చిన్నారులు.. చిరునగవులు | 23476 children are protected in five years | Sakshi
Sakshi News home page

చిన్నారులు.. చిరునగవులు

Feb 13 2019 3:48 AM | Updated on Feb 13 2019 3:48 AM

23476 children are protected in five years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వీధి బాలలు, అనాథలు, తప్పిపోయిన చిన్నారులను చేరదీసి వారికి రక్షణ కల్పించేందుకు చేపట్టిన ఆపరేషన్‌ స్మైల్, ముస్కాన్‌ వంటి కార్యక్రమాలు ఫలించి ఎందరో చిన్నారుల ముఖాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం రావడం... ఫలితంగా బాలకార్మికులు, వీధిబాలలు, భిక్షాటన చేయించడం తగ్గుముఖం పడుతున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పిల్లల సంఖ్య తక్కువగా నమోదైంది. ప్రతీ ఏటా జనవరిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీస్, లేబర్, జీహెచ్‌ఎంసీ తదితర శాఖల సమన్వయంతో నిర్వహించే ఈ ఆపరేషన్‌ స్మైల్‌ లో ఈ సంవత్సరం 2,425 మంది చిన్నారులను అధికారులు గుర్తించి చేరదీశారు. అందులో 2,168 చిన్నారులను సేకరించిన వివరాల ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మరో 66 మంది పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ఆయా ప్రభుత్వాలతో చర్చలు జరిపి వారికి అప్పగించగా...మరో 191 మంది చిన్నారులను ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పించారు. ప్రతీ ఏటా జూలైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహిస్తారు. 
ఐదేళ్లలో 23 వేల చిన్నారులకు రక్షణ 
హైదరాబాద్‌లోని పలు దుకాణాల యజమానులు చిన్నారులను పనిలో పెట్టుకుంటున్నారని పలు ఫిర్యాదులు రావడంతో 2014–15 సంవత్సరంలో పోలీస్‌ అధికారులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. చార్మినార్‌లోని బ్యాంగిల్‌ ఇండస్ట్రీలో దాడులు నిర్వహించి 356 మంది చిన్నారులను గుర్తించారు. వారిని పనిలో నుంచి తొలగించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరికొందర్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించారు. స్మైల్, ముస్కాన్‌ కార్యక్రమాల ద్వారా ఈ ఐదేళ్లలో ఇప్పటివరకు 23,476 మంది చిన్నారులను అధికారులు గుర్తించి చేరదీశారు. వీరిలో కుటుంబ సభ్యుల వివరాలు చెప్పిన వారికి ఇంటికి పంపించారు. అనాథపిల్లలను కస్తూర్భా గాంధీ పాఠశాలలు, వసతిగృహాల్లో చేర్పించారు. 

పరిస్థితి మారుతోంది 
రాష్ట్రంలో బాలకార్మికులు, వీధిబాలలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టారు. ఆపరేషన్‌ స్మైల్, ముస్కాన్‌ల ద్వారా రాష్ట్రానికి చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా దొరుకుతున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు తెలిపిన వారిని ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక వాహనంలో ఇంటికి పంపిస్తున్నాం. చట్టాలు, ప్రభుత్వం తీసుకునే చర్యలపై ప్రచారం చేయడం, క్షేత్రస్థాయి నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో చాలాచోట్ల పరిస్థితి మారింది. గణాంకాల్లోనూ పిల్లల సంఖ్య తగ్గుతూ రావడం శుభపరిణామం.  
–కేఆర్‌ఎస్‌ లక్ష్మీదేవి, సంయుక్త సంచాలకులు, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement