పారని పాచిక | Vimala Gowda said that the | Sakshi
Sakshi News home page

పారని పాచిక

Jul 10 2014 2:39 AM | Updated on Mar 29 2019 9:24 PM

పారని పాచిక - Sakshi

పారని పాచిక

శాసన మండలిలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పోస్టులను నిలబెట్టుకునే ప్రయత్నంలో బీజేపీ, జేడీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

  • మండలిలో చైర్మన్ పోస్ట్ బీజేపీకే
  •  జేడీఎస్ మద్దతు పొందేలా మొదట కాంగ్రెస్ వ్యూహం
  •  అనంతరం కుమారతో  శెట్టర్ చర్చలు సఫలం
  •  బీజేపీకి మద్దతిచ్చిన జేడీఎస్
  •  బదులుగా డిప్యూటీ పోస్ట్ పుట్టన్నకు
  •  నిప్పులు చెరిగిన విమలా గౌడ
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన మండలిలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పోస్టులను నిలబెట్టుకునే ప్రయత్నంలో బీజేపీ, జేడీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుత చైర్మన్ డీహెచ్. శంకరమూర్తి కొనసాగుతారు. బీజేపీకి చెందిన ప్రస్తుత డిప్యూటీ చైర్‌పర్సన్ విమలా గౌడ రాజీనామా చేసి, ఆ స్థానాన్ని జేడీఎస్‌కు చెందిన పుట్టన్నకు ఇవ్వాలన్నది ఒప్పందం. శాసన సభ లాబీలో బుధవారం ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, జేడీఎస్ పక్షం నాయకుడు హెచ్‌డీ. కుమారస్వామి దీనిపై సుదీర్ఘంగా చర్చించి, ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు.
     
    కాంగ్రెస్ ఎత్తు చిత్తు

    శాసన మండలిలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ పన్నిన వ్యూహం విఫలమైంది. జేడీఎస్ మద్దతుతో ఈ రెండు పదవులను కైవసం చేసుకోవడానికి ఆ పార్టీ వ్యూహ రచన చేసింది. చైర్మన్ పదవి తనకు, డిప్యూటీ చైర్మన్ పదవి జేడీఎస్‌కు... అని ఒప్పందాన్ని సిద్ధం చేసుకుంది. చివరి నిమిషంలో కుమారస్వామి బీజేపీ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ పాచిక పారలేదు.

    శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 75 కాగా బీజేపీ బలం 31. ఇటీవల జరిగిన ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులతో కాంగ్రెస్ బలం 28కి పెరిగింది. ముగ్గురు స్వతంత్ర సభ్యులు కాంగ్రెస్ వైపే ఉన్నారు. మరో స్వతంత్రుడు తటస్థంగా ఉంటున్నారు. జేడీఎస్ సంఖ్యా బలం 12. ఈ నేపథ్యంలో ఇరు పదవులు ఖాయమనుకున్న కాంగ్రెస్, ఈ వారంలో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలనుకుని పథకం కూడా సిద్ధం చేసుకుంది. అయితే చివరి నిమిషంలో బీజేపీ, జేడీఎస్‌ల మధ్య కుదిరిన ఒప్పందంతో నిస్సహాయంగా మిగిలిపోయింది.
     
    విమలా గౌడ నిప్పులు
     
    డిప్యూటీ చైర్ పర్సన్ పదవి నుంచి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తనను కోరారని విమలా గౌడ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, జేడీఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు. చైర్మన్ శంకరమూర్తి పదవి లేకుండా ఉండలేరని విమర్శించారు.

    ఆయన పదవిని కాపాడుకోవడానికి తనను రాజీనామా చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో చైర్‌పర్సన్, ప్రతిపక్ష నాయకురాలు పదవులను ఇస్తామని హామీ ఇచ్చిన తమ పార్టీ, అనంతరం మాట తప్పిందని విమర్శించారు. జేడీఎస్ నాయకులు ‘డీల్’ మాస్టర్లని నిప్పులు చెరిగారు. వారి బాగోతం ప్రజలకు తెలుసునని విమర్శించారు. మొత్తానికి ఓ ఒక్కలిగ మహిళకు అన్యాయం జరిగిందని ఆమె వాపోయారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement