ఎట్టకేలకు క్లోజ్ | Manduru dumping yard with key officials | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు క్లోజ్

Nov 22 2014 1:50 AM | Updated on Sep 2 2017 4:52 PM

నగరంలో సేకరిస్తున్న చెత్తను ఇక మీద మండూరులో వేయరాదని బీబీఎంపీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మండూరు డంపింగ్ యార్డ్‌కు తాళమేసిన అధికారులు
 
బెంగళూరు:   నగరంలో సేకరిస్తున్న చెత్తను ఇక మీద మండూరులో వేయరాదని బీబీఎంపీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గురువారం రాత్రి 10.45 గంటల సమయంలో మండూరుకు వెళ్లిన పాలికె ఇంజనీర్లు అక్కడ డంపింగ్ యార్డ్‌కు చెత్తను తీసుకు వెళ్లిన సుమారు 50 లారీల డ్రైవర్లకు శుక్రవారం నుంచి ఇక్కడికి చెత్త తీసుకురాకూడదని సూచించారు. మండూరు చెత్త డంపింగ్ యార్డ్ పరిశీలిస్తున్న పాలికె జాయింట్ కమిషనర్‌లు దర్పణ్ జైన్, డాక్టర్ యతీష్ కుమార్ ఆదేశాల మేరకు  మండూరు యార్డ్‌కు తాళం వేశారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి మండూరులో చెత్త వెయ్యనియ్యబోమని పాలికె అధికారులు గతంలోనే మాట ఇచ్చారు. ఇంతకు ముందు అనేక సార్లు పాలికె అధికారులు మాట తప్పి మండూరులోనే చెత్త వేస్తూ కాలం వెళ్లదీశారు. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు భావించారు. అయితే పాలికె అధికారులు చెప్పిన గడువు కంటే 10 రోజులు ముందుగానే మండూరు చెత్త డంపింగ్ యార్డ్‌కు తాళం వేశారు. మండూరులో ఇంత కాలం వేస్తున్న చెత్తను ఇక ముందు కేసీడీసీ, లక్ష్మిపుర, టెర్రాఫాం డంపింగ్ యార్డ్‌లో వేయాలని  పాలికె అధికారులు సూచించారు.

గ్రామస్తుల సంబరాలు

పాలికె జాయింట్ కమిషనర్‌లు దర్పణ్ జైన్, డాక్టర్ యతీష్ కుమార్‌లు గురువారం రాత్రి మండూరు గ్రామ పెద్దలకు ఫోన్ చేశారు. శుక్రవారం నుంచి మండూరులో చెత్త వేయబోమని చెప్పడంతో మండూరు, చుట్టు పక్కల గ్రామాల్లో నివాసం ఉంటున్న వారు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం గ్రామ పెద్దలు మండూరు ప్రజలకు స్వీట్‌లు పంచిపెట్టారు. ఇంత కాలం తామూ చేసిన పోరాటాలకు ఈ రోజు న్యాయం జరిగిందని మండూరు గ్రామ పెద్దలలో ఒకరైన శ్రీనివాస్‌గౌడ చెప్పారు.
 
మండూరు యార్డ్‌లో 10 లక్షల టన్నుల చెత్త

ఇంత కాలం బెంగళూరులోని చెత్తను మండూరు డంపింగ్ యార్డ్‌కు తరలించడంతో అక్కడ దాదాపు 10 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. చెత్త మీద కంపోస్టు మందులు చల్లారు. ఈ చెత్తను ఎరువులుగా తయారు చేయాలంటే  ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయంలో పడుతుందని గ్రామస్తులు అంటున్నారు. ఈ చెత్తను వేరే ప్రాంతాలకు తరలించాలంటే రెండు మూడు నెలలు పడుతుందని బీబీఎంపీ అధికారులు అంటున్నారు.     
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement