వాట్సప్‌ కలిపింది ఇద్దరినీ

Whatsapp Chatting Meet Dumb and deaf couple In Karnataka - Sakshi

మూగబధిర జంట మధ్య  చాటింగ్‌ అనుబంధం

ఘనంగా పెళ్లి

సాక్షి, బళ్లారి:ఇద్దరికీ ముఖ పరిచయం లేదు, మాటలు రావు, చెవులు వినిపించవు. అయినా ఇద్దరినీ వాట్సప్‌ ద్వారా చాటింగ్‌తో పరిచయం మొగ్గతొడిగి అది ఇరు హృదయాల మధ్య ప్రేమగా మారింది. వివాహ భాగ్యంతో ఒక్కటయ్యారు. ఆదివారం బళ్లారి జిల్లా కొట్టూరు పట్టణంలోని బనశంకరి కళ్యాణ సముదాయ భవనంలో కుటుంబ సభ్యులు, బం«ధుమిత్రుల సమక్షంలో మూగబధిరులైన అశ్విని, ఈశ్వర్‌లు పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. ఈశ్వర్, అశ్వినీ ఇద్దరూ వేర్వేరు జిల్లాలకు చెందిన వారు,  పుట్టుకతోనే దివ్యాంగులు. వారి వారి తల్లిదండ్రులు ఎంతో ఓర్పుతో, కష్టంతో  చదివించారు. ప్రైవేటు కంపెనీలో ఇద్దరికీ ఉద్యోగాలు లభించాయి. అయితే వీరిద్దరికీ గతంలో ఎలాంటి పరిచయం లేదు. వాట్సప్‌ ద్వారా పరిచయమై ప్రేమగా మారింది.

నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధు–మిత్రులు
అతనిది రాయచూరు, ఆమెది కొట్టూరు
రాయచూరు జిల్లాకు చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి తిప్పణ్ణ, మంజుల కుమారుడు ఈశ్వర్‌. ఐటీఐలో ఎలక్ట్రికల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం హెచ్‌ఆర్‌బీఎల్‌ కంపెనీలో పని చేస్తున్నారు. బళ్లారి జిల్లా కొట్టూరు పట్టణంలో కేఎస్‌ఆర్‌టీసీ బస్సు డ్రైవర్‌ తిప్పేస్వామి, రత్నమ్మ దంపతులకు కలిగిన అశ్వినీ కూడా పుట్టుకతోనే మూగ. ఆ దంపతులు తమ కూతురికి మాటలు రావనే చింతను వదిలేసి ఎంతో కష్టపడి చదివించారు. ఆమె కూడా కంప్యూటర్‌ కోర్సు పూర్తి చేసిన బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది.ఇద్దరూ తమ ప్రేమను తల్లిదండ్రులకు తెలిపి పెళ్లికి ఒప్పించారు. బంధుమిత్రుల నడుమ వైభవంగా పెళ్లి వేడుక జరిగింది. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top