ఈడీ ముందుకు ఠాక్రే‌, ముంబైలో టెన్షన్‌

Raj Thackeray Appear Before Enforcement Directorate - Sakshi

సాక్షి, ముంబై: కోహినూర్‌ మిల్లు భూమి కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎమ్మెన్నెస్‌) రాజ్‌ ఠాక్రే గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరయ్యారు. దాదర్‌లోని కోహినూర్‌ మిల్లు భూ లావాదేవీలపై ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈడీ ఎదుట రాజ్‌ ఠాక్రే హాజరైన నేపథ్యంలో దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయం వెలుపల 144 సెక్షన్‌ విధించారు. ఎమ్మెన్నెస్ కార్యకర్తల కదిలికలను గుర్తించి, అదుపు చేసేందుకు ముంబై నగరంలోని 12 జోన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్తగా ఎమ్మెన్నెస్ నేత సందీప్‌ దేశ్‌పాండేతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మారిన్‌ డ్రైవ్‌, ఎంఆర్‌ఏ మార్గ్‌, దాదర్‌, ఆజాద్‌ మైదాన్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోనూ 144 సెక్షన్‌ విధించారు. రాజ్‌ ఠాక్రే నివాసం వద్ద కూడా పోలీసులను భారీ సంఖ్యలో మొహరించారు. శాంతి, భద్రతలకు విఘాతం కల్గిస్తూ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సంయమనం పాటించాలని, అందరూ శాంతంగా ఉండాలని ఇదివరకే రాజ్‌ఠాక్రే తన అనుచరులకు సూచించారు. ‘మా నాయకుడి ఆదేశాలకు కట్టుబడి సంయమనం పాటిస్తున్నాం. ఆయన చెప్పకపోయినా సహనంగా ఉండాలని అనుకున్నాం. మమ్మల్ని అదుపులోని తీసుకుని ప్రభుత్వం రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తోంది’ అని సంతోష్‌ ధుని అనే నాయకుడు ఆరోపించారు. కోహినూర్‌ మిల్లు భూ అక్రమాల కేసులో రాజ్‌ఠాక్రే వ్యాపార భాగస్వాములు ఉమేశ్‌ జోషి, రాజేంద్ర శిరోద్కర్‌లను ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నించారు.  

ఈడీ విచారణలో ఒరిగేదేమీ లేదు: ఉద్ధవ్‌
కోహినూర్‌ మిల్లు భూమి కొనుగోలు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ ఠాక్రేకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే పరోక్ష మద్దతు ప్రకటించారు. రాజ్‌ఠాక్రేను ఈడీ ప్రశ్నించినా ఒరిగేదేమీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. శివసేన ద్వంద్వ వైఖరి పాటిస్తోందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top