ఒక మహిళ తప్ప సభ్యులంతా నేరస్థులే

13 percent reservation is not implemented for BCs - Sakshi

జాతీయ బీసీ కమిషన్‌పై మండిపడ్డ జస్టిస్‌ ఈశ్వరయ్య

హైదరాబాద్‌: జాతీయ బీసీ కమిషన్‌లో ఒక మహిళా సభ్యురాలు తప్ప మిగతా వారంతా నేరస్థులేనని బీసీ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు జస్టిస్‌ ఈశ్వరయ్యగౌడ్‌ ఆరోపించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన క్రాంతి మోర్చా తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పరివర్తన యాత్ర ముగింపు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బీసీ కమిషన్‌లో ఉన్న సభ్యుల వల్ల హక్కులు రక్షించబడతాయనే నమ్మకం లేకుండా పోయిందని చెప్పారు. బీసీ కమిషన్‌ను నిర్వీర్యం చేసి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తున్నారని విమర్శించారు. విద్య, ఆరోగ్యం ప్రైవేటు సంస్థల చేతుల్లో మగ్గుతున్నాయని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం 4 శాతం ఉన్న అగ్రకులాల వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని.. దీని వల్ల బలహీన వర్గాల వారికి పూర్తిగా అన్యా యం జరుగుతుందని మండిపడ్డారు. మెడికల్‌ సీట్లలో బీసీలకు 13 శాతం రిజర్వేషన్లు కూడా అమలు కావడం లేదన్నారు. టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ.. ఎన్నికలు చట్టబద్ధంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసు యంత్రాంగమే ప్రభుత్వానికి అనుకూలంగా డబ్బులు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. బహుజన క్రాంతి మోర్చా జాతీయ కోఆర్డినేటర్‌ వామన్‌ మేస్రామ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బొమ్మకు మురళి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top