కొత్త నిబంధనలు | New regulations | Sakshi
Sakshi News home page

కొత్త నిబంధనలు

Jul 3 2014 11:32 PM | Updated on Oct 8 2018 3:56 PM

కొత్త నిబంధనలు - Sakshi

కొత్త నిబంధనలు

నీళ్లు లేని బోరుబావులు మూసి వేయాలని, కొత్తగా బోరు బావులు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా అధికారుల అనుమతి పొందాలన్న ఆదేశాలు ఉన్నా, వాటిని అమలు చేసేవారు కరువయ్యారు.

 సాక్షి, చెన్నై : నీళ్లు లేని బోరుబావులు మూసి వేయాలని, కొత్తగా బోరు బావులు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా అధికారుల అనుమతి పొందాలన్న ఆదేశాలు ఉన్నా, వాటిని అమలు చేసేవారు కరువయ్యారు. కోర్టులు హెచ్చరించినా ఫలితం శూన్యం. అధికారుల నిర్లక్ష్యానికి ప్రతి ఏటా రాష్ట్రంలో ఇద్దరు లేదా, ముగ్గురు పిల్లలను బోరుబావులు మింగేస్తున్నాయి. ముక్కు పచ్చలారని చిన్నారులు ఆడుకుంటూ బోరు బావుల్లో పడి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగుల్చుతున్నారు.  కొన్నేళ్లలో రాష్ట్రంలో బోరుబావులు 12 మంది చిన్నారులను మింగేశాయి. 2012లో కృష్ణగిరి జిల్లా తలిలో ఓ బాలుడు, రెండు నెలల క్రితం తిరునల్వేలి జిల్లా శంకరన్ కోవిల్ సమీపంలోని కుత్తాలం పేరిలో హర్షన్(3) మృత్యుంజయుడయ్యాడు.
 
 మిగిలిన ఘటనల్లో ముగ్గురు మినహా తక్కిన వాళ్లందరూ బోరు బావిలోనే తుది శ్వాస విడిచారు. మరో ముగ్గురు చిన్నారులను రక్షించినా, సకాలంలో వైద్య సేవలు అందక మృత్యు ఒడికి చేరారు. గత ఏడాది సెప్టెంబరులో దేవి, రెండు నెలల క్రితం విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చి సమీపంలోని త్యాగరాయ దుర్గంలో మధుమతిని అతి కష్టం మీద రక్షించినా, ఆస్పత్రిలో తుది శ్వాస విడి చారు. తిరువణ్ణామలై సమీపంలో సుజిత్(3) బాలుడు బోరు బావిలోనే తుది శ్వాస విడిచాడు. వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నా, బోరు బావుల మూతకు సంబంధించి గానీ, బోరు బావుల యజమానులపై చర్యలు అంతంత మాత్రమే. దీంతో వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది.
 
 పిటిషన్: విల్లివాక్కంకు చెందిన శివగామి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బోరు బావులు చిన్నారుల్ని మింగేస్తున్న ఘటనల్ని తన పిటిషన్‌లో వివరించారు. బోరు బావుల ఏర్పాటు, నీళ్లు పడని పక్షంలో తీసుకోవాల్సి న చర్యలకు సంబంధించిన ఆంక్షల చిట్టాను పొందు పరిచారు. అయినా, బోరు బావుల మరణాలు ఆగడం లేదని వివరించారు. అధికారుల నిర్లక్ష్యంతో ముక్కు పచ్చలారని చిన్నారులు ఆడుకుంటూ, బోరు బావుల్లో పడి మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోరు బావులకు సంబంధించిన పాత నిబంధనలను పక్కన పెట్టి, కొత్త నిబంధనలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
 బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు.
 ఆదేశం : ఈ పిటిషన్‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అగ్ని హోత్రి, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ గురువారం విచారించింది. బోరు బావుల మరణాలను తీవ్రంగా పరిగణించింది. ఇటీవల కాలంగా చిన్నారులను బోరు బావులు మింగేస్తుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న బెంచ్ కొరడా ఝుళిపించేందుకు సిద్ధం అయింది. బోరు బావులపై కొత్త నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని బెంచ్ అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసింది. కొత్త నిబంధనలను త్వరితగతిన రూపొందించి కోర్టుకు సమర్పించాలని, సమగ్ర పరిశీలనానంతరం బోరు బావులపై కొరడా ఝుళిపించే కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చే రీతిలో సూచనల్ని ఇచ్చింది. వారం రోజుల్లో కొత్త నిబంధనలు రూపొందించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement