ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు | Sakshi
Sakshi News home page

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

Published Sun, Mar 10 2024 4:35 AM

KTR Comments On Congress Party and Revanth reddy - Sakshi

గతేడాది 14 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి

కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేయడంతోనే  పొలాలు ఎండుతున్నాయి

కేసీఆర్‌ సీఎం అయితే.. మేడిగడ్డలో రిపేరు చేసి నీళ్లు ఎత్తిపోసేవాడు

ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే బోనస్‌ జీవో తేవాలి

రాజన్నసిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు

సిరిసిల్ల: తెలంగాణలో పొలాలు ఎండుతున్నాయి.. మోటార్లు కాలుతున్నాయి.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతోనే కరువు వచ్చిందని ఆరోపించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లో శనివారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. లంకెబిందెలు ఉన్నాయని వస్తే ఉత్త మట్టికుండలే ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, లంకెబిందెల కోసం రాత్రిపూట గడ్డపార, తట్టలతో వెతికేవాళ్లను ఏం అంటారని కేటీఆర్‌ ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని దొంగచేతిలో పెట్టారని ధ్వజమెత్తారు. ఈ ఏడాది కాలం లేక కరువు వచ్చిందంటున్నారని, కానీ గతేడాది 14 శాతం అధికంగా వర్షాలు పడ్డాయని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రిపేరు చేసి నీళ్లను ఎత్తిపోస్తే.. ఒక్క ఎకరం కూడా ఎండిపోయేది కాదన్నారు. అదే కేసీఆర్‌ ముఖ్య మంత్రి అయి ఉంటే.. మేడిగడ్డ వద్ద కుంగిపోయిన రెండు పిల్లర్లకు రిపేరు చేయించేవారన్నారు. దేశంలోని 5వేల టిప్పర్లను, 4వేల ప్రొక్లెయిన్‌లను తెప్పించి, కాంట్రాక్టర్‌తో మాట్లాడి రెండు నెలల్లో రిపేరు చేయించి నీళ్లు ఎత్తిపోసేవాడని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

రైతుల రుణమాఫీ ఏది ?
డిసెంబర్‌ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయగానే రైతుల రూ.2లక్షల రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు రుణమాఫీ చేయలేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. రైతుబంధు ఎందుకు వేయలేదని నిలదీశారు. పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఎందుకు ఇవ్వలేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే రైతులకు బోనస్‌ ఇచ్చే జీవోను తేవాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ను నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు
ఉద్యమ నాయకుడిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను పట్టుకుని నోటికి ఎంత వస్తే అంత మాట్లా డుతున్నారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేగులు మెడలో వేసుకుంటా.. గొంతు కోస్తా.. లాగులో తొండలు వదులుతా అంటూ.. సీఎం రేవంత్‌రెడ్డి దారుణంగా మాట్లాడుతు న్నారని ఆరోపించారు. రాజకీయాలు ఎన్నికల్లో చూసుకుందాం.. రైతులు చావకముందే కాళేశ్వరం ప్రాజెక్టును రిపేరు చేసి ఎండిపోతున్న పొలాలకు నీళ్లు ఇవ్వాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో అధికారులు కూడా కాంగ్రెస్‌ తొత్తుల్లాగా పని చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ముందే చెప్పారని మోసపోతే.. గోసపడతామని, గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు కాంగ్రెస్‌ను నమ్మి గోసపడుతున్నారన్నారు. పోయిన చోటే వెతుక్కో వాలనే చందంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ను గెలిపించాలని కోరారు. టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement