ఆస్తి కోసం ఓ బ్యాంకు ఉద్యోగిని అతని భార్య, కుమార్తె, అల్లుడు హతమార్చిన సంఘటన రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.
బెంగళూరు : ఆస్తి కోసం ఓ బ్యాంకు ఉద్యోగిని అతని భార్య, కుమార్తె, అల్లుడు హతమార్చిన సంఘటన రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం హోస్సళ నగరంలో నివాసం ఉంటున్న అంకయ్య (57) యూనియన్ బ్యాంకులో డీ గ్రేడ్ ఉద్యోగి. ఆయనకు భార్య నాగరత్న, కుమారుడు సురేష్ బాబు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో వారు వేరుగా కాపురం ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో బీఎంటీసీ డ్రైవర్ ఆనంద్ తో నాగరత్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించసాగింది.
విషయం తెలుసుకున్న సురేష్ తల్లిని ఎదిరించాడు. దీంతో అతన్ని, అతని భార్యను ఇంటిలో నుంచి గెంటేయించింది నాగరత్న. సురేష్ మీద ప్రేమ ఎక్కువగా ఉన్న అంకయ్య తన ఆస్తిని అతని పేరుమీదే రాయాడానికి నిశ్చయించుకున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన నాగరత్న.. తన కుమార్తె ఝాన్సీరాణి, అల్లుడు పాండియన్ను తీసుకొచ్చి తన ఇంట్లో ఉంచుకుంది. అంకయ్యను హత్య చేయడానికి వీరంతా పథకం రచించారు. అందుకు పాండియన్ తన స్నేహితులు రాజేంద్రకుమార్, సిరాజ్ సాయం తీసుకున్నారు. వీరంతా కలిసి గత నెల 28న రాత్రి భోజనంలో నిద్ర మాత్రలు కలిపి అంకయ్యకు పెట్టారు. దీంతో ఆయన మత్తులో ఉండగా గొంతు నులిమి హత్య చేశారు.
గుండెనొప్పితో అతను మరణించాడని అందరినీ నమ్మించి... శాంతినగరలో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మరణంపై అనుమానం వచ్చిన సురేష్ వారం క్రితం పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో వారు అంకయ్య మృతదేహాన్ని వెలికి తీయించి... పోస్ట్ మార్టం నిర్వహించడంతో అది హత్యేనన్న విషయం వెలుగు చూసింది. నాగరత్న, నిందితులను రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న రాజేంద్రకుమార్, సిరాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.