రాష్ట్రంలో మద్య నిషేధం? | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మద్య నిషేధం?

Published Sat, May 30 2015 3:10 AM

రాష్ట్రంలో మద్య నిషేధం? - Sakshi

సాక్షి, చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని అధికార పగ్గాలు లక్ష్యంగా  రాష్ట్రంలో మద్యనిషేధం వైపుగా అన్నాడీఎంకే సర్కారు అడుగులు వేస్తున్నట్టుంది. దశల వారీగా నిషేధం అమల్లోకి తెచ్చే రీతిలో ప్రజల్ని మెప్పించేందుకు సిద్ధం అయింది. ఇందులో భాగంగా త్వరలో టాస్మాక్ మద్యం దుకాణాల పని వేళలు తగ్గబోతున్నాయి. ఇందుకు తగ్గ కసరత్తుల్లో అధికారులు నిమగ్నం అయ్యారు. రాష్ట్రంలో సుమారు ఏడు వేల మద్యం దుకాణాలు, ఆయా దుకాణాలకు అనుబంధంగా బార్లు ఉన్నాయి.

అలాగే, స్టార్ హోటళ్లలోని బార్లకు ప్రభుత్వమే మద్యం సరఫరా చేస్తున్నది. మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏటా ఆదాయం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ ఆదాయం ఏడాదికి *25 వేలకోట్లు దాటింది. అదే సమయంలో ఈ మద్యం రక్కసి రూపంలో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తుందన్న విమర్శలు బయలు దేరాయి. అలాగే, పీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్‌లతో పాటు పలు పార్టీలు సంపూర్ణ మద్యనిషేధాన్ని అందుకుని పోరుబాట సాగిస్తున్నాయి.

ఈ వ్యవహారంలో డిఎంకే మాత్రం ఆచీతూచి స్పందిస్తున్నది. రానున్న ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా సంపూర్ణ మద్య నిషేధం అమలు నినాదాన్ని అందుకుంటుందా అన్న ఎదురు చూపులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా దూసుకెళ్తోన్న అన్నాడీఎంకే సర్కారు తాము సైతం అన్నట్టుగా దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామన్న ప్రకటనను చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇందుకు తగ్గట్టుగా రాష్ర్టంలోని టాస్మాక్ మద్యం దుకాణాల పని వేళల్ని తగ్గించే కసరత్తులు ఆరంభం అయ్యాయి.
 
తగ్గనున్న పనివేళలు : ప్రస్తుతం టాస్మాక్ మద్యం దుకాణాలు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తెరచి ఉంచుతున్నారు. ఈ పని వేళల్ని తగ్గించాలని ఓ వైపు అందులో పనిచేస్తున్న సిబ్బంది సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. దీనిని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నం అవుతోన్నది. పని వేళల్ని తగ్గించి కార్మికుల డిమాండ్లను పరిష్కరించినట్టుగా ఉండటంతో పాటుగా మద్య నిషేధం దశల వారీగా అమలు చేస్తామన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నది.

శుక్రవారం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వర్గాలు టాస్మాక్ దుకాణాల పని వేళల తగ్గింపుపై సమీక్షించినట్టు సమాచారం. టాస్మాక్ కార్మిక సంఘాల ప్రతినిధులు, ఇతర సిబ్బందితో ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఉన్నారు. పని వేళల తగ్గింపు ద్వారా ఆదాయం ఏ మేరకు తగ్గ వచ్చు, ఆదాయాన్ని ప్రత్యామ్నాయంగా ఎలా భర్తీ చేయగలం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఉన్నారు.

ఈ సమావేశం మేరకు మధ్యాహ్నం రెండు గంటలకు నుంచి రాత్రి పది గంటల వరకు టాస్మాక్ దుకాణాల పని వేళల్ని నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినానంతరం అధికార పూర్వకంగా పని వేళల తగ్గింపు ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు టాస్మాక్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement