ఆ కుట్రలను తిప్పికొట్టాలి | Sakshi
Sakshi News home page

ఆ కుట్రలను తిప్పికొట్టాలి

Published Thu, Feb 29 2024 1:14 AM

Former Minister KTRs call to BRS ranks on Kaleswaram - Sakshi

కాళేశ్వరంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులకు మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపు 

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్ల కోసమే బీఆర్‌ఎస్‌ను బద్నాం చేస్తున్నారు

కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలపై కరపత్రం విడుదల 

సిరిసిల్ల/ సిరిసిల్లటౌన్‌: తెలంగాణ సాగుభూములను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లెలో బుధవారం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలపై రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లకు మరమ్మతులుచేసి ప్రాజెక్టును పునరుద్ధరించాల్సిన ప్రభుత్వం, అసత్య ఆరోపణలతో బీఆర్‌ఎస్‌ను బదనామ్‌ చేసే కుట్ర పన్నుతోందన్నారు.

ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ప్రాజెక్ట్‌గా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఏర్పడిన చిన్న చిన్న సాంకేతిక లోపాలను భూతద్దంలో చూపిస్తూ, ప్రాజెక్టు ప్రతిష్టను మంటగలుపుతోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజానిజాలను ప్రజలకు వివరించేందుకు మార్చి 1న చలో కాళేశ్వరానికి శ్రీకారం చుట్టామని కేటీఆర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఎన్నారై పాలసీ తీసుకురావాలి 
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కార్మికులను ఆదుకునేందుకు ఎన్నారై పాలసీని తీసుకురావాలని కేటీఆర్‌ అన్నారు. ఈ సారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తేఎన్నారై పాలసీని తీసుకురావాలని అనుకున్నట్లు తెలిపారు.

సుమారు పద్దెనిమిదేళ్లు గల్ఫ్‌ దేశం జైల్లో ఉండి ఇటీవలే స్వగ్రామానికి వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రం పెద్దూరుకు చెందిన బాధిత కుటుంబాలను బుధవారం ఆయన కలిశారు. వారి యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. ఎన్నారై పాలసీ వస్తే గల్ఫ్‌ బాధితులకు తోడ్పాటుగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు.

 
Advertisement
 
Advertisement