ఎమ్మెల్యే, ఎస్‌ఐ ప్రేమకలాపం! | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే, ఎస్‌ఐ ప్రేమకలాపం!

Published Thu, Jun 8 2017 9:07 AM

ఎమ్మెల్యే, ఎస్‌ఐ ప్రేమకలాపం!

రాయచూరు రూరల్‌ : రాయచూరు గ్రామీణ శాసన సభ్యుడు తిప్పరాజు హవల్దార్‌ ఓ మహిళా ఎస్‌ఐ ప్రేమకలాపం సాగిస్తున్నట్లు బుధవారం కొన్ని టీవీ చానళ్లలో విస్తృత ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే తిప్పరాజు హవల్దార్‌ గతంలో స్థానిక మార్కెట్‌ యార్డులో పని చేసిన ఓ మహిళా ఎస్‌ఐను ప్రేమించాడని, ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భార్యా పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఎమ్మెల్యే భార్య పేరుతో గత మార్చి 16న రాష్ట్ర మహిళా కమిషన్‌కు లేఖ వెళ్లింది. దీనిపై మహిళా కమిషన్‌ స్పందించడంతో ఈ వార్తలు టీవీ చానళ్లలో బుధవారం గుప్పుమన్నాయి. అయితే తాను ఆ లేఖ రాయలేదని ఎమ్మెల్యే భార్య, మాన్వి తాలూకా కుర్డి జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఉన్న విరుపమ్మ (సౌమ్య) పేర్కొంటున్నారు.   

అంతా వట్టిదే: ఎమ్మెల్యే
సాక్షి, బెంగళూరు:  నాకు, నా భార్యకు మధ్య ఎటువంటి తగాదాలు లేవు.. అన్యోన్యంగా ఉన్నాం..ఆరోపణలు అవాస్తవం అని రాయచూరు రూరల్‌ ఎమ్మెల్యే తిప్పరాజు హవాల్దార్‌ అన్నారు. బుధవారం బెంగళూరు విధానసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమపై బురదజల్లడానికి ఎవరో కావాలనే తన భార్య పేరుతో మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు.  మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయి తమతో చర్చించకుండానే ఫిర్యాదు ప్రతిని మీడియాకు విడుదల చేయడం చూస్తుంటే రాజకీయంగా తొక్కేయడానికి రాజకీయ ప్రత్యర్థులు పన్నిన కుట్రగా అనుమానం కలుగుతోందన్నారు. ఆమెకు కమిషన్‌ అధ్యక్షురాలిగా ఉండే అర్హత లేదన్నారు. భార్య సౌమ్య కూడా మహిళా కమిషన్‌కు ఫోన్‌చేసి తనకు తన  భర్తకు మధ్య విభేదాలు లేవని స్పష్టం చేసింది.

ఏ తప్పూ చేయలేదు: ఎస్‌ఐ బేబి
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌.ఐ బేబీ వాలేకర్‌ మీడియాతో మాట్లాడుతూ... తన పరువుకు నష్టం కలిగించేలా కొంతమంది ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. తనపై అనవసర ఆరోపణలు చేసిన వారిని గుర్తించి త్వరలో పరువునష్టం దాఖలు చేస్తానన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement