకు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించేలా బీజేపీ చేసిందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులకు పోటీకి ఎవరూ లేకుండా చేసిందని, ఇది ఓటు చోరీకి మించిన కుంభకోణమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థులకు తప్ప వేరెవరి నామినేషన్ పేపర్లు కూడా ఆన్‌లైన్‌లో కనిపించడం లేదన్నారు.
నామినేషన్ పత్రాల కోసం వెళితే సంబంధిత అధికారులు శిక్షణకు వెళ్లినట్లు కార్యాలయం సిబ్బంది తెలిపారని, ఎలాగోలా పత్రాలను పూర్తి చేసి చేతికందిస్తే పరిశీలనలో తిరస్కరించారని ఠాక్రే పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ఒక్కటీ తిరస్కరణకు గురి కాలేదన్నారు. ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, బాంబే హైకోర్టును సైతం ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. డామన్, డయ్యూలో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారని ఠాక్రే ఆరోపించారు. దీనిపై స్థానిక ఎన్నికల అధికారులు, బీజేపీ స్పందించాల్సి ఉంది.


