 
															మీడియా సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్ ఈశ్వరయ్య. చిత్రంలో టి.చిరంజీవులు, విశారదన్ మహరాజ్ తదితరులు
3న తహసీల్దార్లు, 4న కలెక్టర్లకు వినతులు
నవంబర్ 6న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి
10న కామారెడ్డిలో బహిరంగసభ మీడియా సమావేశంలో జస్టిస్ ఈశ్వరయ్య వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ సవరణతోనే బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కనీ్వనర్ టి.చిరంజీవులు, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్‌లతో సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే తమ లక్ష్యమన్నారు.
కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత ఉభయ సభల్లో సభ్యుల సమ్మతి అనంతరం రాష్ట్రపతి ఆమోదంతోనే 9వ షెడ్యూల్‌లో చేర్చుతారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు, ఆర్డినెన్స్, జీఓలతో 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదన్నారు.
⇒ టి.చిరంజీవులు మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి రాజకీయ పార్టీలకు అనుబంధ సంస్థ కాదని, ఇదొక స్వతంత్ర సంస్థ అని చెప్పారు. త్వరలో జరిగే శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పంపిన రెండు బిల్లులపై పార్లమెంట్‌లో చర్చించి ఆమోదించేలా బీజేపీ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా బీసీల్లో ముస్లింలు ఉన్నారని, ఇందులో ఎవరికైనా అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తోందని, బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో డిసెంబర్‌లో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి వినతులు సమరి్పస్తామని తెలిపారు.
⇒ విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అంశం కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదని, జాతీయ సమస్య అన్నారు. బీసీల రాజ్యాధికారమే పోరాట లక్ష్యమని, ఈ ఉద్యమంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదన్నారు. ఆయన అంత:పురం విడిచి ప్రజల్లోకి రావాలని, స్పందించకుంటే ఫామ్‌హౌస్‌కు వచ్చి ప్రశి్నస్తామని చెప్పారు. అనంతరం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణను టి.చిరంజీవులు ప్రకటించారు.
⇒ నవంబర్ 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించడం 
⇒  నవంబర్ 4వ తేదీన జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ 
⇒ నవంబర్ 6వ తేదీన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం సమర్పణ 
⇒ నవంబర్ 7న రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి బీసీ రిజర్వేషన్ల ఉద్యమంపై అభిప్రాయాల సేకరణ 
⇒ నవంబర్ 10వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగసభ నిర్వహించి భవిష్యత్ పోరాట కార్యాచరణ ప్రకటన   

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
