పల్లె గుండె పగిలింది

60 dead totally At Kondagattu bus accident - Sakshi

ఎవరిని కదిలించినా కన్నీళ్లే.. అరగంటకో పాడె మోసుకెళ్తున్న దృశ్యాలే..

ఈ చేతితోనే బువ్వ పెట్టాను.. ఈ చేతితోనే నడక నేర్పాను.. ఈ చేతితోనే పాడె మోయాలా.. ఈ చేతితోనే కొరివి పెట్టాలా..  
ఒకే రోజు 50 అంత్యక్రియలు..ప్రమాదంలో కొడిమ్యాల మండల పరిధిలో మొత్తం 51 మంది చనిపోగా.. 50 మంది అంత్యక్రియలను ఆయా కుటుంబీకులు పూర్తి చేశారు. శనివారంపేటలో 13 మంది, డబ్బు తిమ్మయ్యపల్లిలో 10 మంది, రాంసాగర్‌లో 10, హిమ్మత్‌రావుపేటలో 9, తిర్మలాపూర్‌లో 5, కోనాపూర్‌లో 2, సండ్రలపల్లిలో ఒకరి చొప్పున 50మంది అంత్యక్రియలు జరిగాయి.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/సాక్షి, జగిత్యాల: పల్లె గుండె పగిలింది. నిన్నటి వరకు జనంతో కిక్కిరిసిన పల్లె.. ఇప్పుడు వల్ల్లకాడును తలపిస్తోంది. శుభకార్యాలకు డప్పు కొట్టిన వాళ్లే చావు డప్పులు కొట్టారు. ఎవరిని తట్టినా.. గుండె పిండేసే బాధే.. ఏ మోము చూసినా కళ్లలో నీటి సుడులే.. ఎటు చూసినా అంతిమయాత్రలే.. అరగంటకో పాడె వెళ్తున్న దృశ్యాలే.. బరువెక్కిన గుండెలతో అగ్గి మోసుకెళ్తున్న తండ్రులు, కుమారులు.. తల్లిదండ్రులకు కొరివి పెట్టిన తనయులు.. చితి ఆరకముందే మరో చితికి సిద్ధం అవుతున్న బంధువులు.. కన్నపేగు కడచూపునకు నోచుకోని తల్లిదండ్రులు.. బిడ్డ చనిపోయిన సంగతి తెలియక అపస్మారక స్థితిలో తల్లి.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ బిడ్డ అంత్యక్రియలకు అంబులెన్సులో వచ్చిన తల్లులు.. ఇళ్ల ముందు శవాలు పెట్టుకుని అయినవారి కోసం ఎదురుచూసిన అభాగ్యులు.. ఎవరిని కదిలించినా వర్ణించలేని బాధే.. ఇదీ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని డబ్బుతిమ్మయ్యపల్లి, శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్, కోనాపూర్, తిర్మలాపూర్, సండ్రాలపల్లి గ్రామాల పరిస్థితి. మంగళవారం శనివారంపేట నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు మల్యాల మండలం కొండగట్టు వద్ద ఘాట్‌ రోడ్డుపై నుంచి లోయలోకి దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 60మంది మృతి చెందారు. మృతుల్లో 51 మంది కొడిమ్యాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారే కావడంతో ఆయా పల్లెల్లో అంతులేని విషాదం నెలకొంది. బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన అంత్యక్రియలతో పల్లెలన్నీ మరుభూములను తలపించాయి.

నాలుగైదు ఇళ్లకో మృతదేహం.. 
కొడిమ్యాల మండలంలోని శనివారంపేట గ్రామం నుంచి ఏకంగా 13 మంది దుర్మరణం చెందడంతో ఆ పల్లెలో పెను విషాదాన్నే నింపింది. ప్రతి నాలుగైదు ఇళ్లకో మృతదేహంతో.. ఆ గ్రామం ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది. ఒక శవయాత్ర తర్వాత మరొకటి.. కాటికి వెళ్లింది. రోజూ ఉదయమే వెళ్లొస్తానని చెప్పిన తన పెనిమిటి తిరిగిరాని లోకానికి వెళ్లాడని తెలిసి దాన్ని జీర్ణించుకోలేని భార్య. అమ్మా.. నాన్న ఇక రాడా..? అని పదే పదే అమాయకంగా అడిగే పిల్లలు. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటాడనుకుంటే మధ్యలోనే వదిలివెళ్లిన తమ కొడుకు ఇక లేడనే తల్లిదండ్రుల రోదన చూపరులను కన్నీళ్లు పెట్టించింది. గ్రామంలో 13 మందికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించగా.. చివరి చూపులకు వచ్చిన మృతుల బంధుమిత్రులతో శనివారంపేట కిక్కిరిసింది.

వచ్చినంత మందిని ఎక్కించుకున్నం: పరమేశ్వర్, కండక్టర్‌
బస్సులో 105 మంది ప్రయాణికులు ఉన్న మాట వాస్తవం. కొండగట్టు గుట్ట వరకు టికెట్లిచ్చిన. తర్వాత మరి కొందరు బస్సెక్కారు. వాళ్లకు టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుండగానే ప్రమాదం జరిగింది. వచ్చినంత మందిని ఎక్కించుకున్నం. ఇంకో బస్సు లేదు. కిందికి దిగే సమయంలో మైలేజీ కోసం న్యూట్రల్‌ చేసిండని చెప్పిన్రు.

అంత్యక్రియలకు ట్రాక్టర్లపైనే..
కొడిమ్యాల (చొప్పదండి): కుటుంబ సభ్యుల మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న వారే అంత్యక్రియల ఏర్పాట్లను చేసుకోవాల్సిన పరిస్థితి. కుటుంబసభ్యులు, బంధువులే పాడెను కట్టారు. శ్మశానంలో కట్టెలు పేర్చారు. సంప్రదాయ కార్యక్రమాలను కూడా సొంత మనుషులే నిర్వహించారు. చివరకు అంత్యక్రియల నిర్వహణ ఇబ్బందిగా మారడంతో చాలా వరకు మృతదేహాలను ట్రాక్టర్లలోనే శ్మశానానికి తరలించారు.

అమ్మను దక్కించుకోలేకపోయాం
నేను తిర్మలాపూర్‌ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాను. నాకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో అమ్మ పుష్పలతతో కలసి జగిత్యాల హాస్పిటల్‌కు బయల్దేరాం. బస్సునిండా ప్రయాణికులు ఉన్నారు. కొండగట్టు ఘాట్‌రోడ్డు మూలమలుపు వచ్చేసరికి బస్సు డ్రైవర్‌ పట్టు కోల్పోయాడు. కిందికిదూకి ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన అరిచాడు. ఇంతలోనే బస్సు గోతిలో పడింది. సీట్లో కూర్చున్న అమ్మపై చాలామంది పడ్డారు. నేను నిలబడి ఉండటంతో ప్రాణాలు దక్కాయి. నాచేయి విరిగింది. మా అమ్మను అంబులెన్స్‌లో జగిత్యాలకు, అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించినా ప్రాణాలు దక్కలేదు
– తైదల అర్చన 

కన్ను తెరవకముందే కన్నుమూశారు!
కొడిమ్యాల (చొప్పదండి): బస్సు ప్రమాదంలో ముగ్గురు గర్భస్థ శిశువులు కళ్లు తెరవకముందే కన్నుమూశారు. ఈ లోకంలోకి అడుగుపెట్టక ముందే పరలోకాలకు వెళ్లిపోయారు. కొడిమ్యాల మండలంలోని శనివారంపేట గ్రామానికి చెందిన ఎండ్రిక్కాయల సుమలత (26)కు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ప్రసవం కోసం అత్తతో కలిసి జగిత్యాల ఆసుపత్రికి బస్సులో వెళ్తూ ప్రమాదంలో కన్నుమూసింది. అదే గ్రామానికి చెందిన నామాల మౌనిక (21)కు ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. ఈమె కూడా బస్సులో ఆసుపత్రికి వెళ్తూ మృతి చెందింది. డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన గోల్కొండ సుమలత (21)కు 8 నెలల క్రితం పెళ్లయ్యింది. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. వైద్య పరీక్షల కోసం జగిత్యాలకు వెళ్తూ ప్రమాదంలో అసువులు బాసింది. దీంతో బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిలింది.

మంచుగడ్డలపైనే శవాలు..
కొడిమ్యాల(చొప్పదండి): కొండగట్టు ఘాట్‌ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో కొడిమ్యాల మండలంలోని 5 గ్రామాలకు చెందిన 51 మంది మృతి చెందడంతో మృతుల కుటుంబసభ్యులు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర జిల్లాల నుంచి కూడా ఫ్రీజర్లను తెప్పించారు. అయినా అందరికీ సరిపోలేదు. పోస్టుమార్టం అనంతరం మంగళ వారం రాత్రి ఇళ్లకు తరలించిన మృతదేహాలను బంధువులు మంచుగడ్డలపై ఉంచి, పైనుంచి ఊక పోశారు.సరైన జాగ్రత్తలను తీసుకోక ప్రమాదానికి కారణమైన అధికారులు.. కనీసం ఫ్రీజర్లను కూడా అందుబాటులో ఉంచకపోవడంపై మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చివరి చూపు కూడా దక్కలేదు..
కొడిమ్యాల (చొప్పదండి): ఘాట్‌రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తమ వారిని చివరి చూపు కూడా చూసుకోలేకపోయారు ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లిన కుటుంబ సభ్యులు. రాంసాగర్‌ గ్రామానికి చెందిన గాజుల హర్షవర్ధన్‌ తండ్రి అశోక్‌ సౌదీకి, శేర్ల హేమ భర్త అశోక్‌ ఇరాక్‌కు, కొండ సాయివరుణ్‌ తండ్రి శేఖర్‌ దుబాయ్‌కి ఉపాధి కోసం వలస వెళ్లారు. అయిన వారు మృతి వార్త తెలిసినా కూడా తాము పనిచేస్తున్న కంపెనీల నుంచి అనుమతులు రాకపోవడంతో చివరి చూపులకూ నోచుకోలేదు. 

డ్రైవర్‌కు ఇదే మొదటి.. చివరి యాక్సిడెంట్‌!
జగిత్యాలజోన్‌: కొండగట్టు ఘాట్‌ రోడ్డు వద్ద జరిగిన ప్రమాద సమయంలో ఆ బస్సు నడుపుతున్న డ్రైవర్‌ శ్రీనివాస్‌కు డ్రైవింగ్‌లో 23 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన డ్రైవింగ్‌ వృత్తిలో ఇదే మొదటి.. చివరి యాక్సిడెంట్‌ కావడం గమనార్హం. బస్సు ప్రమాదంలో తానూ బలయ్యాడు. శ్రీనివాస్‌ స్వస్థలం కరీంనగర్‌ జిల్లా అశోక్‌నగర్‌. ఆయనకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురుకు ఇటీవలే వివాహమైంది. ఆర్టీసీలో 1998 మే 13న కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా చేరారు. 2002లో పర్మినెంట్‌ అయ్యారు. జగిత్యాల డిపోలో 2014 నుంచి డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఏడాదికోసారి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఫిట్‌ అని తేలడంతోనే ఆ రూట్‌ బస్సును అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీనివాస్‌కు ఇంకా ఐదేళ్ల సర్వీస్‌ ఉంది.

హెచ్చార్సీలో ఫిర్యాదు..
సాక్షి, హైదరాబాద్‌: కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ)కి ఫిర్యాదు అందింది. హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్‌.. హెచ్చార్సీ కమిషనర్‌కు బుధవారం పిటిషన్‌ అందజేశారు. బస్సు ప్రమాదానికి కారణమైన డిపో మేనేజర్, సూపర్‌ వైజర్, ఆర్టీవోలపై కేసులు నమోదు చేయాలని కోరారు. 

60కి చేరిన మృతులు..
బస్సు ప్రమాద ఘటనలో బుధవారం మరో ముగ్గురు కన్నుమూశారు. దీంతో ప్రమాద మృతుల సంఖ్య 60కి చేరింది. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‌కు చెందిన చిదురాల రజిత (38) ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె భర్త సదయ్య తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మయ్యపల్లెకి చెందిన గోల్కొండ సుమలత (21) ఏడు నెలల గర్భిణి కరీంనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. వైద్య పరీక్షల నిమిత్తం పుట్టింటికి వచ్చిన రజిత తన తల్లి విజయతో కలిసి వెళ్తూ.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. కొండగట్టుకు చెందిన పసులోటి లక్ష్మి (60) జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది. మరో 45 మంది క్షతగాత్రులు కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్‌ అసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకునేందుకు ఢిల్లీకి చెందిన సేవ్‌ లైఫ్‌ ఆర్గనైజేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన అభిజిత్, సౌరవ్‌లను కొండగట్టుకు పంపింది. 
తల్లిదండ్రులు ఒడ్నాల లస్మవ్వ, కాశీరాంలకు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహిస్తున్న కుమారుడు ఒడ్నాల అంజయ్య   

కంట్రోల్‌ చేయలేకపోయాడు
అమిత్ రవిదాస్, జార్ఖండ్‌
మాది జార్ఖండ్‌లోని అంజోర ఫిరోజ్‌పూర్‌ గ్రామం. బట్టలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతాను. కొండగట్టు సమీపంలోని జేఎన్‌టీయూ కళాశాల వద్ద బస్సు ఎక్కాను. బస్సులో ప్రయాణికులు చాలామంది ఉన్నారు. కొండ దిగే సమయంలో బస్సును డ్రైవర్‌ కంట్రోల్‌ చేయలేకపోయాడు. దీంతో ఆకస్మాత్తుగా అదుపు తప్పి భారీ గుంతలోకి పడింది.

కదిలిస్తే కన్నీళ్లే
‘నా చేతులతోనే నీళ్లు పోసిన.. నా చేతులతోనే అన్నం తినిపించిన.. జ్వరం వచ్చిందని ఆస్పత్రిలో చూపించేం దుకు బస్సు ఎక్కిన.. 15 నిమిషాలకే ఏమైందో తెలియదు.. నా కొడుకు కనబడలే.. నా కొడుకు లేని బతుకెందుకు? నా కళ్లతోనే బిడ్డ దహన సంస్కారాలు చూసిన. ఆ దేవుడు నన్ను తీసుకుపోయినా బాగుండు’ అంటూ ఓ తల్లి బోరున విలపించింది. కొండగట్టు బస్సు ప్రమాదంలో ఎందరో తమ కొడుకులు, కూతుళ్లు, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కోల్పోయారు. మరి కొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం ‘సాక్షి’ కదిలించింది.
ఎవరిని కదిపినా.. కన్నీళ్లే..!
–జగిత్యాల టౌన్‌

చిన్నారుల అంత్యక్రియలకు అంబులెన్స్‌లో వచ్చిన తల్లులు
బాబును ఒక్కసారి చూడనివ్వరూ..
శనివారంపేట గ్రామానికి చెందిన గాజుల లత (27) తన కొడుకు హర్షవర్ధన్‌ (3)కు జ్వరం రావడంతో జగిత్యాల ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బస్సు ఎక్కింది. ప్రమాదంలో లత, హర్షవర్ధన్‌లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం అవుతుం డటంతో వెంటనే కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి హర్షవర్ధన్‌ మృతి చెందాడు. బుధవారం స్పృహలోకి వచ్చిన లత ‘నా బిడ్డ ఎక్కడ’ అని కన్నీళ్లు పెడుతూ అందరినీ వేడుకుంది. కొడుకు మృతి గురించి తెలుసుకుని గుండెలు బాదుకుంటూ రోదించింది. ‘కడసారి చూపునైనా చూడనివ్వండి’ అంటూ బంధువుల కాళ్లావేళ్లా పడింది. తల, కాళ్లకు, నడుముకు బలమైన గాయాలైన ఆ తల్లి అంబులెన్స్‌లో స్వగ్రామానికి చేరుకుని కొడుకును కడసారి చూసుకుంది.

బిడ్డా..ఒక్కసారి కనపడవా!
కొడిమ్యాల(చొప్పదండి): ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నరకయాతన ఓవైపు.. తొమ్మిది నెలలు మోసి, కనిపెంచిన పిల్లలు చనిపోయిన హృదయవేదన మరోవైపు.. ఆ మాతృమూర్తుల మనసులను రంపపుకోత కోశాయి. అంబులెన్సుల్లోనే అంత్యక్రియలకు హాజరై కన్నపేగుకు కడసారి వీడ్కోలు పలికారు. కొడిమ్యాల మండలం రాంసాగర్‌కు చెందిన బైరి కీర్తన తన కూతురు రితన్య (4)కు ఆరోగ్యం బాగా లేక పోవడంతో మంగళవారం జగిత్యాలకు బయల్దేరింది. కొండగట్టు ఘాట్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో రితన్య చనిపోగా.. కీర్తన కాలు విరిగింది, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. కూతురు మరణించిందన్న వార్త విన్న ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. అంబులెన్సులోనే కూతురు అంత్యక్రియలకు హాజరైంది. 

కొడుకు మృతి.. ఆస్పత్రిలో అమ్మ..
హిమ్మత్‌రావుపేట గ్రామానికి చెందిన శైలజ తన కొడుకు అరుణ్‌సాయికి అనారోగ్యంగా ఉండటంతో తన తల్లి భాగ్యవ్వతో కలిసి జగిత్యాలలోని ఆస్పత్రికి బయలుదేరింది. ప్రమాదంలో తల్లి భాగ్యవ్వతోపాటు కొడుకు అరుణ్‌ సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఛాతీ ఎముకలు విరిగి తీవ్రగాయాలైన శైలజ జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

సంఘం డబ్బులు చెల్లించేందుకు వెళ్తే..
కొంపల్లి విజయ, తిమ్మయ్యపల్లి, కొడిమ్యాల
స్వశక్తి సంఘం డబ్బులను నాచుపల్లి బ్యాంక్‌లో జమ చేసేందుకు వెళ్లాను. కొండగట్టు దిగి నాచుపల్లి వెళ్లాల్సి ఉంది. గుట్ట దిగే సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రమాదం జరిగింది. తల, కాళ్లకు తీవ్రగాయాలతోపాటు చెయ్యి విరిగింది. ఆస్పత్రికి వచ్చాకే స్పృహలోకి వచ్చాను.

దేవుడి దయతో నా తల్లి, కొడుకు క్షేమం
సీహెచ్‌.లక్ష్మీనారాయణ,బాధితుల కుటుంబ సభ్యులు, తిమ్మయ్యపల్లి
మా అమ్మ విజయతోపాటు వాళ్ల ఊరికి వెళ్తానని నా కొడుకు సూరజ్‌ మారాం చేయడంతో తిమ్మయ్యపల్లిలో వారిని బస్సు ఎక్కించాను. 10 నిమిషాలకే బస్సు ప్రమాదానికి గురైందని సమాచారం అందింది. పెద్ద ప్రమాదమని తెలిసి నా ఆశలు ఆవిరయ్యాయి. తల్లిని, కొడుకును చూశాకే నా మనసు కుదుటపడింది. అమ్మకు ఛాతీలో ఎముకలు విరిగాయి. కొడుకుకు కాలు విరిగింది. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దేవుడి దయతో ఇద్దరూ బ్రతికే ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top