
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ఫలితాల రోజు ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఎల్లుండి (గురువారం) జరగనుందని, అన్ని కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు ఉందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లను చేశామని, ఫలితాల తర్వాత ఎలాంటి విజయోత్సవాలకు, సంబురాలకు అనుమతి లేదన్నారు. 144 సెక్షన్ అమలు ఉన్నందున కౌంటింగ్ సెంటర్ల నుంచి 100 మీటర్ల లోపు సిబ్బంది మినహా ఎవరిని అనుమతించమని తెలిపారు. వేసవికాలం దృష్ట్యా కౌంటింగ్ సిబ్బందికి మంచినీరు, మజ్జిగ వంటి ఏర్పాట్లు చేశామన్నారు.