‘ప్రిన్సెస్’ ఫ్లై ఓవర్ మరమ్మతు పనులు ప్రారంభం | Sakshi
Sakshi News home page

‘ప్రిన్సెస్’ ఫ్లై ఓవర్ మరమ్మతు పనులు ప్రారంభం

Published Sun, May 17 2015 11:36 PM

‘ప్రిన్సెస్’ ఫ్లై ఓవర్ మరమ్మతు పనులు ప్రారంభం - Sakshi

- రూ. 68 లక్షలు కేటాయించిన బీఎంసీ
- రెండు దశల్లో ఈ నెల 18 నుంచి 24 వరకు మరమ్మతు పనులు
- పనులు పూర్తయ్యే వరకు భారీ వాహనాల ప్రవేశం నిషేధం
సాక్షి, ముంబై
: మెరిన్‌లైన్స్ స్టేషన్ సమీపంలో ఉన్న ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లై ఓవర్ మరమ్మతు పనులను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సోమవారం నుంచి ప్రారంభించనుంది. ఈ బ్రిడ్జిలోని దాదాపు 36 జాయింట్లకు మరమ్మతు చేపట్టనున్నారు. 50 ఏళ్ల కిందట నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ మరమ్మతులకు రూ.68 లక్షలు వెచ్చించనున్నట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ పనులను రెండు దశల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశ పనులను ఈ నెల 18 నుంచి 24 వరకు, రెండో దశ పనులు 24 నుంచి 31వ తేదీ వరకు చేపట్టనున్నారు. బ్రిడ్జిల విభాగ చీఫ్ ఇంజనీర్ ఎస్.ఓ.కోరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరమ్మతు పనులకు సంబంధించిన అన్ని అనుమతులను ఇదివరకే తీసుకున్నామని, రెండు దశల్లో ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించిన పనులు కూడా ఇదివరకే నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

మొదటి దశ పనుల్లో ఎన్.ఎస్.రోడ్, శ్యామల్‌దాస్ గాంధీ మార్గ్ నుంచి ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లై ఓవర్‌కు వచ్చే భారీ వాహనాలకు ఎంట్రీని నిషేధించామని తెలిపారు. శ్యామల్‌దాస్ గాంధీ మార్గ్ నుంచి వచ్చే వాహనాలు ఈ ఫ్లైఓవర్ ఎడమ వైపు నుంచి వెళ్లాలని, లేదా నేరుగా ఎం.కె.రోడ్‌కు చేరుకోవాల్సి ఉంటుందని అన్నారు. 18వ తేదీ నుంచి బ్రిడ్జి మరమ్మత్తు పనులు పూర్తయ్యేవరకు శ్యామల్ దాస్ గాంధీ మార్గ్ రోడ్డు ఇరు వైపులా వాహనాలు పార్క్ చేయకూడదని అన్నారు. మార్గ్ నుంచి శ్రీ పటన్ జైన్ మండల్‌కు వచ్చే వాహనాలు ఈ ఫ్లై ఓవర్‌పై నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఎన్.ఎస్.రోడ్‌లో ప్రవేశించి తర్వాత మఫత్‌లాల్ బత్ సిగ్నల్  నుంచి యూ టర్న్ తీసుకొని నేరుగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. బ్రిడ్జిల మరమ్మతులు చేయాల్సిందిగా బీఎంసీకి చెందిన స్టాండింగ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (ఎస్‌టీఏసీ) సిఫార్సు చేసింది. 2009-10 నుంచి బ్రిడ్జిల స్థితి గతులపై అధ్యయనం నిర్వహించింది. 57 బ్రిడ్జిల్లో 34 అపాయకరంగా ఉన్నాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి మరమ్మత్తులు నిర్వహించడం ఇదే తొలిసారి.

Advertisement
 
Advertisement
 
Advertisement