అదిగదిగో అద్దాల రైలు! | Vistadome train in vsp and kirandul route | Sakshi
Sakshi News home page

అదిగదిగో అద్దాల రైలు!

Oct 13 2016 8:28 AM | Updated on Sep 4 2017 5:05 PM

ఇరుపక్కల నుంచి చూస్తే పచ్చదనం కలబోసిన ప్రకృతి సౌందర్యం.. తల పెకైత్తి చూస్తే నీలాకాశం..

  • ఏడాది చివరినాటికి అందుబాటులోకి..
  • అరకు రైలుకు రెండు అత్యాధునిక కోచ్‌లు  
  • ప్రకృతి అందాలు తిలకించే వీలు
  •  
    సాక్షి, విశాఖపట్నం: ఇరుపక్కల నుంచి చూస్తే పచ్చదనం కలబోసిన ప్రకృతి సౌందర్యం.. తల పెకైత్తి చూస్తే నీలాకాశం.. బోగీ లోపల విభిన్న ఆకృతిలో కళ్లు చెదిరేలా రూపొందించిన డిజైన్లు.. అటూ ఇటూ కదిలే కుర్చీలు.. పారదర్శకంగా ఉండే అద్దాలు.. శీతలాన్ని వెదజల్లే బోగీలు.. ఇవన్నీ విశాఖ నుంచి అరకు వెళ్లే అద్దాల రైలుకు సొంతం..! ఎన్నాళ్ల నుంచో ఇదిగో.. అదిగో.. అంటూ ఊరిస్తున్న ఈ అద్దాల (విస్టాడూమ్) రైలు మరో రెండు నెలల్లో అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇప్పటికే వారుుదాలపై వారుుదాలు పడుతూ వస్తున్న ఈ రైలుకు మార్గం సుగమం అయింది.
     
    విశాఖ నుంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరకులోయ, బొర్రాగుహలను రైలు మార్గంలో సందర్శించడానికి ఈ విశాఖ-కిరండూల్ పాసింజర్ రైలొక్కటే ఉంది. ఈ రైలులో ప్రయాణిస్తుంటే రాశులు పోసినట్టుండే పచ్చని కొండలు, జాలువారే జలపాతాలు, పాతాళంలో ఉన్నట్టుండే లోయలు, గుహల్లాంటి సొరంగాలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు.. ఇలా ఒకటేమిటి? ప్రకృతిలో ఉండే అన్ని ఒంపుసొంపులు, సోయగాలు ఈ రైలులో ప్రయాణించే వారికి దర్శనమిస్తాయి.
     
    అందుకే ఈ రైలులో ప్రయాణించడానికి పర్యాటకులు పోటీ పడుతుంటారు. దీన్ని దష్టిలో ఉంచుకునే రైల్వే శాఖ ఈ రైలుకు అదనంగా రెండు అద్దాల బోగీలను అమర్చాలని ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఏవేవో కారణాలతో కార్యరూపం దాల్చడం లేదు. చెన్నై పెరంబుదూర్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ విస్టాడూమ్ బోగీలు తయారయ్యాయి.
     
    వీటికి దాదాపు రూ.4 కోట్లు ఖర్చవుతోంది. అంటే సాధారణ బోగీలకంటే రూ.25-30 వేలు అధికమన్నమాట! ఈ బోగీల ప్రత్యేకత ఏమిటంటే.. చుట్టూ బలిష్టమైన, పారదర్శకంగా ఉండే తెల్లని అద్దాలు బిగించి ఉంటాయి. ఎటు చూసినా అంతా కనిపిస్తుంది. పైన (బోగీ టాప్) కూడా అద్దాలతోనే నిర్మిస్తారు. అందువల్ల బోగీలోంచి ఆకాశంలోకి కూడా చూసే వీలుంటుంది. బోగీ లోపల ప్రత్యేక డిజైన్లుండేలా రూపొందించడం వల్ల రైలులో కాకుండా ఓ ప్రత్యేక వాహనంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. బోగీలో ఉన్న కుర్చీలు తమకు నచ్చిన వైపు తిరిగే ఏర్పాటు ఉంటుంది.


    ఈ రైలు విశాఖ నుంచి 120 కిలోమీటర్ల దూరం ఉండే అరకుకు మూడున్నర గంటల సమయం పడుతుంది. ఈ మార్గ మధ్యలో సుమారు 50 టన్నెల్స్ (గుహలు), లోయలను దాటుకుంటూ పయనిస్తుంది.
     
    పర్యాటకులను ఈ విస్టాడూమ్ కోచ్‌లు విశేషంగా ఆకట్టుకుంటాయని ఇటు రైల్వే, అటు పర్యాటకశాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు. అయితే ఈ కోచ్‌ల్లో ప్రయాణించడానికి టికెట్ ఎంతన్నది ఇంకా నిర్ణయించలేదు. మరో రెండు నెలలు ఆగితే అందాల అద్దాల రైలు అందుబాటులోకి వచ్చేస్తుంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement