గడచిన ఏడేళ్లుగా విద్యుత్ సరఫరాను ఎందుకు మెరుగుపరుచుకోలేదంటూ టాటా పవర్ కంపెనీని మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఎంవీఆర్సీ) ప్రశ్నించింది.
సాక్షి, ముంబై:
గడచిన ఏడేళ్లుగా విద్యుత్ సరఫరాను ఎందుకు మెరుగుపరుచుకోలేదంటూ టాటా పవర్ కంపెనీని మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఎంవీఆర్సీ) ప్రశ్నించింది. తన పరిధిలో ఇతర సంస్థలు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అనుమతించకూడదంటూ బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ దాఖలుచేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని పరిశీలించిన ఎంవీఆర్సీ పై విధంగా స్పందించింది.
విద్యుత్ నియమ నిబంధనలు, రెగ్యులేటరీ కమిషన్ విధానాలను ఆధారంగా చేసుకుని బెస్ట్ సంస్థ ఈ పిల్‌ను దాఖలు చేసింది. కాగా ముంబైకర్లకు బెస్ట్ సంస్ధ విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ఈ విద్యుత్‌ను టాటా పవర్ కంపెనీ నుంచి బెస్ట్ కొనుగోలు చేస్తోంది. ఇదిలాఉంచితే ఇకనుంచి ముంబైకర్లకు తామే స్వయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని టాటా కంపెనీ ఇటీవల స్పష్టం చేసింది.
దీనిని సవాల్‌చేస్తూ బెస్ట్ సంస్థ పిల్ దాఖలు చేసింది. బెస్ట్ ప్రజా సంస్థ కావడంతో గృహవినియోగదారులకు సబ్సిడీ ఇస్తోంది. ఇతర సంస్థలకు విద్యుత్ సరఫరాకు అనుమతిస్తే చిన్నతరహా వినియోగదారులకు సబ్సిడీ మాటేమిటనే ప్రశ్న తలెత్తుతుందని తన పిల్‌లో బెస్ట్ పేర్కొంది. ఇలా చేయడంవల్ల విద్యుత్ చార్జీలు పెరగుతాయని వాదిస్తోంది.
బెస్ట్ పరిధిలో 10 లక్షల మందికిపైగా విద్యుత్ వినియోగదారులున్నారు. భారీగా విద్యుత్ వినియోగించే వారు ఇతర కంపెనీల నుంచి కనెక్షన్ తీసుకుంటే బెస్ట్ వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని బెస్ట్ అభిప్రాయపడింది. నగరవాసుల్లో అత్యధిక శాతం మంది బెస్ట్ సంస్థ వినియోగదారులే. అయితే టాటా కంపెనీ మాత్రం బడా కంపెనీలకే ప్రాధాన్యమిస్తోందని బెస్ట్ వాదిస్తోంది.