breaking news
-
సరైన స్టడీస్ లేకుండానే మేడిగడ్డ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: ‘‘భూగర్భంలో రాతిపొరల నిర్మాణ క్రమాన్ని తెలిపే కీలకమైన ‘జియోలా జికల్’ ప్రొఫైల్ స్టడీ లేకుండానే మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారు. అందువల్లే జియోలాజికల్ ప్రొఫైల్‌తో కూడిన సెక్షనల్ డ్రాయింగ్స్‌ను ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి ఇవ్వలేకపోయాం. అంతేకాదు.. బ్యారేజీ నిర్మాణ సమయంలో థర్డ్ పార్టీ పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్ నిర్వహణ జరగలేదు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఏటా వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీకి తనిఖీలు నిర్వహించలేదు. అందువల్ల ఈ వివరాలను కూడా ఎన్డీఎస్ ఏకు ఇవ్వలేకపోయాం..’’ అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఎన్డీఎస్ఏకు కాంగ్రెస్ ప్రభుత్వం సమా చారం ఇవ్వలేదని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయిందంటూ కాంట్రాక్టర్‌కు తప్పుడు మార్గంలో సర్టిఫికెట్లు జారీ చేశారని, వాటి వెనక ఏదో మతలబు ఉందని విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని చెప్పారు. బ్యారేజీలోని ప్రతిబ్లాక్ నిర్మాణం పూర్తయినట్టు ధ్రువీకరించే సర్టిఫికెట్లను గత ప్రభుత్వం సిద్ధం చేయలేదని.. అందుకే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లను ఎన్డీఎస్ఏకు అందజేయలేదని వివరించారు. ఈ అంశాలన్నింటినీ ఎన్డీఎస్ఏకు రాతపూర్వకంగా కూడా తెలిపామన్నారు. ప్రాజెక్టులో అవకతవకలపై న్యాయ సలహా తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నామని చెప్పారు. అధికారులపైనా క్రిమినల్ కేసులు.. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించినట్టు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని, దీనిపై లోతైన దర్యాప్తు జరుగుతోందని ఉత్తమ్ తెలిపారు. బాధ్యులైన అధికారులను గుర్తించి, వారి పేర్లతో సహా నివేదిక ఇస్తామని విజిలెన్స్ చెప్పిందని.. ఆ తర్వాత వారిపై క్రిమినల్ కేసులు ఉంటాయని వెల్లడించారు. గత ఏడాది వరదల్లో నీట మునిగి దెబ్బతిన్న కన్నెపల్లి పంపుహౌజ్ పునరుద్ధరణ తమ ప్రభుత్వం వచ్చాక పూర్తయిందని చెప్పారు. ‘‘తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ తేల్చినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. కమీషన్ల కోసమే బ్యారేజీ నిర్మాణాన్ని మేడిగడ్డకు మార్చింది. ఇదే విషయాన్ని వెదిరె శ్రీరామ్ కూడా చెప్పారు. ప్రాజెక్టు వ్యయాన్ని ఎంత పెంచితే అంత కమీషన్లు వస్తాయని కుట్రపూరిత ఆలోచనతో గత సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నెల రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించనుందని.. ఆ తర్వాత మరమ్మతులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎన్డీఎస్ఏ ప్రక్రియను వేగిరం చేయాలని కోరేందుకు తాను ఆదివారం ఢిల్లీకి వెళ్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ కారు స్క్రాప్‌కే.. శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కోసం బీఆర్ఎస్ నేతలతో వెళ్తున్న బస్సు టైర్ పేలిన ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘బీఆర్ఎస్ కారు టైర్లు బరస్ట్ అయ్యాయి. ఇక తుక్కు కింద పోవాల్సిందే..’’ అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. మేడిగడ్డ నష్టాన్ని చూశాకైనా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాళేశ్వరంలో కేంద్రం పాపం తక్కువేం కాదు.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం చేసిన పాపం తక్కువేమీ కాదని ఉత్తమ్ విమర్శించారు. ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ పెట్టుబడి అను మతులు ఇవ్వలేదని వెదిరె శ్రీరామ్ అంటు న్నారని.. మరి ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్ల రుణాలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్ఈసీ, పీఎఫ్సీ, బ్యాంకులు ఎలా ఇచ్చా యని నిలదీశారు. దేవాదుల ప్రాజెక్టు డిజైన్లు సరిగ్గా లేవని వెదిరె శ్రీరామ్ అంటున్నారని.. మరి ఆ ప్రాజెక్టుకు కేంద్రం ఏఐబీపీ పథకం కింద రూ.2,500 కోట్లు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌కు మరమ్మతులు చేపడ తామని, ఇందుకు సీఆర్పీఎఫ్ బలగాలను తొల గించాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓట్లు అడిగే హక్కులేదు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. కాళేశ్వరం అవినీతి విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును కాకుండా కేవలం మేడిగడ్డ బ్యారేజీని మాత్రమే పట్టుకుందన్నారు. బీఆర్ఎస్ను కాపాడుతోంది కాంగ్రెస్ మాత్రమేనని, లేకపోతే బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయేదన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఇతర నాయకులతో కలిసి కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్తో బీజేపీ కుమ్మక్కయిందని విమర్శలు చేస్తున్నారని, అయితే అందులో ఏమా త్రం వాస్తవం లేదన్నారు. కేసీఆర్ రూ.ఏడు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్తే, ప్రజలు ఇబ్బందులు పడకూ డదని కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీని 14, 15 ఎంపీ సీట్లలో గెలిపిస్తే 9 లక్షల కోట్లు కాదు, రూ.25 లక్షల కోట్లు తీసుకొస్తా మని చెప్పారు. తనకు ఇంకా చేవెళ్ల టికెట్ కేటాయింపుపై పార్టీ హామీ ఇవ్వలేదని, టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు. -
బీజేపీలో చేరిన బీబీ పాటిల్ కండువా కప్పి ఆహ్వానించిన ఛుగ్, లక్ష్మణ్
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్కు చెందిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌లు పాటిల్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాగా, జహీరాబాద్ లోక్‌సభ టికెట్‌పై పాటిల్‌కు నడ్డా హామీ ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీలో చేరడానికి ముందే బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. జహీరాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, అయితే మరింత అభివృద్ధిని కాంక్షిస్తూ తాను బీజేపీలో చేరానని తెలిపారు. బీఆర్ఎస్ మునుగుతున్న నావ అని, త్వరలో ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కె.లక్ష్మణ్ తెలిపారు. కాగా, బీఆర్ఎస్ బీబీబీ.. అంటే బాప్, బేటా, బిటియా (తండ్రి, కుమారుడు, కూతురు) పార్టీగా మారిందని తరుణ్ ఛుగ్ ఎద్దేవా చేశారు. -
రాజకీయ భిక్ష పెట్టిన జిల్లాకే అన్యాయం
దేవరకద్ర/జడ్చర్ల/కొందుర్గు: పాలమూరు– రంగారెడ్డి పథకాన్ని ఎండబెట్టారని, మేడిగడ్డను బొందపెట్టారని ఏఐసీసీ నేత వంశీచంద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చలో పాలమూరు– రంగారెడ్డి రిజర్వాయర్ల సందర్శన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి భూత్పూర్ మండలం కర్వెన, జడ్చర్ల మండలం ఉద్ధండాపూర్ రిజర్వాయర్లను సందర్శించారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండలం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని కూడా ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వంశీచంద్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు వాస్తవ రూపం ప్రజలకు తెలియాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 2015 లో శిలాఫలకం వేసిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కూర్చొని మూడేళ్లలో పూర్తి చేస్తానని గొప్పలు చెప్పిన కేసీఆర్.. రెండుసార్లు అధికారంలోకి వచ్చి నా ఒక్క ఎకరాకు నీరివ్వలేదని వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. పాల మూరు జిల్లా ఎడారిగా మారుతున్నా పట్టించుకోలేదని, 2009లో ఎంపీగా గెలిపించి రాజకీయంగా భిక్ష పెట్టిన జిల్లాకే తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేయడానికి ఒక పంపును నామమాత్రంగా ప్రారంభించి పూర్తి చేశామని గొప్పలు చెప్పారని విమర్శించారు. కర్వెన రిజర్వాయర్ ఇప్పటికీ అసంపూర్తి పనులతో అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా అభివర్ణించిన కాళేశ్వరంను బొంద పెట్టారన్నారు. కమీషన్ల కక్కుర్తితో మేడిగడ్డ పగుళ్లతో కుంగిపోవడానికి కారణం అయ్యారని ఆరోపించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులకు పిచ్చి పట్టిందని.. ఎర్రగడ్డకు వెళ్లాల్సిన నాయకులు, మేడిగడ్డకు వెళ్లారని ఎద్దేవా చేశారు. బృందంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, పరి్ణకారెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు. -
నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్..
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి కేటీ ఆర్ రాజీనామా చేసి నల్లగొండ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. తాను సైతం నల్ల గొండ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. నల్లగొండలో కేటీఆర్ ఓటమి ఖాయమని, ఇక కారు షెడ్డు మూసుకోక తప్పదన్నారు. కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీని మూసివేస్తాం అని కేసీఆర్ ప్రకట న చేస్తారా? అని సవాల్ విసిరారు. తాను సిరిసి ల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాన ని స్పష్టం చేశారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి శుక్రవారం సచివాల యంలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి మాట్లా డారు. కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదని కానీ రూ. లక్షల కోట్లు ఉన్నాయని, తనకు క్యారెక్టర్ ఉందని కానీ డబ్బులు లేవన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో రూ.200 కోట్లు ఖర్చు చేసి 30 వేల ఓట్లతో గెలిచాడని, తానై తే అలా గెలిస్తే రాజీనామా చేసేవాడినన్నారు. మాకు ప్రత్యర్థి బీజేపీనే... లోక్‌సభ ఎన్నికల్లో మాకు ప్రత్యర్థి బీఆర్ఎస్ కాదని, బీజేపీనే అని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పోటీలో లేదని, బీజేపీకి రెండు, మూడు సీట్లు వస్తాయో లేదో తెలియదన్నా రు. బీజేపీ ఎంపీ డి.అర్వింద్‌ను ప్రజలు ఎప్పు డో మరిచిపోయారని కోమటిరెడ్డి చెప్పారు. రాజకీ యాల వల్ల ఆస్తులు పోగొట్టుకున్నామని, తనతో పాటు ఉత్తమ్ ఆస్తులు తగ్గాయన్నారు. తన పేరు మీద ఆస్తులుంటే అర్వింద్‌కు ఇచ్చేస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరిలలో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని రాహుల్ గాంధీకి ప్రతిపాదించామని తెలిపారు. -
కాళేశ్వరంపై కుట్ర
అన్నారం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి/ సాక్షిప్రతినిధి, వరంగల్/ సాక్షి, హైదరాబాద్/ దామెర/ జనగామ: రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభు త్వం మేడిగడ్డలో తలెత్తిన లోపాన్ని సాకుగా చూపించి మొత్తం కాళేశ్వరాన్ని విధ్వంసం చేసే కుట్రకు పాల్పడుతోందనే అనుమానాలు కలుగుతున్నా యని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చేసిన ప్రకటన, గతంలో రేవంత్ బాంబులు పెట్టి ప్రగతిభవన్ పడగొడతానన్న మాటలు తమ అనుమానాన్ని బలపరుస్తున్నాయని చెప్పారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ట పన్నాగాన్ని బయటపెట్టేందుకే బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ వద్దకు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నేతలతో కూడిన రెండు వందల మంది బృందం మిగతా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించింది. ‘చలో మేడిగడ్డ’పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో.. మాజీ మంత్రి కడియం శ్రీహరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా.. కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా హరీశ్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ రైతుల విషాదగాధలు తెలిసిన కేసీఆర్.. వృథాగా సముద్రంలో కలిసే గోదావరి జలాలను బీళ్లకు మళ్లించేందుకు కాళేశ్వరానికి శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం ద్వారా 98వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతున్నాయని సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రోజుకో సంఖ్య చెప్తున్నారు. రేవంత్ సాంగత్యంతో ఉత్తమ్ కూడా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. ఉద్యమ ప్రయోజనాలను కాలరాసే కుట్ర తెలంగాణ ఉద్యమ ఫలితం కాళేశ్వరం ప్రాజెక్టు. ఉద్యమ ప్రయోజనాలను కాలరాసే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలి. రేవంత్.. మీరు తెలంగాణ ఉద్యమ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేశారు. ఇప్పుడు సీఎంగానైనా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి. చరిత్రలో ద్రోహిగా మిగిలిపోకండి. మేడిగడ్డ బ్యారేజీని ధ్వంసం చేయకండి. కావాలంటే ఎన్ని కేసులైనా పెట్టుకోండి. మమ్మల్ని ఎంతైనా హింసించండి. కానీ ప్రాజెక్టును, రైతులను కాపాడండి. ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య సమస్యనో.. ఎన్నికలు, ఓట్ల సమస్యనో కాదు. ఇది లక్షలాది తెలంగాణ రైతుల కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్ల స్థాయిలో ఉన్న సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం ఆలస్యం చేసి మిగతా పిల్లర్లకు విస్తరించేలా చేయకండి. అలాంటిదేమన్నా జరిగి మేడిగడ్డకు మరింత నష్టం వాటిల్లితే.. దానికి పూర్తి బాధ్యత రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారుదే. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం.. కాంగ్రెస్ నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలు సమస్యలను లేవనెత్తితే పరిష్కారం చూపకుండా.. పోటీసభలు, పర్యటనలతో దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించవద్దంటూ బీఆర్ఎస్ నల్లగొండ సభ పెడితే.. కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డకు వెళ్లి హడావుడి చేశారు. కుంగిన రెండు, మూడు పిల్లర్లను భూతద్దంలో చూపి కాళేశ్వరం పట్ల అపోహలు కల్పించే ప్రయత్నం చేశారు. నేడు కాళేశ్వరాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’కు పిలుపునిస్తే.. ప్రజలు, మీడియా దృష్టి మళ్లించేందుకు పాలమూరు–రంగారెడ్డి పర్యటనకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించడంలో నిమగ్నమైంది. ఇప్పటికైనా పనులు చేపట్టాలి.. 2022లో వచ్చిన భారీ వరదలతో కన్నెపల్లి, అన్నారం పంపుహౌజులు మునిగితే.. యుద్ధప్రాతిపాదికన ఏజెన్సీ ఖర్చులతో మరమ్మతులు చేయించి పునరుద్ధరించాం. ఆ విషయాన్ని ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడానికే ఇక్కడిదాకా వచ్చాం. అన్నారం బ్యారేజీకి ఎలాంటి ఢోకా లేదు. చిన్న సమస్యలుంటే వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయొచ్చు. దానిలోకి 34 స్ట్రీమ్లతోపాటు మానేరు నీళ్లు కూడా వస్తాయి. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేస్తూనే.. అన్నారం నుంచి కాళేశ్వరం ఆయకట్టుకు నీళ్లు అందించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ పనులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. మేడిగడ్డ ఒక కాంపోనెట్ మాత్రమే..: కడియం శ్రీహరి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీలు, పంపుసెట్లు, రిజర్వాయర్లలో (కాంపోనెట్ల)లో మేడిగడ్డ ఒకటి మాత్రమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. ‘‘మొత్తం 15 రిజర్వాయర్లు, 21 పంపుహౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల కాలువలు.. 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం.. 240 టీఎంసీల వినియోగం.. వీటన్నింటి సమగ్ర స్వరూపమే కాళేశ్వరం ప్రాజెక్టు. రాష్ట్రంలో ఎప్పుడూ ఏ ప్రాజెక్టు కూడా ప్రతిపాదిత అంచనాలతో పూర్తి కాలేదు. నాగార్జునసాగర్ 30 ఏళ్లు, ఎస్సారెస్పీ స్టేజ్ –1, స్టేజ్–2లు 40 ఏళ్లు దాటితే గానీ పూర్తి కాలేదు. వాటి అంచనా వ్యయం 10–20రెట్లు పెరిగింది. ఇప్పటివరకు కాళేశ్వరం నీటితో నేరుగా 98,570 ఎకరాలు, ప్రాజెక్టు కాల్వల ద్వారా నింపిన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థల ద్వారా 39,146 ఎకరాలు కొత్త ఆయకట్టు సమకూరింది. ఎస్సారెస్పీ స్టేజ్ 1, 2, నిజాంసాగర్ల నీటితో నింపిన 2,143 ట్యాంకుల ద్వారా 1,67,050 ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చింది. 3,04,766 ఎకరాల కొత్త ఆయకట్టు, 17,08,230 ఎకరాల స్థిరీకరణ కలిపి మొత్తం 20,33,572 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు అందుతాయి. తుమ్మిడిహట్టి బ్యారేజీ కడితే చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు పరిధి ముంపునకు గురికావడం, మహారాష్ట్రలో 3,786 ఎకరాల భూమి ముంపు ఉండంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది..’’అని వివరించారు. ఉద్రిక్తంగా.. ఉద్విగ్నంగా.. బీఆర్ఎస్ చేపట్టిన ‘చలో మేడిగడ్డ’పర్యటన ఆద్యంతం ఉద్విగ్నంగా, ఉద్రిక్తంగా సాగింది. ప్రత్యేక బస్సుల్లో బయల్దేరిన నేతలకు పర్యటన పొడవునా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మధ్యలో కాన్వాయ్‌లో చేరుతూ ముందుకు సాగారు. హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట సమీపంలో బీఆర్ఎస్ కాన్వాయ్‌ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. పోలీసులు వారిని నిలువరించారు. తర్వాత ఇదే జిల్లా దామెర మండలంలో ఆగిన కేటీఆర్.. స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించారు. ‘‘జై తెలంగాణ అంటే పోలీసులతో దాడులు చేయిస్తారా? ఇది దారుణం బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి..’’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు భూపాలపల్లిలోని కార్యాలయంలో మధ్యాహ్న భోజనం చేసి.. మేడారం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కోసం కొందరినే అనుమతించడంతో.. బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా.. మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ బృందం కాన్వాయ్‌లోని ఓ బస్సు టైరు జనగామ పరిధి నెల్లుట్ల–యశ్వంతాపూర్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో పేలింది. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపేయడం ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టడానికే ‘చలో మేడిగడ్డ’ ప్రభుత్వ బాధ్యత మరిచి ప్రాజెక్టులపై రాజకీయాలు చేస్తోంది: కేటీఆర్ పదేళ్లలో పచ్చబడ్డ తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చేలా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎండగట్టేందుకే ‘చలో మేడిగడ్డ’కార్యక్రమం చేపట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. శుక్రవారం పర్యటనకు బయలుదేరే ముందు తెలంగాణభవన్‌లో, తర్వాత అన్నారం బ్యారేజీ వద్ద ఆయన మాట్లాడారు. ‘‘కాళేశ్వరంపై అసలు నిజాలను ప్రజలకు చెప్పే క్రమంలో ఈరోజు పర్యటన మొదటి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రాజెక్టులోని ఇతర ప్రాజెక్టులు, రిజర్వాయర్లు సొరంగాలు, కాలువల వద్ద పర్యటిస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమైన ఒక మేడిగడ్డ బ్యారేజీలోని మూడు పిల్లర్లలో వచ్చిన సమస్యను పట్టుకొని లక్ష కోట్ల రూపాయలు వృధా అన్న తీరుగా కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గ ప్రచారం చేస్తోంది. బ్యారేజీకి మరమ్మతు చేసి సాగునీరు ఇవ్వాలనే బాధ్యతను మరచి రాజకీయాలు చేస్తోంది. రాబోయే రోజుల్లో రైతన్నల పంటలు ఎండకుండా ఉండాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లే దిక్కు..’’అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులు కూలిపోవాలనే కుతంత్రం ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టులను పరిరక్షించడానికి బదులు అవి కూలిపోవాలని కాంగ్రెస్ కుతంత్రాలు పన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘పంజాబ్‌నే తలదన్నే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న కాంగ్రెస్ నీచ సంస్కృతికి సమాధి కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మరమ్మతులు కూడా చేతకాని గుంపుమేస్త్రిని నమ్ముకుంటే తెలంగాణ రైతు నిండా మునుగుడే. దుష్ట రాజకీయాల కోసం తెలంగాణ రైతాంగాన్ని బలిచేస్తే భరించబోం. మేడిగడ్డకు మరణశాసనం రాయాలని చూస్తే తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌కు నూకలు చెల్లడం ఖాయం’’అని కేటీఆర్ హెచ్చరించారు. కాగా.. ప్రాజెక్టుల్లో సాంకేతిక లోపాలు తలెత్తితే సరిదిద్దుకోవాలే తప్ప రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. బీజేపీలోకి ఎంపీ బీబీ పాటిల్
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో బీజేపీలోకి చేరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో చేరారు. జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పాటిల్ బరిలోకి దిగనున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు. తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలిజాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా, తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్-కిషన్‌రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్- మాధవిలత, మహబూబ్‌నగర్- డీకే అరుణ, నాగర్‌కర్నూల్- భరత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. -
కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. నేను నల్గొండలో రాజీనామా చేస్తా.. కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలి. నేను సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్తా. ఇక కారు షెడ్డు మూసుకోవాల్సిందే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తానంటూ కేసీఆర్ ప్రకటన చేస్తారా?. నేను సిరిసిల్ల లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. కేటీఆర్‌కు టెక్నికల్ పరిజ్ఞానం లేదు. ఆయనొక పిల్లగాడు. స్థాయి కేటీఆర్‌ది కాదు. కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదు. లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి. నాకు క్యారెక్టర్ ఉంది. నా దగ్గర డబ్బులు లేవ’’ అంటూ కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. లోక్ సభ పోటీలో మాకు ప్రత్యర్థి బీజేపీనేని, బీఆర్ఎస్ కాదని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించాం. నల్గొండ, భువనగిరి నుంచి ఎక్కడైనా పోటీ చేయాలని కోరుతున్నాం. నాలుగు లక్షలకు పైగా మెజారిటి వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అరవింద్‌ను ప్రజలు మర్చిపోయారు. 2 వేల కోట్లు నాకు ఉన్నాయని అంటే భయం కలిగింది. రాజకీయాల వల్ల ఆస్తులు పోగుట్టుకున్నాం. నాతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆస్తులు కూడా తగ్గాయి. నా పేరు మీద ఎక్కడైనా ఆస్తులు ఉంటే అరవింద్‌కు ఇస్తా. బీఆర్ఎస్ ఎలాగూ లేదు... బీజేపీకి రెండు, మూడు వస్తాయేమో మాకైతే తెలియదు’’ అని ఉత్తమ్, కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
ఆ సీటు యమ హాట్.. బీజేపీలో ‘మల్కాజ్గిరి’ మంటలు
లోక్ సభ ఎన్నికల్లో ఆ సీటు యమ హాట్. దేశంలోనే దానిదొక ప్రత్యేక స్థానం. అక్కడ గెలిస్తే రాజయోగమే. అలాంటి లక్కీ సీట్ కోసం లీడర్ల పాట్లు అన్ని ఇన్నీ కావు. కేంద్రంలో అధికారంలో బీజేపీలో ఆ సీటు పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈటలకే కన్ఫర్మ్ అయిందన్న ప్రచారంతో మిగిలిన ఆశావహులు రగిలిపోతున్నారు. నాన్ లోకల్ వద్దు.. లాంగ్ అండ్ లోకల్ లీడర్‌కే ఇవ్వాలంటూ స్థానిక ఆశావహులంతా ఏకమై నిరసన గళం వినిపిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద లోక్ సభ స్థానం మల్కాజ్గిరి. అన్ని పార్టీల కన్ను అటువైపు. అక్కడ గెలిస్తే మంత్రి లేదా ముఖ్యమంత్రి అవ్వొచ్చన లక్కీ థాట్స్ కూడా నేతలకు స్టార్ట్ అయ్యాయి. అలాంటి సీటుకు ఫుల్ డిమాండ్ ఉంది. దేశంలో ఊపు మీదున్న బీజేపీ నుంచి ఆ సీటుకున్న పోటీ అంతా ఇంత కాదు. మాజీ మంత్రి ఈటల, బీజేపీ జాతీయ నేత మురళిధర్ రావు, స్థానిక నేతలు వీరంద్రగౌడ్, కూన శ్రీశైలం గౌడ్, పన్నాల హరీశ్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి, మల్క కొమురయ్య వంటి నేతల రేసులో ఉన్నారు. మల్కాజ్ గిరి సీటు తనకే కన్ఫర్మ్ అయిందని ఈటల రాజేందర్ ధీమాతో ఉన్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సంకేతాలు ఉన్నాయని కేడర్‌తో ఆయన ఏర్పాటు చేసిన బ్రేక్ పాస్ట్ మీటింగ్ బిజెపి మల్కాజ్ గిరిలో మంటలు రేపింది. మల్కాజ్గిరి సీటు తనకే కన్ఫర్మ్ అయిందని ఈటల ప్రచారంపై మిగిలిన ఆశావహులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ అసంతృప్తిని బాహటంగానే ప్రదర్శిస్తున్న నేతలు.. ఈటల వ్యవహారంపై అధిష్టానంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో గురువారం రాత్రి జరిగిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో మల్కాజ్‌గిరిని పెండింగ్‌లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మల్కాజ్ గిరి సీటు విషయంలో స్థానిక ఆశావహులు అంతా ఒక్కతాటిపైకి వచ్చారు. నాన్ లోకల్‌కు సీటు కేటాయిస్తే సహకరించేది లేదని తెగెసి చెబుతున్నారు. అతిపెద్ద నియోజకవర్గంలో పోటీ చేసేందుకు నేతలే లేరా అంటూ అసంతృప్త నేతలు క్వశ్చన్ చేస్తున్నారు. వీరంద్ర గౌడ్, కూన్ శ్రీశైలం గౌడ్, హరీశ్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి నేతలు అనుచరులు, కార్యకర్తలతో మల్కాజ్ గిరి సీటు వ్యవహారంపై భేటీ అయ్యారు. లోకల్ క్యాండిడేట్ ఎవరికి ఇచ్చినా ఓకే కానీ బయట నుంచి తీసుకొస్తే మాత్రం సహకరించేది లేదని పార్టీకి చెప్పాలని డిసైడ్ అయ్యారు. పార్టీని నమ్ముకొని ఎన్నో ఎళ్లుగా ఉన్న స్థానికులైన వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పన్నాల హరీశ్ రెడ్డి, వీరేంద్ర గౌడ్, కూన శ్రీశైలం గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ టికెట్‌ను త్యాగం చేశారు. పార్లమెంట్ సీటు తనకే వస్తుందని భావించారు. మధ్యప్రదేశ్ ఇన్ చార్జీ మురళీధర్ రావు మల్కాజ్ గిరిలో మూడేండ్లుగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. చాడ సురేశ్ రెడ్డి సైతం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేకాకుండా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పార్లమెంట్ పరిధిలో డబ్బులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి టికెట్ ఈటలకు కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో వీరితో పాటు బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ నిర్ణయం ఆధారంగా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరి అధిష్టానం మల్కాజ్ గిరి టికెట్ ఎవరికి కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వీరికి కాకుండా ఇతరులకు ఇస్తే వీరు ఆ నేతకు సహకరిస్తారా? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. -
ఛలో మేడిగడ్డ: కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఫైర్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరచి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు చెప్పడానికే తమ పార్టీ ఛలో మేడిగడ్డ పర్యటన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఛలో మేడిగడ్డకు బయలుదేరుతూ శుక్రవారం ఉదయం కేటీఆర్ సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. రైతు ప్రయోజనం కంటే రాజకీయ ప్రయోజనమే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని విమర్శించారు. ఛలో మేడిగడ్డ పర్యటన మొదటిది మాత్రమేనని, దీని తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పర్యటిస్తామని చెప్పారు. కావాలంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మేడిగడ్డ రిపేర్ చేయడానికి ఉన్న ఇబ్బందేంటని కేటీఆర్ ప్రశ్నించారు. రిపేర్ చేయకుండా ఉంచి వర్షాకాలంలో వరద వచ్చి బ్యారేజీ కొట్టుకుపోవాలని చూస్తున్నారన్నారు. రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దని సూచించారు. ఎడారిగా మారుతున్న తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు, కరువును పారలడం కోసం కాళేశ్వరంప్రాజెక్ట్ను నిర్మించారని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దీన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు ఆ ప్రాజెక్ట్‌పై విషం చిమ్ముతున్నారన్నారు. రైతులపై ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రేమ ఉన్నా మేడిగడ్డ రిపేర్ చేసి నీటిని మళ్లించాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి.. వచ్చే వారం మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ బృందం -
BJP: లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా రెడీ..
సాక్షి,ఢిల్లీ: ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలిజాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ , గుజరాత్, గోవా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నేతలతో బీజేపీ సీఈసీ భేటీ అయింది. #WATCH | BJP Central Election Committee (CEC) meeting concludes; Union Home Minister Amit Shah and BJP national president JP Nadda leave from the BJP headquarters, in Delhi. pic.twitter.com/xOM8KmrNns — ANI (@ANI) February 29, 2024 తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా, తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్-కిషన్‌రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్- మాధవిలత, మహబూబ్‌నగర్- డీకే అరుణ, నాగర్‌కర్నూల్- భరత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు -
జాతీయ పార్టీలకు దీటుగా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూసుకోవడంతోపాటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా రాణించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఆయా పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేసేలా అనుసరించాల్సిన వ్యూహాలకు పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పదును పెడుతున్నారు. కనీసం డజను స్థానాలు లక్ష్యంగా.. తెలంగాణ ఉద్యమ సమయంలో 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన గులాబీ దళం... రాష్ట్ర అవతరణ తర్వాత 2014, 2019లలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగింది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను 2004లో 5, 2009లో 2, 2014లో 11 సీట్లలో గెలుపొందగా 2019లో మాత్రం 9 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 12 సీట్లలో గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం పార్టీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలు, గతంలో పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు, ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవని స్థానాలు అనే కేటగిరీలుగా లోక్‌సభ స్థానాలను విభజించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఏడు లోక్‌సభ స్థానాల పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థుల కంటే తమ అభ్యర్థులు ఎక్కువ ఓట్లు సాధించడాన్ని లోక్‌సభ ఎన్నికల కోణంలో సానుకూల అంశంగా భావిస్తున్న బీఆర్ఎస్... కనీసం 12 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాన్ని రూపొందిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై గుంభనం ప్రస్తుతం తొమ్మిది లోక్‌సభ సెగ్మెంట్లలో బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం ఉండగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత ఇప్పటికే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరగా తాజాగా నాగర్‌కర్నూలు ఎంపీ పి.రాములు బీజేపీలో చేరారు. మిగిలిన ఆరుగురిలో సిట్టింగ్ ఎంపీలు రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), నామా నాగేశ్వర్రావు (ఖమ్మం), బీబీ పాటిల్ (జహీరాబాద్)కు మాత్రమే వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మిగతా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పి.దయాకర్ (వరంగల్), మాలోత్ కవిత (మహబూబాబాద్), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్)కి తిరిగి టికెట్ లభించే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు చేవెళ్ల, ఖమ్మం, జహీరాబాద్, కరీంనగర్‌కు సంబంధించి మాత్రమే అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచి్చంది. మరో 13 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరనే అంశంపై చర్చ సాగుతున్నా కేసీఆర్ మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు ఎవరనేది తేలాకే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని ఆయన భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు సమ ఉజ్జీలను బరిలోకి దించడం లక్ష్యంగా లోక్‌సభ సెగ్మెంట్లవారీగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు ప్రాథమికంగా పూర్తిచేసినట్లు సమాచారం. త్రిముఖ పోటీలో పైచేయి సాధిస్తామనే ధీమా గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల లోపాయికారీ ఒప్పందం వల్లే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాలు కోల్పోయామని భావిస్తున్న బీఆర్ఎస్... తాజా లోక్‌సభ ఎన్నికల్లో జరగనున్న త్రిముఖ పోటీలో పైచేయి సాధిస్తామనే ధీమాతో ఉంది. గతంలో ఒక్కసారి కూడా గెలవని సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో ఇటీవల తాము ఏకపక్ష విజయం సాధించడం కలిసి వస్తుందని భావిస్తోంది. అలాగే చేవెళ్ల, మెదక్, జహీరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ ఓట్లు సాధించడం అనుకూలిస్తుందని బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. మరోవైపు రెండు ఎస్టీ, మూడు ఎస్సీ స్థానాలను మినహాయిస్తే మిగతా 12 స్థానాలకుగాను నిజామాబాద్, జహీరాబాద్, భువనగిరి స్థానాల్లో బీసీ అభ్యర్థులను బరిలోకి దించాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో సెగ్మెంట్ల వారీగా కేసీఆర్ సమీక్షలు సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ భవన్ వేదికగా సమీక్షలు నిర్వహించనున్నారు. పార్టీ ప్రతినిధి బృందం మేడిగడ్డ సందర్శన నేపథ్యంలో శని లేదా ఆదివారం నుంచి ఈ సమీక్షలు ప్రారంభమయ్యే అవకాశముంది. లోక్‌సభ సెగ్మెంట్లవారీగా పార్టీ ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. లోక్‌సభ నియోజకవర్గాలవారీగా జరిగే ఈ సమావేశాలకు సంబంధించి షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగే భేటీల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతోపాటు ఎన్నికల వ్యూహంపైనా దిశానిర్దేశం చేయనున్నారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసినా ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. -
తేల్చుకుందాం రా..!
సాక్షి, హైదరాబాద్: ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దమ్ముంటే ఒక్క సీటు అయినా గెలిచి చూపించాలని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. అంత ఉబలాటం, దమ్ము, ధైర్యం, తెగువ ఉంటే.. పరపతి ఉన్న నాయకుడివే అయితే.. నువ్వు (రేవంత్) సిట్టింగ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి లోక్‌సభ సీట్లోనే తేల్చుకుందాం. అది పోతే ఇది, ఇదిపోతే అది.. అన్నట్టు సేఫ్ గేమ్ ఆడకుండా.. నువ్వు సీఎం పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఎంపీగా నీ పనితీరు, మున్సిపల్ మంత్రిగా నా పనితీరును ఆ ఒక్క సీటులోనే తేల్చుకుందాం. ఎవరు గెలుస్తారో చూద్దాం..’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. రేవంత్ మాటలకు విశ్వసనీయత ఏది? గతంలో జీహెచ్ఎంసీలో, కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన రేవంత్‌రెడ్డి మాటలకు విశ్వసనీయతే లేదని కేటీఆర్ విమర్శించారు. ‘‘రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిస్తే మగాడు.. ఓడితే కాదంటావా? గతంలో కొడంగల్‌లో ఓడినపుడు నువ్వు కాదా..? ఇదేం లాజిక్? నువ్వు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు గెలిచారో చెప్పలేరు. ఆత్మన్యూనత భావంతో బాధపడుతున్న రేవంత్ నేనే సీఎం, నేనే పీసీసీ అధ్యక్షుడు అని గొంతు చించుకుంటున్నారు. ఏం మీ మంత్రివర్గ సహచరులు మిమ్మల్ని గుర్తించడం లేదా? మగతనం గురించి మాట్లాడుతున్న రేవంత్.. ఎన్నికల కోడ్ వచ్చేలోగా రూ.2లక్షల రుణమాఫీ, మహాలక్ష్మి పథకంతో పాటు మిగతా 420 హామీలను నెరవేర్చాలి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డిది పేమెంట్ కోటా.. రాజకీయాల్లో తనది మేనేజ్మెంట్ కోటా అంటున్న రేవంత్.. రాహుల్, ప్రియాంక గాంధీ ఏ కోటానో చెప్పాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘రేవంత్‌రెడ్డి పేమెంట్ కోటా కింద మాణిక్యం ఠాగూర్‌కు డబ్బులిచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని, ఇతరులకు డబ్బులిచ్చి సీఎం పదవి కొనుక్కున్నారు. పేమెంట్ కోటా అభ్యర్థి రేవంత్.. తనను ప్రజలు ఎన్నుకున్నట్టు మాట్లాడితే ఎలా? పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు కోసం ఢిల్లీకి కప్పం కట్టాలి. పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీని నడపాలంటే రేవంత్, డీకే శివకుమార్ రోజుకు 18 గంటలు కష్టపడాలి. బిల్డర్లు, కాంట్రాక్టర్లను పిలిచి బెదిరించి, వేధించి డబ్బుల వసూలు దందా చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో బిల్డింగ్ అనుమతులను ఎవరిని బెదిరించడం కోసం నిలిపివేశారు. హైదరాబాద్ బిల్డర్లు త్వరలోనే రోడ్డెక్కే పరిస్ధితి ఉంది. కేంద్రంలోని బీజేపీకి రేవంత్ పరోక్షంగా సహకరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన ఎటుపోతారో అందరూ చూస్తారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఏం జరుగుతుందో చూస్తున్నట్టే.. భవిష్యత్తులో తెలంగాణలో కూడా రాజకీయం రంజుగా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. లంకె బిందెలు ఎక్కడున్నాయో మనకేం తెలుసు. తెలంగాణ తల్లి మీద ఆభరణాలు మాయం చేశాడు’’ అని కేటీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్గా మార్పుపై నిర్ణయం తీసుకోలేదు.. రాజకీయ పారీ్టల్లో చేరికలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. పోరాటవాదులు పారీ్టతో ఉంటారని, అవకాశవాదులు వదిలివెళ్తారని వ్యాఖ్యానించారు. ఏ పార్టీ అయినా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తుందన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సునీత మహేందర్‌రెడ్డి (చేవెళ్ల), బొంతు రామ్మోహన్ (సికింద్రాబాద్), అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (మల్కాజిగిరి), వెంకటేశ్ నేత (పెద్దపల్లి)లకు టికెట్లు ఇస్తారేమోనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. బీఆర్ఎస్గా ఉన్నా తమ ఫోకస్ ప్రస్తుతానికి తెలంగాణపైనే ఉందని చెప్పారు. తమ పాలనలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే.. రాజకీయ వేధింపులకు దిగకుండా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపితం సాగునీటి ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్లలో లీకేజీలు, పగుళ్లు సహజమని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం ఏ విచారణలు చేసినా సరే, ఇంజనీరింగ్ నిపుణులు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. కానీ గత ప్రభుత్వంపై ఆరోపణలు, శ్వేతపత్రాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఎలాంటి హైడ్రోలాజికల్ అధ్యయనాలు చేయకుండానే రాజకీయ ప్రేరేపితంతో ఆదరాబాదరాగా నివేదికను విడుదల చేసిందని విమర్శించారు. ఎప్పుడూ కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికలను తప్పుబట్టే కాంగ్రెస్, మంత్రి ఉత్తమ్ ఇప్పుడు ఎన్డీఎస్ఏ నివేదికను ప్రామాణికంగా తీసుకుని మాట్లాడుతున్నారేమని ప్రశ్నించారు. రైతులను ఆదుకునేందుకు తగిన పరిష్కారం చూపాలనే కామన్ సెన్స్ ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. ‘‘మేం మేడిగడ్డకు వెళ్తుంటే.. కాంగ్రెస్ పాలమూరు ప్రాజెక్టు సందర్శన పేరిట చౌకబారు రాజకీయం చేస్తోంది. దిద్దుబాటు చర్యలు చేపట్టి నీరు ఇవ్వకపోవడం వికృత రాజకీయం, నేరపూరిత చర్య. పాలమూరు ప్రాజెక్టులో 80శాతం పనులు పూర్తిచేశాం. ఉత్తమ్ నీటిపారుదల శాఖ మంత్రిగా బ్యారేజీలు, రిజర్వాయర్లతోపాటు తన శాఖకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేసే పనులు మానుకుని మేడిగడ్డ వద్ద దిద్దుబాటు పనులు చేపట్టాలి..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు
ఢిల్లీ, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీని వీడిన ఎంపీ రాములు బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారాయన. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. కాగా, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములుకు మధ్య విభేదాలు ముదిరాయి. తానే ఎంపీ అభ్యర్థిని అంటూ బాలరాజు ప్రచారం చేసుకుంటుండటంతో రాములు బీఆర్ఎస్ను వీడినట్లు తెలుస్తుంది. ఇక రాములు చేరికను స్వాగతించిన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్.. తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారుతోందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మునిగిపోయిన నావ.. కారు రిపేర్ అయ్యే పరిస్థితి లేదు. మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడింది. కానీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. చాలామంది మా పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. .. షెడ్యూల్ వచ్చే లోపు దాదాపు అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీదే గెలుపు. మొత్తం 17 స్థానాలు మేమే గెలుస్తాం. బీజేపీ అన్ని పార్టీల కంటే ప్రచారంలో ముందుగా దూసుకుపోతోంది. ప్రధాని మోదీ కూడా రెండ్రోజులు తెలంగాణలో పర్యటిస్తారు. తెలంగాణ అన్ని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయం అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాం: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రంలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం సిల్లీ రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. మాకు(బీఆర్ఎస్)కు సెన్స్ లేదని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని.. మరి సెన్స్ ఉండి నీళ్లు వృధా పోతుంటే కాంగ్రెస్ వాళ్లు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ‘‘రేపు మేడిగడ్డ,అన్నారం పర్యటనకు వెళ్తున్నాం. మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లర్లు, అన్నారం బ్యారేజ్ లను పరిశీలిస్తాం. అన్నారం బ్యారేజ్ దగ్గర మీడియా సమావేశం నిర్వహిస్తాం. కడియం శ్రీహరి, హరీష్ రావు ఇద్దరు రెండు బ్యారేజ్ లపై మాట్లాడుతారు. ప్రాజెక్టు కుంగడం.. ఇదేం కొత్తది కాదు. ఈ విషయంలో రాజకీయాలు చేయడం తగదు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ హితవు పలికారు. ‘‘డ్యాం సేఫ్టీ అధికారులు ప్రాజెక్టు కుంగిన దగ్గర సోయిల్ టెస్ట్ చేశారా?. కనీసం కింద దిగకుండా పై పైన చూసి పోవటం కాదు. దీన్ని ప్రామాణికంగా చేసుకొని మాట్లాడటం సరికాదు. మార్చి 1 తర్వాత నీళ్ళు ఇచ్చే పరిస్తితి లేదు. సెన్స్ మాకు లేదు అంటున్నారు.. ఉండి మీరు నీళ్లు వృధాగా పోతుంటే మీరేం చేస్తున్నారు?. అందర్నీ తికమక పెడుతున్నారు. .. మొన్న ప్రభుత్వానికి ఇచ్చింది రాజకీయ ప్రేరేపిత రిపోర్ట్ మాత్రమే. మేం డ్యాం సందర్శనకు వెళ్తున్నామని.. వాళ్లు వెళ్తామంటున్నారు. సిల్లీ రాజకీయాలు చేస్తున్నారు. ఈ పోటీ యాత్రలు మానుకోవాలి. మమ్మల్ని బద్నాం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికైనా ఒక పంప్ ఆన్ చేసి నీళ్ళు వదలండి. కాంగ్రెస్ నాయకులు పాలమూరు రంగారెడ్డికి బరాబర్ చూసి రండి. ఏనుగు వెళ్తే, ఎలుక చిక్కినట్టు ఉంది. ఉద్దండ పూర్ కట్టిందే కేసీఆర్. కేసీఆర్ ను బద్నాం చేయాలని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తున్నారు. రాజకీయం కోసం కేసిఆర్ మీద, గత ప్రభుత్వ పెద్దల మీద కేసులు పెట్టేలా చూస్తున్నారు. .. కోర్టులు ఉన్నాయి, దైర్యంగా ఎదుర్కొంటాం. బ్యారేజ్ కొట్టుకుపోవాలని ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. నీళ్ళు లీక్ అయ్యే దగ్గర కాపర్ డ్యాం ఏర్పాటు చేసి నీళ్ళు ఇవ్వొచ్చు. వెదిరే శ్రీరామ్ తెలివి తక్కువ వాడు, ఎంపి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నాడు. అందుకే ఈ విమర్శలు. కాళేశ్వరంకు 400 అనుమతులు ఉన్నాయి. .. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వ్యక్తి కానీ, బీజేపీ కింద పని చెసే సంస్థల పట్ల ప్రేమ ఎందుకు?. కాంగ్రెస్ నాయకులు రిజర్వాయర్ కు బరాజ్ కు తేడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.. ‘‘మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేద్దాం. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తా. సీఎం పదవికి రాజీనామా చేసి రేవంత్ పోటీ చేయాలి. మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం.. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. -
బీజేపీ జితేందర్ రెడ్డి: ఆనాడు దున్నపోతు.. ఇప్పుడు..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బట్టలు లేకుండా ఆలోచిస్తున్న ఓ చిన్నపిల్లోడి వీడియోను షేర్ చేశారు. దీంతో, బీజేపీ రాజకీయాలపైనే ఆయన ఇలా సెటైరికల్ కామెంట్స్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాదా, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా.. వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ ఎన్నికల ముందు ఆలోచిస్తున్నట్లు ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్నపిల్లాడు బట్టలు లేకుండా థింక్ చేస్తూ అటు ఇటూ తిరుగుతుంటాడు. ఇక, ఈ వీడియోను ప్రధాని మోదీ, అమిత్ షా, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్, జేపీ నడ్డా, శివప్రకాశ్కు ట్యాగ్ చేశారు. What to do,what not to do.Thinking before elections.@narendramodi @AmitShah @sunilbansalbjp @tarunchughbjp @JPNadda @shivprakashbjp @BJP4India @BJP4Telangana pic.twitter.com/QYvt5xR7Ge — AP Jithender Reddy (@apjithender) February 29, 2024 కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం ఆలోచన తీరు అలా ఉందనే అర్థం చేసుకోవాలా? లేక మరేదైనా అర్థం వచ్చేలా పెట్టారా? అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇక, గతంలో దున్నపోతులను వాహనంలో ఎక్కించి కొట్టే వీడియోను జితేందర్ రెడ్డి షేర్ చేయడంతో బీజేపీలో పెను దుమారమే చోటుచేసుకుంది. పార్టీ నేతలకు అదేవిధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని అర్ధం వచ్చేలా నాడు వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. -
టార్గెట్ లోక్‌సభ.. నేడు బీజేపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన!
సాక్షి, ఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సందర్బంగా పలు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు వందకుపైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాగా, నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పోటీ చేయనున్న లోక్‌సభ అభ్యర్థులను బీజేపీ సీఈసీ ఖరారు చేయనుంది. దాదాపు వందకుపైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీంతో, ఆశాహహుల్లో కొంత టెన్షన్ నెలకొంది. ఇక, తెలంగాణలో ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై స్థానిక నేతలతో పలుమార్లు సమావేశమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి కూడా మెజార్టీ అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ బీజేపీలో చేరుతున్నారు. దీంతో, బీజేపీ ఆయనకు నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో 17 స్థానాలకు గాను 12 స్థానాల్లో అభ్యర్థుల జాబితా కొలిక్కివచ్చిందని బీజేపీ నేతల టాక్. నలుగురు సిట్టింగ్‌లు, ఈటల, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరెడ్డి వంటి వారి పేర్లు ఉన్నాయని తెలుస్తోంది, ఇక మిగిలిన స్థానాల్లో ఆశావహులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. హస్తిన వెళ్లి ఎవరి లాబీయింగ్ వాళ్లు చేస్తున్నారు. ఓ వైపు విజయ సంకల్పయాత్రంలో పాల్గొంటూ మరోవైపు అభ్యర్థుల కసరత్తుపై కన్నేసి ఉంచారు. గెలుపు గుర్రాలనే బరిలో దించాలని భావిస్తున్న కాషాయదళం.. టికెట్ల కేటాయింపునకు ఏ ప్రామాణికత ఆధారంగా ఇస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు తమ అభ్యర్థిత్వాలపై పలువురు నేతలు ధీమాగా ఉన్నారు, మల్కాజిగిరి నుంచి తనకే అవకాశం వస్తుందని ఈటల రాజేందర్, చేవేళ్ల నుంచి కొండా, మెదక్ నుంచి రఘునందన్, ఆదిలాబాద్ నుంచి మరోసారి తనకే ఛాన్స్ ఇస్తారని సోయం బాపురావు ఆశతో ఉన్నారు. మిగిలిన స్థానాల్లో పార్టీ కోసం కష్టపడిన నేతలకు అలాగే బిఆర్ఎస్ నుంచి వచ్చే సిట్టింగ్ ఎంపీలకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
మేడిగడ్డనో... బొందల గడ్డనో తేల్చాలి
సాక్షి, హైదరాబాద్: అది మేడిగడ్డనో, బొందలగడ్డనో ముందు కేసీఆర్ తేల్చాలని, ఆ తర్వాతే బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు వెళ్లాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి స్పష్టం చేశారు.మేడిగడ్డలో పిల్లర్లు కుంగింది నిజం కాదా అని ప్రశ్నించారు. బుధవారం గాందీభవన్‌లో టీపీసీసీ ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ నేతలు కోట్ల శ్రీనివాస్, చరణ్‌కౌశిక్ యాదవ్‌తో కలిసి జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏం పీకడానికి మేడిగడ్డ వెళుతున్నారంటూ నల్లగొండ సభలో కేసీఆర్ ప్రశ్నించారని గుర్తు చేసిన జగ్గారెడ్డి.. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ చేసిన అవినీతిని పీకడానికి, కట్టిన డబ్బు సంచులు పీకడానికి వెళ్లామని బదులిచ్చారు. బీఆర్ఎస్ నేతలు ముందుగా మంచి బుద్ధి తెచ్చుకోవాలని, మీరు ఒకటి అంటే మా కార్యకర్తలు వంద అంటారన్న విషయం మర్చిపోద్దని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌నుద్దేశించి బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, ఆయన వెంటనే క్షమాపణలు చెపితే వివాదం ఇంతటితో ముగిసిపోతుందన్నారు. బాల్కసుమన్ చిన్నపిలగాడు.. కడియం గాలిపటం మాదిరి బాల్కసుమన్ చిన్నపిలగాడని, పిలగాడు పిలగాడి తీరులోనే ఉండాలని జగ్గారెడ్డి హితవు పలికారు. కడియం శ్రీహరికి రాజకీయ జ్ఞానం లేదని గాలిపటం లాంటి వాడని ఎద్దేవా చేశారు. ఏ పార్టీలో పనిచేసినా ఆ పార్టీ అధినేతల లైన్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని, అది కూడా తెలియని కడియం శ్రీహరి తన వద్దకు వస్తే క్లాసులు చెపుతానని వ్యాఖ్యానించారు. తన టైం బాగాలేక సంగారెడ్డిలో ఓడిపోయాయని, ఐదేళ్లు రెస్ట్ ఇచ్చినందుకు సంగారెడ్డి ప్రజలకు కృతజ్ఞతలని చెప్పిన జగ్గారెడ్డి తాను మెదక్ ఎంపీగా పోటీ చేయడం లేదని, ఈ అంశంలోకి మరోమారు తనను లాగవద్దని విజ్ఞప్తి చేశారు. -
ఆ కుట్రలను తిప్పికొట్టాలి
సిరిసిల్ల/ సిరిసిల్లటౌన్: తెలంగాణ సాగుభూములను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లెలో బుధవారం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలపై రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లకు మరమ్మతులుచేసి ప్రాజెక్టును పునరుద్ధరించాల్సిన ప్రభుత్వం, అసత్య ఆరోపణలతో బీఆర్ఎస్ను బదనామ్ చేసే కుట్ర పన్నుతోందన్నారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ప్రాజెక్ట్‌గా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఏర్పడిన చిన్న చిన్న సాంకేతిక లోపాలను భూతద్దంలో చూపిస్తూ, ప్రాజెక్టు ప్రతిష్టను మంటగలుపుతోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజానిజాలను ప్రజలకు వివరించేందుకు మార్చి 1న చలో కాళేశ్వరానికి శ్రీకారం చుట్టామని కేటీఆర్ వివరించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నారై పాలసీ తీసుకురావాలి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కార్మికులను ఆదుకునేందుకు ఎన్నారై పాలసీని తీసుకురావాలని కేటీఆర్ అన్నారు. ఈ సారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేఎన్నారై పాలసీని తీసుకురావాలని అనుకున్నట్లు తెలిపారు. సుమారు పద్దెనిమిదేళ్లు గల్ఫ్ దేశం జైల్లో ఉండి ఇటీవలే స్వగ్రామానికి వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రం పెద్దూరుకు చెందిన బాధిత కుటుంబాలను బుధవారం ఆయన కలిశారు. వారి యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. ఎన్నారై పాలసీ వస్తే గల్ఫ్ బాధితులకు తోడ్పాటుగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు. -
పాలనలో తేడా ఏమీ లేదు
జహీరాబాద్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ పాలనకు, పదేళ్లు అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్కు తేడా ఏమీ లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ రెండు పార్టీలూ అవినీతి, కుటుంబ పాలన పార్టీలేనని విమర్శించారు. ’’వారు దోచుకున్నారు.. వీరూ దానికే సిద్ధం’’అని వ్యాఖ్యానించారు. బుధవారం రాత్రి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు అడ్డు అదుపు లేకుండా హైదరాబాద్ చుట్టు పక్కల వందల ఎకరాలను ఆక్రమించేశారనీ, రూ.వేల కోట్లు దోపిడీ చేశారనీ, ఎక్కడ చూసినా మాఫియా రాజ్యమేలిందని ఆరోపించారు. కాళేశ్వరాన్ని గోదావరిలో ముంచారని విమర్శించారు. ఇసుక, లిక్కర్, కాంట్రాక్టర్ మాఫియాను పెంచి పోషించిన కేసీఆర్ కుటుంబం రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవలేదని, ప్రజలు కేసీఆర్‌ను ఓడించారు కాబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ గెలిచిన 95 రోజుల్లోనే దోపిడీ మొదలు పెట్టిందన్నారు. రాహుల్‌గాంధీ ముఠా రాష్ట్రంలో రూ.వందల కోట్లను వసూలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి ఢిల్లీకి సూట్ కేసులు.. గతంలో ఇతర రాష్ట్రాలోని నేతలకు ఎన్నికల్లో కేసీఆర్ డబ్బులు ఇచ్చేవారని, నేడు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో దోపిడీకి పాల్పడుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ, కర్ణాటకల్లో అధికారంలో ఉండటంతో వసూళ్లు చేసి పంపాలని కాంగ్రెస్ అధిష్టానవర్గం డిమాండ్ పెట్టినట్టు తెలుస్తోందన్నా రు. అందుకే అధికారంలోకి వచ్చి వంద రోజు లు కూడా కాకుండానే రాష్ట్రం నుంచి ఢిల్లీకి కాంగ్రెస్ నే తలు సూట్‌కేస్‌లు పంపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు బీఆర్ఎస్ నిన్నటి పార్టీ అని, ఆ పార్టీ అవసరం తెలంగాణలో లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు ఓటు వేసినా వృథా అవుతుందన్నారు. కేసీఆర్ ఫాంహౌజ్‌లో ఉన్నారని, రేపో మాపో ఆయన రాజకీయాలను విరమించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇక కాంగ్రెస్‌కు ఓటు వేసినా దేశంమొత్తంమీద 20 ఎంపీ స్థానాలు కూడా సాధించే స్థితిలో ఆ పార్టీ లేదన్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలను గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ను ఓడించడం ఖాయమన్నారు. సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు మరో 3 మున్సిపాలిటీలు
జగిత్యాల/నారాయణఖేడ్/సాక్షి, యాదాద్రి: జగిత్యాల, నారాయణఖేడ్, భువనగిరి మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కోసం బుధవారం సమావేశం ఏర్పాటు చేయగా.. 47 మంది కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో మెంబర్‌గా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ హాజరయ్యారు. చైర్పర్సన్ స్థానానికి బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్ సమిండ్ల వాణిని పార్టీ ప్రతిపాదించింది. రెబల్ అభ్యర్థిగా కౌన్సిలర్ అడువాల జ్యోతి పోటీ పడ్డారు. జ్యోతికి కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరుగురు, బీజేపీ కౌన్సిలర్లు ముగ్గురు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు 8 మంది, స్వతంత్రులు ఐదుగురు, ఎంఐఎం, ఏఎఫ్‌బీఐ పార్టీలకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు అనుకూలంగా ఓటు వేశారు. బీఆర్ఎస్ ప్రతిపాదించిన సమిండ్ల వాణికి 22 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో సభ్యుడు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఓటు వేశారు. ఒకే ఒక్క ఓటు తేడాతో జ్యోతి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కాగా, చైర్‌పర్సన్‌గా ఎన్నికైన జ్యోతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లడం మున్సిపల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్ వశమైంది. బుధవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మా నం నెగ్గడంతో కాంగ్రెస్‌కు చెందిన ఆనంద్ స్వరూప్ షెట్కార్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా దారం శంకర్ ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ వసంతకుమారి ప్రకటించారు. మొత్తం 15 మంది కౌన్సిలర్లకుగాను బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరగా.. కాంగ్రెస్ మద్దతుదారులైన కౌన్సిలర్ల సంఖ్య 11కు చేరింది. ఎనిమిదిమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన ముగ్గురు కౌన్సిలర్లు, ఎక్స్‌అఫిíÙయో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిపి మొత్తం 12 మంది హాజరయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్‌కు సంబంధించి ఒక్కో దరఖాస్తు రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అలాగే భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్ పదవి కూడా బీజేపీ ఖాతాలో చేరింది. కాంగ్రెస్‌కు చెందిన పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్‌గా, బీ జేపీకి చెందిన మాయ దశరథ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు పదవిలో ఉన్న బీఆర్ఎస్కి చెందిన చైర్మన్, వైస్‌చైర్మన్‌పై జనవరి 23న అవిశ్వాసం పెట్టగా నెగ్గింది. దీంతో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం బుధవారం మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికకు 29 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడి హో దాలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. చైర్మన్ పదవికి కాంగ్రెస్ నుంచి పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బీజేపీ నుంచి బొర్ర రాకేష్ పోటీలో నిలిచారు. రాకే ష్కు మద్దతుగా బీజేపీకి చెందిన ఐదుగురు సభ్యులు మా త్రమే చేతులెత్తారు. పోతంశెట్టి వెంకటేశ్వర్లుకు మద్దతుగా 11 మంది కాంగ్రెస్ సభ్యులు, ముగ్గురు బీఆర్ఎస్, ఒక ఇండిపెండెంట్, ఒక బీజేపీ కౌన్సిలర్ చేతులెత్తారు. దీంతో చైర్మన్‌గా వెంకటేశ్వర్లు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. -
ఎంపీ టికెట్ ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు అటు ఢిల్లీ చుట్టూ.. ఇటు సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర టీపీసీసీ పెద్దల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇతర పార్టీల కంటే ముందే ఎంపిక ప్రక్రియ ప్రారంభించిన అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఖరారు రేసులో మాత్రం కొంత వెనుకబడి నట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలు చాపకింద నీరులా తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ముందుకెళుతుంటే కాంగ్రెస్‌లో మాత్రం కొంత డైలమా కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం దక్కిన నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి పెద్ద చేపలు తమ గాలానికి చిక్కుతాయనే ఆలోచనతో పాటు పార్టీలో అంతర్గతంగా నెలకొన్న పోటీ కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా, టికెట్ల విషయమై త్వరలోనే ఢిల్లీలో జరిగే స్క్రీనింగ్ కమిటీ భేటీ తర్వాత స్పష్టత వస్తుందనీ, ఆ తర్వాత సీఈసీ సమావేశంలో ఖరారయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉండటంతో సరైన సమయంలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అంటున్నారు. కాగా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ప్రస్తుతం రాష్ట్రంలో లోక్‌సభ సీట్లకు టికెట్ల ఎంపిక, అభ్యర్థిత్వాల పరిశీలనపైనే పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించినట్టు పార్టీ వర్గాల సమాచారం. కొత్త నేతలకు అవకాశమిస్తారా? ఇటీవలే పార్టీలో చేరిన కొందరు నేతలకు లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఇస్తారనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ జాబితాలో బొంతు రామ్మోహన్ (సికింద్రాబాద్), కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (మల్కాజ్గిరి), పట్నం సునీతా మహేందర్‌రెడ్డి (చేవెళ్ల), నీలం మధు ముదిరాజ్ (మెదక్), తాటికొండ రాజయ్య (వరంగల్) పేర్లు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్, చేవెళ్ల విషయంలో అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారయ్యాయనే చర్చ కూడా జరుగుతోంది. మల్కాజ్గిరి సీటు కోసం దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన త్వరలోనే పార్టీలోకి వస్తున్నారని, ఆయనతో పాటు సినీ నిర్మాత బండ్లగణేశ్, కొందరు ఇతర నాయకుల పేర్లను పరిశీలిస్తారని అంటున్నారు. ఇక, మెదక్ విషయంలో మైనంపల్లి హనుమంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు వైద్య మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష కూడా రేసులో ఉండడం గమనార్హం. వరంగల్ విషయానికి వస్తే అక్కడ పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడి నుంచి తాటికొండ రాజయ్యతో పాటు జిల్లా రిజి్రస్టార్ హరికోట్ల రవి, దొమ్మాటి సాంబయ్య, సింగాపురం ఇందిర, అద్దంకి దయాకర్, డాక్టర్. ఆర్. పరమేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే నాగర్‌కర్నూల్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలను ఏ సామాజిక వర్గానికి ఇస్తారన్న దాన్ని బట్టి వరంగల్‌లో అభ్యర్థి ఖరారయ్యే అవకాశాలున్నాయి. నాగర్‌కర్నూల్ నుంచి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి పేరు దాదాపు ఖరారైందని తెలుస్తోంది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, డాక్టర్ చారగొండ వెంకటేశ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు వంశీ, సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతకాని, పెర్క శ్యాంకుమార్లో ఒకరికి అవకాశం దక్కే చాన్సుంది. ఐదు రిజర్వుడు, మూడు బీసీ, ఒకటి మైనార్టీకి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడు ఎస్సీలకు, రెండు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. ఇవి పోను మిగిలిన 12 స్థానాల్లో మూడు స్థానాలను బీసీలకు ఇస్తారని, ఒక్క స్థానాన్ని మైనార్టీలకు కేటాయిస్తారని గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిగిలిన 8 చోట్ల జనరల్ అభ్యర్థులు పోటీ చేయనున్నట్టు సమాచారం. బీసీలకిచ్చే స్థానాల్లో మెదక్, జహీరాబాద్, సికింద్రాబాద్ ఉంటాయని తెలుస్తోంది. హైదరాబాద్ లోక్‌సభకు మైనార్టీ నేతను పోటీ చేయిస్తారని, హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సమీర్వలిఉల్లాకు సీటు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఈయనతో పాటు ఫిరోజ్‌ఖాన్, అలీ మస్కతి లాంటి సీనియర్ల పేర్లు కూడా మొదటి నుంచీ ప్రచారంలో ఉన్నాయి. మిగిలిన స్థానాల విషయానికి వస్తే వంశీచందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), పటేల్ రమేశ్‌రెడ్డి, జానారెడ్డి ( నల్లగొండ), చామల కిరణ్‌రెడ్డి, కుంభం కీర్తిరెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మి, కోమటిరెడ్డి పవన్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి, పున్నా కైలాశ్‌నేత, చనగోని దయాకర్ (భువనగిరి), సురేశ్òÙట్కార్ (జహీరాబాద్), వీహెచ్, జెట్టి కుసుమకుమార్, పొంగులేటి ప్రసాదరెడ్డి, మల్లునందిని, వి.వి.రాజేంద్రప్రసాద్ (ఖమ్మం), పెద్దిరెడ్డి, అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, రుద్ర సంతోశ్ (కరీంనగర్), టి.జీవన్‌రెడ్డి, ముత్యాల సునీల్‌రెడ్డి, ఈరవత్రి అనిల్ (నిజామాబాద్), బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, డాక్టర్. శంకర్‌నాయక్, విజయాబాయి (మహబూబాబాద్), నరేశ్ జాదవ్, రేఖానాయక్ (ఆదిలాబాద్) పేర్లు వినిపిస్తున్నాయి. రాహుల్ వచ్చేనా? ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేస్తారనే అంశంపై గాంధీభవన్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేరళలోని వాయనాడ్ స్థానంలో ఇండియా కూటమి నుంచి సీపీఐ పోటీ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో రాహుల్‌గాంధీ కర్ణాటక లేదా తెలంగాణ నుంచి బరిలో ఉంటారని తెలుస్తోంది. గతంలో కూడా సోనియా, ప్రియాంకాగాంధీ తెలంగాణలో పోటీ చేస్తారని, సోనియాగాం«దీని తెలంగాణ నుంచే రాజ్యసభకు ఎంపిక చేస్తారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా రాహుల్ పేరు తెరపైకి రావడం గమనార్హం. ఒకవేళ ఆయన తెలంగాణ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటే ఖమ్మం లేదా నల్లగొండ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. -
తప్పు కప్పించుకోవడానికే బీఆర్ఎస్ జిమ్మిక్కులు: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కమిషన్ల కోసమే ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో కట్టారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంకా ప్రాజెక్టు పూర్తి కావడానికి 1లక్ష 47 వేల కోట్లు కావాలన్నారు. కాళేశ్వరంలో 25 వేల కోట్ల పనులు ఎలాంటి డీపీఆర్ లేకుండా పనులు అలాట్ చేశారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి జిమ్మిక్కులు చేస్తోంది. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డపై నిజాలు చెప్పకుండా.. తప్పులు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లన మేడిగడ్డ పూర్తిగా నాశనం అయ్యింది. బీఆర్ఎస్ ఉచిత సలహాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. మేడిగడ్డను ఎన్డీఎస్ఏకు అప్పగించామని, నివేదిక ఆధారంగా భవిష్యత్ చర్యలు ఉంటాయని ఉత్తమ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ బ్యారేజీ పర్యటనను స్వాగతిస్తున్నామన్న ఉత్తమ్.. ఇంత అవినీతి చేసి కూడా మేడిగడ్డకు వెళ్తామంటున్నారంటూ ఎద్దేవా చేశారు. -
‘హిమాచల్ పరిస్థితే తెలంగాణలో రావొచ్చు’: కే లక్ష్మణ్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాజకీయాలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న పరిస్థితులే.. త్వరలో తెలంగాణలోనూ కనిపించవచ్చని వ్యాఖ్యానించారాయన. బుధవారం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార, ప్రధాన ప్రతిపక్షంపై మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో ఉంది. అధికార కాంగ్రెస్‌పై సొంత ఎమ్మెల్యేలే తిరగబడ్డారు. అసహనంతోనే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితే తెలంగాణలోనూ రావొచ్చు. తెలంగాణలో తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్‌లో ఉన్నారు. రాబోయే రోజుల్లో రేవంత్‌రెడ్డి పరిస్థితి దారుణంగా మారుతుంది. అని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తా ఇక లోక్‌సభ ఎన్నికల కోసం గెలిచే గుర్రాలనే బరిలోకి దింపుతున్నట్లు తెలిపారాయన. ముఖ్యమంత్రి సహా మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. వాళ్లు తమ భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. దురుసు మాటలు ఆపి హామీల సంగతి ఆలోచించాలన్నారాయన. ఇక.. పదేళ్లు అధికారంలో ఉండి ఒక్కసారిగా అది దూరం అయ్యే సరికి బీఆర్ఎస్ సైతం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని అన్నారాయన. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. బీఆర్ఎస్ నుంచి కూడా కొందరు మాతో టచ్‌లో ఉన్నారు. అయితే.. మేం ఆచితూచి వ్యవహరిస్తాం అని అన్నారాయన. ఇక.. ఎన్నికల ముందు పథకాలు అందరికీ అని చెప్పి, ఇప్పుడేమో కండిషన్లు అప్లై అని కాంగ్రెస్ అంటోందని.. ప్రజలను మోసం చేసేందుకే గ్యారెంటీలు ఇచ్చిందని విమర్శించారాయన. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులు విరిచి కొడితే కానీ గ్యారంటీలు అమలు కావంటూ చురకలంటించారు. బీజేపీ సంకల్ప యాత్రలను కాంగ్రెస్ అడ్డుకోవాలని చూస్తుందని.. అయినా ఈ యాత్రలు జగన్నాథ రథ చక్రాలుగా కదులుతూనే ఉంటాయని బీజేపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ తోడు దొంగలుగా బిజెపిపై అరోపణలు చేస్తున్నాయి. కేటీఆర్, హరీష్‌రావులకు దమ్ముంటే ఒక్క లోక్‌సభ సీటులో అయినా పోటీ చేసి గెలవాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు. -
రామోజీకి వణుకు.. అసలు కథ ముందుంది?
వృద్ధాప్యంలో ఉన్న ఈనాడు మీడియా యజమాని రామోజీరావుకు పెద్ద సవాలే ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవని ఆయన భయపడుతున్నారనిపిస్తోంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన ఇష్టారాజ్యంగా నడిపారు. వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని మీడియా రాజ్యాన్ని సృష్టించారు. ఆ మీడియాను అడ్డం పెట్టుకుని వ్యాపారంలో తనకు ఎదురులేదన్నట్లుగా ప్రవర్తించారు. కానీ, సీఎం జగన్ రూపంలో తనకు ఇంత ప్రతిఘటన ఎదురవుతుందని ఆయన ఊహించలేకపోయారు. తన మార్గదర్శి సంస్థలో జరిగిన పలు అక్రమాలు, అవినీతిని, నల్లధనం తదితర విషయాలన్నిటినీ ఏపీ సీఐడీ బహిర్గతం చేసింది. దాంతో సీఎం జగన్‌పై కక్ష కట్టిన రామోజీ ఇప్పుడు తన మీడియాను పూర్తి స్థాయిలో టీడీపీ కరపత్రంగా, బాకాగా మార్చేశారు. ఈసారి ముఖ్యమంత్రి జగన్ పోటీ పడుతున్నది చంద్రబాబు కాదని, రామోజీరావు అని అంతా భావించే దశకు వెళ్లారు. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుందని, ఎవరో ఒకరు తగులుతారని అంటారు. అలాగే రామోజీ సంస్థలలోని ఆర్దిక అరాచకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కనిపెట్టింది. తత్ఫలితంగా ఆయన ప్రతిష్ట మసకబాసింది. దాంతో ఆయనకు సీఎం జగన్‌పై ఎక్కడ లేని ద్వేషం ఏర్పడింది. నిజానికి సీఎం జగన్‌పై రామోజీరావుకు ఉన్న పగ ఈనాటిది కాదు. ముఖ్యమంత్రి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ నుంచే రామోజీ బొడ్డుకు సున్నం రాసుకున్నట్లు వ్యవహరించేవారు. దానికి కారణం అంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనను రాజగురువుగా భావించి, నిత్యం సంప్రదింపులు చేస్తూ ఆయనను సంతృప్తిపరుస్తుండేవారు. 1989-1994 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిలతో మరీ ఈ స్థాయిలో గొడవపడేవారు కారు. వారు కూడా చూసి చూడనట్లు పోతుండేవారు. రామోజీ మీడియాకు వారు కొంత భయపడేవారు. 1994లో ఎన్.టి.రామారావు అంత మెజార్టీతో అధికారంలోకి వస్తారని రామోజీ ఊహించలేదు. అయినా ఎన్టీఆర్ భారీ ఆధిక్యతతో అదికారంలోకి రావడంతో కొద్దికాలం సర్దిపెట్టుకున్నారు. కానీ, ఆ తర్వాత పరిణామాలలో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతిని సాకుగా చూపుతూ ఆయనను దారుణంగా చిత్రీకరిస్తూ వ్యంగ్య కార్టూన్లు వేయించేవారు. చంద్రబాబుకు కొమ్ముకాసి ఎన్టీఆర్‌ను దించడంలో రామోజీ తనదైన పాత్రను పోషించారు. అప్పటి నుంచి తానే షాడో ముఖ్యమంత్రి అన్నట్లు సంతోషపడుతుండేవారు. ఆయనకు ప్రభుత్వపరంగా ఏది కావాలన్నా ఎదురులేని పరిస్థితి సృష్టించుకున్నారు. ఆ పరిస్థితిలో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీని ఓడించి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు. ఎందువల్లో వైఎస్ పట్ల మొదటి నుంచి అంత సానుకూలంగా ఉండేవారు కాదు. అయినా వైఎస్సార్ పెద్దగా పట్టించుకోకుండా, తన పని తాను చేసుకుపోయేవారు. కాకపోతే ఆ రెండు పత్రికలు అంటూ విమర్శలు చేసేవారు. వాటికి పోటీగా కాంగ్రెస్‌కు కూడా ఒక పత్రిక ఉండాలని, ఒక టీవీ ఉండాలని తలపోశారు. అందుకు అనుగుణంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి మీడియాను ఏర్పాటు చేశారు. అది రామోజీకి పుండుమీద కారం చల్లినట్లయింది. తన మీడియాకే పోటీకి వస్తారా అన్న అహంభావంతో వైఎస్ ప్రభుత్వంపై చెలరేగడం ఆరంభించారు. చివరికి సీఎంగా ఉన్న వైఎస్సార్‌పై ఒక సంపాదకీయం రాస్తూ ‘ఉల్టా చోర్, కొత్వాల్ కో డాంటే’ అంటూ హెడింగ్ పెట్టి వైఎస్‌ను ఘోరంగా అవమానించారు. అదే తరుణంలో రామోజీ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌తో జరుగుతున్న అక్రమ డిపాజిట్ల సేకరణపై అప్పట్లో ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణకుమార్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో రివర్స్ కథ మొదలైంది. రామోజీ అంతవరకు తాను ఏమీ తప్పు చేయడం లేదన్నట్లుగా ప్రజల దృష్టిలో పడుతూ, మరోవైపు అక్రమంగా డిపాజట్ల సేకరణకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయడంలో ఉండవల్లి సఫలం అయ్యారు. అయితే, తీసుకున్న డిపాజిట్లను రామోజీ సకాలంగా చెల్లిస్తున్నారుగా అన్న ప్రచారం జరిగేది. కానీ, అసలు డిపాజిట్లు సేకరించడమే అక్రమమని, నేరమని ఆర్బీఐ ప్రకటించడంతో రామోజీ తన టీవీ చానళ్లు కొన్నిటిని విక్రయించి సుమారు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను తిరిగి చెల్లించవలసి వచ్చింది. అది ఆయనకు మరింత ఆగ్రహం తెప్పించింది. 2009లో రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో ఈ కేసుకు బ్రేక్ పడింది. ఆయన తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిలు రామోజీతో రాజీపడిపోయారు. అంతలో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రామోజీ స్నేహం చేస్తూ, కాదు.. కాదు... భజన చేస్తూ.. తన ఆస్తులవైపు, తన సంస్థల లావాదేవీల వైపు రాకుండా చూసుకోగలిగారు. అదే సమయంలో విభజిత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవడంతో ఆయనకు ఎదురులేకుండా పోయింది. చంద్రబాబును భుజాన వేసుకుని వైఎస్ కుమారుడు జగన్మోహన్రెడ్డి యువకుడు అన్న ఆలోచన కూడా లేకుండా దాడి ఆరంభించారు. సోనియాగాంధీ, చంద్రబాబులకు రామోజీ తోడై సీబీఐ పెట్టిన అక్రమ కేసులపై తన మీడియా ద్వారా విపరీత వ్యతిరేక ప్రచారం చేసేవారు. అయినా.. జగన్మోహన్రెడ్డి మాత్రం వీరిని పట్టించుకునేవారుకారు. 2014 ఎన్నికలలో రామోజీ మీడియా చేసిన అబద్దపు ప్రచారం కొంత పనిచేసింది. కారణం ఏమైనా జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాలేకపోయారు. అయినా ఆయన పట్టువదలకుండా రాజకీయాలు నడిపారు. అది ఈనాడుకు నచ్చలేదు. జగన్మోహన్రెడ్డిని దెబ్బతీశాం కదా అనుకుంటే మళ్లీ కెరటంలా లేస్తున్నారని గమనించారు. 2019 ఎన్నికల ముందు కూడా జగన్మోహన్రెడ్డిపై దారుణమైన కథనాలు అల్లారు. కానీ, జనం నమ్మలేదు. రామోజీ రాతలను ఖాతరు చేయకుండా ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్‌కు పట్టం కట్టారు. అప్పటి నుంచి మళ్లీ రామోజీలో అసూయ పెరిగింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనపై దాడి ఆరంభించారు. కొంతకాలం ఓపికగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేచి చూసింది. అయినా రామోజీ తన వైఖరిని మార్చుకోకుండా, ఈనాడు మీడియాను టీడీపీ ప్రచార బాకాగా వాడడం ఆరంభించారు. అంతవరకు అయితే ఫర్వాలేదు. సీఎం జగన్‌పై ఉన్నవి, లేనివి కలిపి పచ్చి అబద్దాలు రాయడం ఆరంభించారు. ఈ దశలో మార్గదర్శి చిట్స్‌లో జరిగిన అక్రమాలు, అక్రమ డిపాజిట్ల వసూలు కొనసాగించడం సీఐడీ దృష్టికి వెళ్లి, వారు రంగంలో దిగారు. దాంతో ఒక్కసారిగా రామోజీ బిత్తరపోయారు. తాను ఎవరికి దొరకనని, ఎవరూ తన జోలికి రావడానికి సాహసం చేయరని అనుకునే రామోజీరావుకు ముఖ్యమంత్రి జగన్ రూపంలో సవాల్ ఎదురైంది. మార్గదర్శి చిట్స్‌లో సభ్యుల చేరిక మొదలు, చిట్టీలు పాడుకున్నవారికి సకాలంలో చెల్లించకపోవడం, డిపాజిట్ల అక్రమ సేకరణ, నల్లధనం చలామణి మొదలైనవాటిని ఏపీ సీఐడీ కనిపెట్టడంతో రామోజీకి సినిమా మొదలైంది. చివరికి ఆయన సీఐడీ అధికారుల విచారణను ఎదుర్కున్నారు. అప్పటికీ న్యాయ వ్యవస్థలో తనకు ఉన్న పట్టుతో ఈ కేసులన్నీ వేగంగా సాగకుండా అడ్డుపడుతున్నారు. ఏపీ కేసులకు కూడా తెలంగాణ హైకోర్టులో స్టేలు తెచ్చుకుని తప్పించుకోచూస్తున్నారు. మార్గదర్శి చిట్స్‌లో సుమారు 800కోట్ల నల్లధనం లావాదేవీలు జరిగాయని సీఐడీ గుర్తించింది. చిట్స్ నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని అధికారులు గుర్తించడంతో ఏపీలో సంస్థ బ్రాంచ్‌లలో వ్యాపారం స్తంభించడం ఆరంభమైంది. టర్నోవర్‌పై దాని ప్రభావం పడింది. తాజాగా సాక్షిలో వచ్చిన కథనం ప్రకారం చిట్స్రూపేణా కాని, అక్రమ డిపాజిట్ల రశీదుల రూపేణా కాని సుమారు 4800 కోట్ల రూపాయల మేర బకాయిలు పడ్డారని అధికారులు అంచనా వేసినట్లు రావడం సంచలనాత్మకంగా మారింది. రామోజీ మరీ రెచ్చిపోయి, బరితెగించి వైఎస్ ప్రభుత్వంపై ఎందుకు ఇంత నీచంగా వార్తలు రాస్తున్నారు అని ఆలోచించేవారికి ఇప్పుడు సమాధానం దొరికినట్లయింది. తన వ్యాపార లావాదేవీల అరాచకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం బహిర్గతం చేసిందన్న కోపం ఒకవైపు, మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే, తన ఆట కట్టినట్లే అవుతుందన్న భయం మరోవైపు రామోజీ బృందాన్ని వేటాడుతున్నాయి. దాంతో ఈనాడు మీడియాను పణంగా పెట్టి ముఖ్యమంత్రి జగన్‌పై విపరీతమైన ధోరణిలో విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అదికారంలోకి వస్తే ఈ కేసులేవీ ముందుకు సాగవు అన్న భావన. అందుకే ఈ ఎన్నికలు చంద్రబాబుకన్నా, రామోజీకే అతి పెద్ద సవాలుగా మారాయనిపిస్తుంది. అంతే తప్ప తనపై వచ్చిన కథనాలకు సమాధానం ఇవ్వడానికి, మార్గదర్శిలో జరిగిన అవకతవకలకు సంజాయిషీ ఇవ్వడానికి బదులు సీఎం జగన్ ప్రభుత్వంపై దాడి చేయడాన్ని ఆయన మార్గంగా ఎంచుకున్నారు. నిజానికి జర్నలిజంలో ఒక సూత్రం ఉంది. తన సొంత వ్యాపార ప్రయోజనాలకోసం మీడియాను అడ్డు పెట్టుకోరాదు. ఆ పరిస్థితిని మనం ఆశించలేకపోయినా, ఒక రాజకీయ పార్టీని అనైతికంగా భుజాన వేసుకుని రామోజీ తన మీడియాను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పచ్చి అబద్దాలు రాస్తూ సైకోయిజాన్ని ప్రదర్శిస్తూ సైతాన్ మాదిరి ప్రవర్తిస్తున్నారన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు. అయినా ఈ విమర్శలన్నిటి కన్నా తన సంస్థపై వచ్చిన కేసులను కప్పిపుచ్చుకోవడానికి గాను ఆయన తన మీడియాను ఫణంగా పెట్టి మరీ దుష్ప్రచారం సాగిస్తున్నారని చెప్పాలి. అందుకే టీడీపీ గెలుపు చంద్రబాబుకన్నా, రామోజీకే ఎక్కువ అవసరంగా మారింది. అయినా ఆయన ఆశలు నెరవేరే సూచనలు కన్పించడం లేదు! -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు