
కనీసం డజను స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పావులు
త్రిముఖ పోరులో పైచేయి సాధిస్తామని ధీమా
లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై కేసీఆర్ కసరత్తు
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తేలాకే పార్టీ అభ్యర్థులను ప్రకటించే యోచన
నిజామాబాద్, జహీరాబాద్, భువనగిరి స్థానాల్లో బీసీలకు అవకాశం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూసుకోవడంతోపాటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా రాణించేందుకు బీఆర్‌ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఆయా పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేసేలా అనుసరించాల్సిన వ్యూహాలకు పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పదును పెడుతున్నారు.
కనీసం డజను స్థానాలు లక్ష్యంగా..
తెలంగాణ ఉద్యమ సమయంలో 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన గులాబీ దళం... రాష్ట్ర అవతరణ తర్వాత 2014, 2019లలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగింది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను 2004లో 5, 2009లో 2, 2014లో 11 సీట్లలో గెలుపొందగా 2019లో మాత్రం 9 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 12 సీట్లలో గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు ఆ పార్టీ భావిస్తోంది.
ప్రస్తుతం పార్టీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలు, గతంలో పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు, ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవని స్థానాలు అనే కేటగిరీలుగా లోక్‌సభ స్థానాలను విభజించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఏడు లోక్‌సభ స్థానాల పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థుల కంటే తమ అభ్యర్థులు ఎక్కువ ఓట్లు సాధించడాన్ని లోక్‌సభ ఎన్నికల కోణంలో సానుకూల అంశంగా భావిస్తున్న బీఆర్‌ఎస్... కనీసం 12 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాన్ని రూపొందిస్తోంది.
అభ్యర్థుల ఎంపికపై గుంభనం
ప్రస్తుతం తొమ్మిది లోక్‌సభ సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం ఉండగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత ఇప్పటికే బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరగా తాజాగా నాగర్‌కర్నూలు ఎంపీ పి.రాములు బీజేపీలో చేరారు. మిగిలిన ఆరుగురిలో సిట్టింగ్ ఎంపీలు రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), నామా నాగేశ్వర్‌రావు (ఖమ్మం), బీబీ పాటిల్ (జహీరాబాద్)కు మాత్రమే వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
మిగతా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పి.దయాకర్ (వరంగల్), మాలోత్ కవిత (మహబూబాబాద్), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్)కి తిరిగి టికెట్ లభించే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు చేవెళ్ల, ఖమ్మం, జహీరాబాద్, కరీంనగర్‌కు సంబంధించి మాత్రమే అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచి్చంది. మరో 13 లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎవరనే అంశంపై చర్చ సాగుతున్నా కేసీఆర్ మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు ఎవరనేది తేలాకే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని ఆయన భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు సమ ఉజ్జీలను బరిలోకి దించడం లక్ష్యంగా లోక్‌సభ సెగ్మెంట్లవారీగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు ప్రాథమికంగా పూర్తిచేసినట్లు సమాచారం.
త్రిముఖ పోటీలో పైచేయి సాధిస్తామనే ధీమా
గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల లోపాయికారీ ఒప్పందం వల్లే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాలు కోల్పోయామని భావిస్తున్న బీఆర్‌ఎస్... తాజా లోక్‌సభ ఎన్నికల్లో జరగనున్న త్రిముఖ పోటీలో పైచేయి సాధిస్తామనే ధీమాతో ఉంది. గతంలో ఒక్కసారి కూడా గెలవని సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో ఇటీవల తాము ఏకపక్ష విజయం సాధించడం కలిసి వస్తుందని భావిస్తోంది. అలాగే చేవెళ్ల, మెదక్, జహీరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ ఓట్లు సాధించడం అనుకూలిస్తుందని బీఆర్‌ఎస్ లెక్కలు వేస్తోంది. మరోవైపు రెండు ఎస్టీ, మూడు ఎస్సీ స్థానాలను మినహాయిస్తే మిగతా 12 స్థానాలకుగాను నిజామాబాద్, జహీరాబాద్, భువనగిరి స్థానాల్లో బీసీ అభ్యర్థులను బరిలోకి దించాలని బీఆర్‌ఎస్ యోచిస్తున్నట్లు తెలిసింది.
ఒకట్రెండు రోజుల్లో సెగ్మెంట్ల వారీగా కేసీఆర్ సమీక్షలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ భవన్ వేదికగా సమీక్షలు నిర్వహించనున్నారు. పార్టీ ప్రతినిధి బృందం మేడిగడ్డ సందర్శన నేపథ్యంలో శని లేదా ఆదివారం నుంచి ఈ సమీక్షలు ప్రారంభమయ్యే అవకాశముంది. లోక్‌సభ సెగ్మెంట్లవారీగా పార్టీ ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. లోక్‌సభ నియోజకవర్గాలవారీగా జరిగే ఈ సమావేశాలకు సంబంధించి షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగే భేటీల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతోపాటు ఎన్నికల వ్యూహంపైనా దిశానిర్దేశం చేయనున్నారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసినా ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు.