ప్రముఖ యువ సినీ గీతరచయిత అన్నామలై(49)మంగళవారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు.
తమిళసినిమా: ప్రముఖ యువ సినీ గీతరచయిత అన్నామలై(49)మంగళవారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నై పచ్చైయప్పన్ కళాశాల విద్యార్థి అయిన ఈయన అదే కళాశాలో కవితలు, గీతాలపై ఎంఫిల్ చేశారు. పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు. టీవీ సీరియల్స్‌తో గీతరచయితగా తన పయనాన్ని ప్రారంభించిన అన్నామలై 50 సీరయళ్లకుపైగా పాటలు రాశారు. పలు కవితలను, భక్తిగీతాలను రాసిన ఈయన 1992లో విడుదలైన పుదువయల్ చిత్రం ద్వారా సినీ గీతరచయితగా పరిచయం అయ్యారు.
నాంజల్ కెన్నడీ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో తన తొలి పాటను మనో, చిత్ర పాడారు. అన్నామలై 60 చిత్రాలకు పైగా పాటలు రాశారు. అందులో పలు పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. అన్నామలైకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది విజయ్ నటించిన వేట్టైక్కారన్ చిత్రంలోని ఎన్ ఉచ్చిమండైయిల్ చురుంగుదు అనే పాట. ప్రస్తుతం 20 చిత్రాలకు పైగా పాటలు రాస్తున్న అన్నామలై హఠాన్మరణం తమిళ చిత్రపరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటీవలే మరణించిన గీతరచయిత నా.ముత్తుకుమార్ దుఃఖఛాయలు వీడక ముందే గుండెల్ని పిండే మరణ వార్తను చిత్రపరిశ్రమ వినాల్సివచ్చింది.
అన్నామలై మృతి తమిళ చిత్రపరిశ్రకు తీరని లోటే అవుతుంది. ప్రముఖ సంగీతదర్శకులందరితోనూ అన్నామలై పని చేశారు. అదే విధంగా ప్రముఖ కథానాయకులందరికి పాటలు రాశారు. స్థానిక హారింగ్‌టన్ రోడ్డులో నివహిస్తున్న అన్నామలై మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య నాలుగేళ్ల పాప ఉన్నారు. అన్నామలై అంత్యక్రియలు బుదవారం జరిగాయి. ఆయన భౌతిక కాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.