రైతు బీమాకు వయసెందుకు అడ్డు?    

11 Lakh Farmers Are Not Eligible For Rythu Bheema Scheme - Sakshi

 బీమాకు 11 లక్షల మంది రైతుల అనర్హత 

18 నుంచి 59 ఏళ్ల వయసు నిబంధనతో దూరం.. తక్కువ మందికే లబ్ధి అంటున్న అధికారులు 

అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలం 

చనిపోయాక వచ్చే సొమ్ము వద్దంటూ మరో 2 లక్షల మంది తిరస్కరణ 

కుటుంబపెద్ద చనిపోవాలని అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం 

ఆయన పేరు లక్ష్మయ్య. మేడ్చల్‌ జిల్లాలోని ఓ గ్రామంలో రైతు. మూడెకరాల భూమి ఆయన పేరున ఉంది. ఇటీవలే ఆయనకు 61 ఏళ్లు నిండాయి. తనకు రైతు బీమా కావాలని వ్యవసాయాధికారుల వద్దకు వెళితే, నిబంధనల ప్రకారం వయసు ఎక్కువ ఉండటంతో అధికారులు కుదరదని చెప్పారు.

సూర్యాపేట జిల్లాకు చెందిన వెంకటరెడ్డి వయసు 63 ఏళ్లు. ఆయనకు ఐదెకరాల సాగు భూమి ఉంది. రైతు బీమా తీసుకుందామంటే వయసు మీరిందంటూ అధికారులు చెప్పడంపై ఆయన మండిపడుతున్నారు.

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబీమా పథకంలో వయసు నిబంధనపై రైతులు మండిపడుతున్నారు. ఈ పథకానికి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసున్న రైతులే అర్హులన్న నిబంధన వారికి గుదిబండగా మారింది. రాష్ట్రంలో 59 ఏళ్లు నిండిన దాదాపు 11 లక్షల మంది ఈ పథకానికి అనర్హులుగా తేలినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. ‘శారీరక శ్రమ చేసే రైతులు ఆరోగ్యంగానే ఉంటారు. 60 ఏళ్ల లోపు వారికి అనారోగ్య సమస్యలు పెద్దగా ఉండవు. ఆ తర్వాతే సమస్యలు మొదలవుతాయి.. మరణాలు సంభవిస్తాయి. కాబట్టి 59 ఏళ్ల వరకున్న వారికే బీమా అన్న నిబంధన ఉండటంతో చాలామంది అవకాశం కోల్పోతున్నారు. రైతు బీమాతో ఇక ఎవరికి లాభం’అని ఓ వ్యవసాయ నిపుణుడు వ్యాఖ్యానించారు. బీమాకు 70 ఏళ్ల వరకు వయసు పరిమితిని ప్రభుత్వం తొలుత పరిశీలించింది. అయితే 59 ఏళ్లకు మించిన వారికి బీమా ప్రీమియం అధికంగా ఉండటంతో సర్కారు వెనక్కు తగ్గిందని అధికారులు చెబుతున్నారు.  

రూ. 5 లక్షల పరిహారం 
ఇటీవల చేపట్టిన భూప్రక్షాళన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 58.33 లక్షల మంది  రైతులున్నారు. వారిలో ఇప్పటివరకు 48 లక్షల మంది వరకు పెట్టుబడి చెక్కులు తీసుకున్నారు. ఆయా రైతులందరికీ జీవిత బీమా చేర్పించాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తే, ఏదైనా కారణంతో రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఎల్‌ఐసీ నుంచి రూ.5 లక్షల పరిహారం అందుతుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రైతులందరినీ కలిసే పనిలో వ్యవసాయ శాఖ వర్గాలు నిమగ్నమయ్యాయి. గతనెల రోజులుగా పాలసీలో రైతులను చేర్పించడం, నామినీ పత్రాలు స్వీకరించే కార్యక్రమం జరుగుతోంది.  

అవగాహన కల్పించడంలో వైఫల్యం.. 
బీమా గురించి రైతులకు సున్నితంగా వివరించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. బీమా కంపెనీల ప్రతినిధులు బీమా పాలసీలను చాలా సున్నితంగా వివరిస్తారు. అప్పుడు ఎవరూ అంతగా ఫీల్‌ అవ్వరు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా రైతు బీమా వివరించే సందర్భంలో నేరుగా ‘చచ్చిపోతే డబ్బులొస్తాయి’అనడంతో అక్కడక్కడ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ‘చనిపోతే డబ్బులిస్తారా? అంటే మా కుటుంబ పెద్ద చనిపోవాలని కోరుకుంటున్నారా?’అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో రైతుబీమా కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు వ్యవసాయ ఉన్నతాధికారి ఒకరు హైదరాబాద్‌ నుంచి వెళ్లారు. అక్కడ ఓ రైతు కుటుంబాన్ని కలిశారు. రైతు బీమాలో చేరాలని కోరారు. ‘గతంలో ఇలాగే జీవిత బీమాలో చేరాక మా కుటుంబంలో ఒకరు చనిపోయారు. కాబట్టి ఇప్పుడు రైతు బీమా తీసుకోలేం’అంటూ ఆ కుటుంబం తిరస్కరించింది. ఇలా దాదాపు 2 లక్షల మంది రైతుల ఈ పాలసీని తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు. బీమా పాలసీలను వివరించే పద్ధతి సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. ప్రభుత్వం వచ్చే నెల 15 నుంచి రైతులకు బీమా పత్రాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. మూడో వంతు వరకు అనర్హులు ఉండటంతో రైతుల్లో వ్యతిరేకత వస్తుందంటున్నారు. కాగా, గ్రామాల్లో కౌలు రైతులు, ఇతర భూమి లేని వారికి కూడా బీమా కల్పించే అంశాన్ని పరిశీలించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ నివేదిక సమర్పించింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top