రెండోరోజూ అదే వేడి | Vidarbha MLAs demand extension of Assembly session to 4 weeks | Sakshi
Sakshi News home page

రెండోరోజూ అదే వేడి

Dec 11 2013 12:24 AM | Updated on Mar 29 2019 9:18 PM

నాగపూర్‌లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా వాడివేడిగానే జరిగాయి.

సాక్షి, ముంబై: నాగపూర్‌లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా వాడివేడిగానే జరిగాయి. విదర్భ ప్రాంత సమస్యలు, రైతులకు చెల్లించే ప్రత్యేక ప్యాకేజీలపై ప్రతిపక్షాలు రెచ్చిపోయాయి. దీంతో సభ కార్యకలాపాలు తొలుత 15 నిమిషాలు వాయిదా పడ్డాయి. ఆ తరువాత రోజంతా వాయిదా వేశారు. విధాన పరిషత్ కార్యకలాపాలు కూడా మంగళవారం పూర్తిగా వాయిదా పడ్డాయి. ఉదయం సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ విదర్భకు చెందిన వివిధ అంశాలను లేవనెత్తారు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
 
 ఈ సమస్యపై తీర్మానం 97 ప్రకారం చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. దీన్ని విధానసభ అధ్యక్షుడు దిలీప్ వల్సే పాటిల్ తిరస్కరించారు. దీనిపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చిద్దామని ఆయన ప్రతిపాదించారు. కాని ప్రతిపక్ష నాయకులు ససేమిరా అనడంతో కొద్దిసేపు గందగోళ వాతావరణం నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభాప్రాంగణంలో నానా హడావుడి సృష్టించారు. దీంతో సభా అధ్యక్షుడు కార్యకలాపాలను అరగంట వరకు వాయిదా వేశారు. ఆ తరువాత యథాతథంగా సమావేశాలు కొనసాగుతుండగా విపక్షాల నాయకులు మళ్లీ రెచ్చిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ ప్రతిపక్ష నాయకులు అనవసరంగా గందరగోళం సృష్టించి విదర్భ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రోజూ ఇలాగే చేస్తూ సభా కార్యకలాపాలు నిలిపివేయడంవల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కాబోవని స్పష్టం చేశారు. 
 
 దీంతో ప్రతిపక్షాలు శాంతియుతంగా తీర్మానం 111 ప్రకారం ప్రశ్నలు లేవనెత్తి వాటిపై చర్చించాలని ఆయన సూచించారు. అందుకు సభాధ్యక్షుడు కల్పించుకుని వారికి నచ్చజెప్పాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నాయకులు మాత్రం తీర్మానం 97 ప్రకారమే చర్చించాలని పట్టుబట్టారు. దీంతో డిప్యూటీ స్పీకర్ వసంత్ పుర్కే సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. కాసేపటి సమావేశాలు పునఃప్రారంభంకాగా మళ్లీ అదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే పరిస్థితి విధాన్ పరిషత్‌లోనూ కొనసాగింది. అధిక వర్షాల వల్ల నష్టపోయిన విదర్భ రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలనే డిమాండ్‌తో ప్రతిపక్షాలు రెచ్చిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ నానా హంగామా సృష్టించాయి. దీంతో సభ కార్యకలాపాలు బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement