చాటింగ్ తో యువతి మోసం, ఆత్మహత్య
ఫేక్ ఫోటోల ద్వారా ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసి.. అనంతరం జరిగిన గొడవల కారణంగా ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
మదనపల్లి: సామాజిక మధ్యమాల ద్వారా పరిచయమయ్యే వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎంత చెప్పిన నేటి యువత తలకెక్కించుకోవడం లేదు. ఫేక్ ఫోటోల ద్వారా ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసి.. అనంతరం జరిగిన గొడవల కారణంగా ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి కాలేదని చెప్పి యువకుడితో చాటింగ్ చేసి.. కొన్నిరోజుల అనంతరం యువతి అసలు ఫోటో పంపడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో యువకుడు బెదిరింపులకు దిగాడంతో భయాందోళలకు గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాలు.. నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఎనమడుగు గ్రామానికి చెందిన పావనిరెడ్డి(23) రెండేళ్ల క్రితం స్థానిక ఆటో డ్రైవర్ ఎస్.కే అహ్మద్ బాషాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సజావుగా సాగుతున్న వీరి దాంపత్య జీవితంలో పేస్‌బుక్ కలకలం రేపింది. అహ్మద్ పని మీద బయటకు వెళ్లిన సమయంలో పావని ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమెకు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉండే సుజిత్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. మదనపల్లిలోని ఓ బజాజ్ షోరూం యజమానిగా తనను తాను పరిచయం చేసుకున్నసుజిత్ ఆమెతో స్నేహం చేశాడు. అనంతరం వీరి స్నేహం ప్రేమకు దారితీసి.. బహుమతులు ఇచ్చిపుచ్చుకునే వరకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన యువతి సుజిత్ ద్వారా నగలు, స్కూటీ పలు విలువైన వస్తువులను తీసుకుంది.
కొన్ని రోజుల తర్వాత వీరిద్దరు తమ ఒరిజినల్ ఫొటోలు షేర్ చేసుకోవాలనుకుని ఒకరికొకరు తమ ఫొటోలు పంపుకున్నారు. ఫొటో చూసిన అనంతరం అప్పటి వరకు ప్రేమగా మాట్లాడిన సుజిత్, పావనికి పెళ్లై పోయిందని తెలియడంతో షాక్ కు గురయ్యాడు. తనను మోసం చేసిన యువతిని టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. అప్పటివరకు ఆమె పై ఖర్చు పెట్టిన సుమారు రూ. 2 లక్షలను తిరిగి ఇచ్చేయాలని లేకపోతే.. పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతానని బెదిరించాడు. దీనికి ఆమె నిరాకరించడంతో.. తనకు పెద్ద పెద్ద వాళ్లతో పరిచయం ఉందని.. పోలీసులు, ప్రభుత్వం తమవేనని.. తల్చుకుంటే భర్త ఎదుటే హతమార్చుతానని చెప్పాడు. దీంతో భయపడిన పావని గురువారం సాయంత్రం బ్యాంక్ కోచింగ్ కోసం నంద్యాల వెళ్తున్నానని భర్తతో చెప్పి మదనపల్లికి వెళ్లింది. స్థానిక బస్టాండ్‌కు చేరుకొని తాను మదనపల్లికి వచ్చానని తన దగ్గర రూ.15 వేలు ఉన్నాయని..తీసుకుని తనను వదిలిపెట్టమని సుజిత్ ను ప్రాధేయపడింది.
దీనికి అతను నిరాకరించి పోలీసులకు విషయం చెప్తానని బెదిరించాడు. దీంతో భయపడిన పావని తన వద్ద ఉన్న వాస్మోల్ కేశ్‌కాలా తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో.. తిరుపతికి తరలించేందుకు యత్నిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. పావని ఆత్మహత్యకు ముందు సుజిత్ తో జరిగిన సంభాషణలను, సుమారు 250 మెసేజ్‌లను భర్త అహ్మద్‌కు పంపింది. చివరగా 'ఈ దుర్మార్గుడు నన్ను వదలడు నేను చనిపోతున్నాను. మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో నా మృతదేహం ఉంటుంది' అని వచ్చి చూసుకోమని మెసేజ్ చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.