లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం మునిగింది. ఎన్నికలకు సిద్ధం కావాలని ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్
సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం మునిగింది. ఎన్నికలకు సిద్ధం కావాలని ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన విధి, విధానాలపై శిక్షణ తరగతులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఓటుకు నోటు అడ్డుకుందామని అధికారులకు పిలుపునిచ్చారు. లోక్‌సభకు ఏప్రిల్‌లో ఎన్నికలు జరిపే రీతిలో జాతీయ ఎన్నికల కమిషన్ కసరత్తులు చేస్తోంది. ఫిబ్రవరి చివర్లో లేదా, మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడ్డొచ్చన్న సంకేతాలున్నాయి. రాజకీయ పక్షాలు ఎన్నికల పొత్తులు, సీట్ల పందేరంలో బిజీబిజీగా ఉంటే, రాష్ట్ర ఎన్నికల యంత్రంగాం ఏర్పాట్లలో తలమునకలై ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా సమాచార సేకరణ చేసింది. పోలింగ్ కేంద్రాలు, బూత్‌ల ఏర్పాట్లు, ఆయా నియోజకవర్గాల పరిస్థితిపై నివేదిక సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో బుధవారం ఎన్నికల విధి, విధానాలపై చర్చించి, సరికొత్త నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా, వ్యవహరించాల్సిన తీరును వివరిస్తూ శిక్షణ తరగతులు బుధవారం చెన్నైలో ఆరంభం అయ్యాయి.
శిక్షణ: నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఈ శిక్షణా తరగతులు ఆరంభమయ్యూయి. ఏడు రోజుల పాటుగా ఈ తరగతులు నిర్వహించనున్నారు. ఇందులో రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి సబ్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దారులు పాల్గొంటున్నారు. ప్రధానంగా ఎన్నికల ఏర్పాట్లు, ఆయా నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాజకీయ పార్టీల కదలికలపై నిఘా, కోడ్ ఉల్లంఘనలకు తీసుకోవాల్సిన చర్యలు, ఓటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు తదితర 14 అంశాలతో ఈ శిక్షణ సాగనుంది. రోజుకు రెండు అంశాలను ఎంపిక చేసుకుని శిక్షణ ఇవ్వనున్నారు. సిద్ధం కండి: ఇందులో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ ప్రసంగిస్తూ, ఎన్నికలకు సిద్ధం కావాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఏర్పాట్లు వేగవంతం చేయాలని, అన్ని పనులు నిర్ణయించిన సమయంలోపు ముగించాలన్న సూచించారు. నగదు బట్వాడా, తాయిలాల పంపిణీకి అడ్డుకట్ట లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలని, అందుకు తగ్గ సూచనలు, నిబంధనలను ఈ శిక్షణ ద్వారా వివరించనున్నామని పేర్కొన్నారు.
ఓటుకు నోటు నినాదం రాష్ట్రంలో వినిపించని విధంగా అవగాహనా శిబిరాలు ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా కార్యక్రమాలు వేగవంతం చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో అధికారుల భాగస్వామ్యం కీలకం అని, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సి ఉంటుందని ఉపదేశించారు. ఈ శిక్షణానంతరం జిల్లా కలెక్టర్లు, ఐపీఎస్ అధికారులతో సమావేశానికి నిర్ణయించామని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బదిలీలు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో బదిలీల పర్వానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఆయా శాఖల్లో మూడేళ్లకు పైబడి విధులు నిర్వర్తిస్తున్న వారిని మరో చోటకు బదిలీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాల నుంచి ఇందుకు సంబంధించిన వివరాలు సేకరించి, ఫిబ్రవరి ఐదో తేదీలోపు బదిలీల పర్వాన్ని ముగించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
సామరస్యం: డీఎంకేలో బయలు దేరిన వివాదానికి ముగింపు పలికేందుకు కరుణానిధి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. అళగిరిని బుజ్జగించడం, కరుణానిధి, స్టాలిన్‌ను శాంతింప చేయడం లక్ష్యంగా కుటుంబ వర్గాలు ప్రయత్నాల్లో ఉన్నట్టు డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో మదురైలో అళగిరి మీడియాతో మాట్లాడుతూ, సామరస్య పూర్వక చర్చలకు తన వద్దకు ఇంత వరకు ఎవరూ రాలేదని పేర్కొనడం గమనార్హం. సామరస్యానికి సిద్ధమా అని మీడియా ప్రశ్నించగా, రానీయండి చూద్దామన్నట్టు సంకేతాన్ని ఇచ్చారు. డీఎండీకేతో పొత్తు కోసం అళగిరిని డీఎంకే పక్కన పెట్టినట్టు సంకేతాలు ఉన్నాయి. అయితే, ఈ వివాదం, సస్పెన్షన్‌లు, కపట నాటకం అంటూ డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత పేర్కొనడం డీఎంకే వర్గాలను విస్మయంలో పడేయడం తాజా ఘటనలో కొసమెరుపు.