ముంబై ఉగ్రవాద దాడుల్లో మృతి చెందిన రాష్ట్ర ఏటీఎస్ ప్రధానాధికారి హేమంత్ కర్కరేను స్ఫూర్తిగా తీసుకున్న చంద్రపూర్ ట్రాఫిక్ పోలీసులు ఓ హెచ్‌ఐవీ జంటకు వివాహం చేశారు.
చంద్రపూర్: ముంబై ఉగ్రవాద దాడుల్లో మృతి చెందిన రాష్ట్ర ఏటీఎస్ ప్రధానాధికారి హేమంత్ కర్కరేను స్ఫూర్తిగా తీసుకున్న చంద్రపూర్ ట్రాఫిక్ పోలీసులు ఓ హెచ్‌ఐవీ జంటకు వివాహం చేశారు. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా న్ఠరానికి చెందిన నెట్‌వర్క్ ఆఫ్ మహారాష్ట్ర బై పీపుల్ లివింగ్ వీత్ హెచ్‌ఐవీ పాసిటివ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఈ జంటకి పెళ్లి చేశారు. 1990 సంవత్సరంలో చంద్రపూర్‌లో పోలీసు సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో కర్కరే ప్రారంభించిన హెచ్‌ఐవీ అవగాహన కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికీ వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని నగర ట్రాఫిక్ విభాగ ఇన్‌స్పెక్టర్ పండలిక్ సప్కలే సోమవారం మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు హెచ్‌ఐవీ కలిగిన ఎనిమిది జంటలను ఒకటీ చేశామని సంస్థ కన్వీనర్ విజయ్ బెండే తెలిపారు.
హెచ్‌ఐవీ వచ్చిందంటే సమాజం వేలివేసి చూసే ఈ రోజుల్లో తమ భాగస్వామి కోసం వెతికే సమయంలో తమ పరిస్థితిని రోగులు వెల్లడించడం లేదన్నారు. కొన్నిసార్లు ఇది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తితో హెచ్‌ఐవీ రోగి వివాహం చేసుకునేందుకు దారి తీస్తుందని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకొని హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్న వారికి అదే కమ్యూనిటీ నుంచి జీవిత భాగస్వామిని ఎంచుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. వీరి వివరాలు రహస్యంగా ఉంచుతున్నామని వెల్లడించారు