ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి : గవర్నర్ రోశయ్య | Put on health care Governor Rosaiah | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి : గవర్నర్ రోశయ్య

Oct 28 2013 3:54 AM | Updated on Jul 29 2019 6:58 PM

దురలవాట్లకు దూరంగా ఉంటూ ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య సూచించారు. శ్రీ సమతి విశాల్ జైన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్,

 కొరుక్కుపేట, న్యూస్‌లైన్:దురలవాట్లకు దూరంగా ఉంటూ ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య సూచించారు. శ్రీ సమతి విశాల్ జైన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, విశాల్ జైల్ అసోసియ్‌షన్ ఆధ్వర్యంలో చెన్నై, కోడంబాక్కంలోని మహాలింగపురంలో శ్రీ సుమతి విశాల్ జైన్ డయాలసిన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. చెన్నై, మహాలింగపురంలోని ఈ.ఎం, ఈ ఎల్, ఈఎం కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య హాజరయ్యారు.డయాలసిస్ సెంటర్  చైర్మన్ హారీష్ ఎల్.మెహతా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రోశయ్య మాట్లాడుతూ సుమతి విశాల్ జైన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కిడ్నీ రోగులకు సేవలందించేలా డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. 
 
 పస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోకపోవడం, జెంక్ ఫుడ్స్, పాన్, పొగాకు ఉత్పత్తులను మద్యానికి అలవాటు పడిపోవడం, సరైన వ్యాయామాలు చేయక ప్రజలు రోగాలు కొని తెచ్చుకుంటున్నారని అన్నారు.  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇటీవల చేపట్టిన సర్వేలో కిడ్నీ, మూత్ర నాళసంబంధిత వ్యాధుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి లక్షా యాభై వేల మంది చనిపోతున్నారన్నారు. దేశంలో కిడ్నీ సం బంధిత వ్యాధులతో 1.5 లక్షల మంది బాధపడుతున్నారని తెలిపారు. అతి తక్కువ మంది మాత్రమే కిడ్నీ మార్పిడితో బయటపడుతున్నారని అన్నారు. గౌరవ అతిథిగా హాజరైన తమిళనాడు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిఎంకె రెడ్డి మాట్లాడుతూ  కిడ్నీ వ్యాధులతో ప్రతి 20 మందిలో ఒకరు బాధపడుతున్నారన్నారు. 
 
 దీనికి తగినంతగా వైద్య కేంద్రాలు లేకపోవడం వల్ల ఎంతో మంది కిడ్నీ బాధితులు మృతి చెందుతున్నారని అన్నారు. డిమాండ్ అధికంగా ఉన్న ఈ సమయంలో జైన్‌ఎడ్యుకేషనల్ ట్రస్టు డయాలసిస్ సెంటర్‌ను అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు. డయాలసిస్ సెంటర్ చైర్మన్ హరీష్ ఎల్.మెహతా మాట్లాడుతూ అతి తక్కువ ధరలకు డయాలసిస్ ట్రీట్‌మెంట్ అందిస్తామని అన్నారు. అత్యాధునిక ప్రమాణాలతో కూడిన నాలుగు డయాలసిస్ యూనిట్‌లను అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి ప్రకాష్ లోడా, మేనేజింగ్ ట్రస్టీ కమలేష్ నేహర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement