అసెంబ్లీలో పెడతాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments On Kaleshwaram Project Irregularities | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో ‘కాళేశ్వరం’పై చర్చ పెడతాం: సీఎం రేవంత్‌

Aug 5 2025 1:21 AM | Updated on Aug 5 2025 1:21 AM

CM Revanth Reddy Comments On Kaleshwaram Project Irregularities

‘కాళేశ్వరం’పై చర్చించాకే చర్యలు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి

జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికను కేబినెట్‌ ఆమోదించింది

ఊరు, పేరు, అంచనాలు మార్చి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలింది 

ఇది పూర్తి స్వతంత్ర కమిషన్‌.. అందరి అభిప్రాయాలు తీసుకొని నివేదిక ఇచ్చింది  

కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే ముందుకెళ్తాం 

అసెంబ్లీలో అందరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పొచ్చు 

ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలుండవు 

మంత్రివర్గ సమావేశం తరువాత మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి  

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నివేదికను అసెంబ్లీలోపెట్టి చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని చెప్పారు. ఇది స్వతంత్ర కమిషన్‌ ఇచ్చిన నివేదిక అని, సిఫార్సుల ఆధారంగా చర్యలు ఉంటాయి తప్ప.. ఎలాంటి కక్షపూరిత చర్యలకు తావులేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. 

కమిషన్‌ ఇచ్చిన నివేదికపై నీటిపారుదల, న్యాయ, సాధారణ పరిపాలన శాఖలకు చెందిన ముగ్గురు కార్యదర్శులతో కమిటీ వేసి, సంక్షిప్త నివేదిక రూపొందించినట్లు చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కమిషన్‌ నివేదికపై కూలంకషంగా చర్చించి ఆమోదం తెలిపింది. అనంతరం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.  

నాడు హామీ ఇచ్చాం... 
రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోవడంపై అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేపడతామని ఎన్నికలప్పుడు ప్రజలకు హామీ ఇచ్చా మని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. దాని ప్రకారమే న్యాయరంగంలో విశేష అనుభవం ఉన్న ఉమ్మడి ఏపీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, తొలి లోక్‌పాల్‌గా వ్యవహరించిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ఆధ్వర్యంలో కమిషన్‌ను నియమించామని గుర్తుచేశారు. 

ఈ కమిషన్‌ 16 నెలలపాటు అందరి అభిప్రాయాలు తీసుకుని 665 పేజీల నివేదికను రూపొందించిందని, దీన్ని మంత్రివర్గం ఆమోదించిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘ఊరు, పేరు, అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం కూలిపోయింది. ఈ విషయాన్ని కమిషన్‌ స్పష్టంగా తన నివేదికలో పొందుపర్చింది. రాజకీయ నేతలు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లు, నిపుణులు, ప్రజా సంఘాలు, ప్రజలు, పాత్రికేయుల నుంచి సమాచారం సేకరించడమేకాక, వారి వాదనలను పరిగణనలోకి తీసుకుంది. 

మంత్రివర్గం ఆమోదించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి, అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను, ప్రతిపక్ష నాయకుడు, అప్పటి నీటిపారుదల మంత్రి, ఇతర మంత్రుల అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి అవకాశం కల్పిస్తాం. దీనిపై సభ్యులకు పూర్తి అవగాహన కల్పిస్తాం. తొందరలోనే సభ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను విన్నాకే ప్రభుత్వం ముందుకెళ్తుంది’ అని సీఎం చెప్పారు. 
 
నోటీసులు ఇచ్చి.. వాదనలు విన్న కమిషన్‌ 
‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక భూమిక పోషించిన అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఐఏఎస్‌ అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇచ్చి వారికి తమ వాదనలు వినిపించడానికి కమిషన్‌ పూర్తి అవకాశం కల్పించింది. 

దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత–చేవేళ్లకు గోదావరి నీళ్లు తీసుకుని రావడానికి ప్రాజెక్టు డిజైన్‌ చేస్తే.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఏడాదిన్నర తరువాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రీడిజైన్‌ పేరిట ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్టు స్థలం తుమ్మిడిహెట్టి నుంచి మార్చి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నిర్మించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన మూడేళ్లల్లోనే మేడిగడ్డ కుంగడం, అన్నారం, సుందిళ్ల పగలడం జరిగింది. ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలు ఉన్నాయని నిపుణులు నివేదించారు. ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయని సాంకేతిక నిపుణులు, నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీతో సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించి వాటి మీద విచారణ చేశాయి. ఆ విచారణలో ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణలో లోపాలు ఉన్నాయిని తేల్చాయి. దీని మీద పూర్తిస్థాయి విచారణ జరగాలని ఆనాటి ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చాయి. 

మా పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీతోపాటు టీపీసీసీ అధ్యక్షుడిగా నేను, మా కాంగ్రెస్‌ నాయకులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు, ఉత్తమకుమార్‌ రెడ్డి ఈ ప్రాజెక్టులను సందర్శించాం. లోపభూయిష్టమైన నిర్ణయాలు, అవినీతి, అశ్రిత పక్షపాతం నిర్లక్ష్య వైఖరి ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల  రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోయింది’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. 

అనుకూలమైతే ఒకలా.. లేదంటే మరోలా.. 
నివేదికలు తమకు అనుకూలంగా ఉంటే ఒకలా.. లేదంటే మరోలా మాట్లాడడం బీఆర్‌ఎస్‌ నాయకులకు అలవాటేనని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కమిషన్‌ నివేదికను వారు తప్పుపట్టడం సహజమేనని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ నివేదికనో, ప్రభుత్వ నివేదికనో కాదని, ఇది స్వతంత్ర కమిషన్‌ ఇచ్చిన నివేదిక అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎవరు ఏ రకమైన విశ్లేషణలు చేస్తారన్నది వారి విజŠక్షతకే వదిలేస్తున్నానని చెప్పారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తన బావ (హరీశ్‌రావు) అవినీతి చేశారని, ఇందులో ఎవరెవరు కుమ్మక్కయ్యారో కవిత.. జస్టిస్‌ చంద్ర ఘోష్‌ కమిషన్‌కు నివేదిక ఇచ్చి ఉంటే బాగుండేదని సీఎం వ్యాఖ్యానించారు. కవిత అప్పుడు మాట్లాడకుండా, ఇప్పుడు ఇక్కడ ప్రశ్నించడం ఎందుకని, కోల్‌కతాకు వెళ్లి అడగమనండి అని పేర్కొన్నారు. కమిషన్‌ నివేదికపై ఊహాజనిత వార్తలు, కల్పనకు అవకాశం ఉండకూడదనే ఏ శషభిషలు లేకుండా అన్ని విషయాలను స్పష్టంగా మీడియాకు చెప్పానన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement