వరాల జల్లు

వరాల జల్లు


ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలపై వరాలజల్లు కురిపించారు. ఒక్క విద్యుత్‌ శాఖ పరిధిలోనే రూ.5,760 కోట్లతో పలు పథకాలను ప్రకటించారు. 1600 ఎకరాల్లో ఐటీ కారిడార్, పలుచోట్ల పారిశ్రామిక వాడలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. రూ.1,000 కోట్లతో కొత్త డ్యాంలు, చెక్‌డ్యాంలు నిర్మించనున్నామని వెల్లడించారు.



రూ.5,760 కోట్లతో కొత్త విద్యుత్‌ పథకాలు

♦  బహుళ ప్రయోజనాల కంటైనర్‌ టెర్మినల్స్‌

♦  వివాహ రిజిస్ట్రేషన్‌ 154 రోజులకు పెంపు బిల్లు

ఉచిత పథకాలకు రూ.490 కోట్లు




సాక్షి ప్రతినిధి, చెన్నై:


అసెంబ్లీ సమావేశాల్లో గురువారం 110 నిబంధన కింద సీఎం ఎడపాడి పళనిస్వామి కార్మికశాఖ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖల పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపం పుళుదివాక్కం, వాయలూరు గ్రామాల్లో 360 ఎకరాల విస్తీర్ణంలో తమిళనాడు కార్మికశాఖాభివృద్ధి కార్యాలయం, కేంద్రప్రభుత్వ జాతీయ రహదారులశాఖతో కలిసి బహుళ ప్రయోజనాల కంటైనర్‌ టెర్మినల్స్‌ను రూ.1,295 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. సముద్ర, వాయు, రోడ్డు మార్గాల రవాణాను దృష్టిలో పెట్టుకుని సిప్‌కాట్‌ పారిశ్రామికవాడలకు పక్కనే, ఒట్టప్పిటారమ్‌ దక్షిణం, మీలవిట్టాన్‌ గ్రామాల్లో సుమారు 1600 ఎకరాల్లో సిప్‌కాట్‌ తూత్తుకూడి ఐటీ కారిడార్‌–2 ఏర్పాటు చేస్తామని తెలిపారు.




ఈ కారిడార్‌ ఏర్పాటుకు ముందుగా 600 ఎకరాల్లో రోడ్లు, వీధి దీపాలు, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం తదితరాలను కల్పించనున్నట్లు చెప్పారు. ఇక్కడి ఐటీ కారిడార్‌ వల్ల రూ.500 కోట్ల పెట్టుబడి, 20 వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. వేలూరు జిల్లా ఆర్కాడు, ముల్లువాడి, నాగలేరి గ్రామాల్లో సుమారు 20 ఎకరాల్లో రూ.4.74 కోట్ల అంచనాతో, తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట,  ఏనంబాక్కం గ్రామాల్లో 216.37 ఎకరాల్లో రూ.58.82 కోట్లతో, తిరువన్నామలై జిల్లా సెంగం మండలం పెరియకొలపాడి, కన్నక్కురుగై గ్రామాల్లో 57.18 ఎకరాల్లో రూ.13 కోట్ల పెట్టుబడితో పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రిజిష్టరు అయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 6.92 లక్షల వరకు ఉండగా వీటి ప్రయోజనాలకు పలు పథకాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.



రూ.2,350 కోట్లతో రామనాథపురం జిల్లాలో 500 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పొంగల్‌ పండుగ ఉచిత పంచలు, చీరల కోసం రూ.490 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రూ.1000 కోట్లతో కొత్త డ్యాంలు, చెక్‌డ్యాంలు నిర్మించనున్నామని అన్నారు. 2009 వివాహ చట్టం ప్రకారం వివాహమైన తేదీ నుంచి 90 రోజుల్లోగా రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంది. ఆలస్యమైతే మరో 60 రోజుల్లో వధూవరులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి, అయితే మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 150 రోజుల్లోగా వివాహ రిజిస్ట్రేషన్‌ పూర్తికావాలి, వధూవరులు నేరుగా హాజరుకాకుండా రిజిస్ట్రేషన్‌ చేయరాదనే కోర్టు ఆదేశాల మేరకు చట్టంలో సవరణలకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. చట్టంలో సవరణకు ముస్లింలీగ్‌ సభ్యుడు అబూబకర్‌ నిరసన తెలిపారు.



విద్యుత్‌ వరాలు

రాష్ట్రంలో పలుచోట్ల రూ.1,347 కోట్లతో 230 కిలోవాట్ల సబ్‌స్టేషన్లు, 110 కిలోవాట్ల సబ్‌స్టేషన్లు, 33 కిలోవాట్ల సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాగపట్టణం జిల్లా మనల్‌మేడు ప్రాంతంలో రూ.650 కోట్ల పెట్టుబడితో 400 కిలోవాట్ల సబ్‌స్టేషన్లను, విద్యుత్‌ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.  గ్రేటర్‌ చెన్నై కోయంబేడులో రూ.1,300 కోట్లతో 400 కిలోవాట్ల ఇంధన విద్యుత్‌ శక్తి నిలయాన్ని ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ప్రస్తుతం 230 కిలోవాట్ల సామర్థ్యంతో ఉన్న తరమణి విద్యుత్‌ కేంద్రాన్ని రూ.710 కోట్లతో రూ.400 కిలోవాట్ల ఇంధనశక్తి సబ్‌స్టేషన్‌గా స్థాయిని పెంచనున్నట్లు తెలిపారు.  చెన్నై శివార్లలో విద్యుత్‌ సరఫరాను మెరుగుపరిచేందుకు అదనంగా 31 కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించి 314 సబ్‌స్టేషన్ల స్థాయిని పెంచనున్నట్లు తెలిపారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top