
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి, కుటుంబ పాలన పార్టీలే
వారు దోచుకున్నారు.. వీరూ దానికే సిద్ధం
పాకిస్తాన్‌ను ఏకాకిని చేసింది మోదీనే..
కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించలేదు, కేసీఆర్‌ను ఓడించారు
విజయ సంకల్ప యాత్ర సభలోకేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
జహీరాబాద్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ పాలనకు, పదేళ్లు అధికారం వెలగబెట్టిన బీఆర్‌ఎస్‌కు తేడా ఏమీ లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ రెండు పార్టీలూ అవినీతి, కుటుంబ పాలన పార్టీలేనని విమర్శించారు. ’’వారు దోచుకున్నారు.. వీరూ దానికే సిద్ధం’’అని వ్యాఖ్యానించారు. బుధవారం రాత్రి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.
బీఆర్‌ఎస్ నేతలు పదేళ్ల పాటు అడ్డు అదుపు లేకుండా హైదరాబాద్ చుట్టు పక్కల వందల ఎకరాలను ఆక్రమించేశారనీ, రూ.వేల కోట్లు దోపిడీ చేశారనీ, ఎక్కడ చూసినా మాఫియా రాజ్యమేలిందని ఆరోపించారు. కాళేశ్వరాన్ని గోదావరిలో ముంచారని విమర్శించారు. ఇసుక, లిక్కర్, కాంట్రాక్టర్ మాఫియాను పెంచి పోషించిన కేసీఆర్ కుటుంబం రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవలేదని, ప్రజలు కేసీఆర్‌ను ఓడించారు కాబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ గెలిచిన 95 రోజుల్లోనే దోపిడీ మొదలు పెట్టిందన్నారు. రాహుల్‌గాంధీ ముఠా రాష్ట్రంలో రూ.వందల కోట్లను వసూలు చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్రం నుంచి ఢిల్లీకి సూట్ కేసులు..
గతంలో ఇతర రాష్ట్రాలోని నేతలకు ఎన్నికల్లో కేసీఆర్ డబ్బులు ఇచ్చేవారని, నేడు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో దోపిడీకి పాల్పడుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ, కర్ణాటకల్లో అధికారంలో ఉండటంతో వసూళ్లు చేసి పంపాలని కాంగ్రెస్ అధిష్టానవర్గం డిమాండ్ పెట్టినట్టు తెలుస్తోందన్నా రు. అందుకే అధికారంలోకి వచ్చి వంద రోజు లు కూడా కాకుండానే రాష్ట్రం నుంచి ఢిల్లీకి కాంగ్రెస్ నే తలు సూట్‌కేస్‌లు పంపుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు
బీఆర్‌ఎస్ నిన్నటి పార్టీ అని, ఆ పార్టీ అవసరం తెలంగాణలో లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేసినా వృథా అవుతుందన్నారు. కేసీఆర్ ఫాంహౌజ్‌లో ఉన్నారని, రేపో మాపో ఆయన రాజకీయాలను విరమించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇక కాంగ్రెస్‌కు ఓటు వేసినా దేశంమొత్తంమీద 20 ఎంపీ స్థానాలు కూడా సాధించే స్థితిలో ఆ పార్టీ లేదన్నారు.
రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలను గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ను ఓడించడం ఖాయమన్నారు. సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు.