కేబినెట్‌లో ఆ ముగ్గురికి చోటు దక్కినట్లే(నా)?

Karnataka Lobbying intensifies for ministerial berths - Sakshi

మంత్రి పదవులు దక్కేదెవరికో?

6న మంత్రివర్గం ఏర్పాటుకు ముహూర్తం 

కేబినెట్‌లో బెర్తు కోసం ఎమ్మెల్యేల లాబీయింగ్‌

పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు  

సాక్షి, బెంగళూరు:  కాంగ్రెస్‌ – జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో ఆ రెండు పార్టీలకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది. కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు 12 శాఖలు చొప్పున కేటాయించేలా ఒప్పందానికి వచ్చారు. ఈనెల 6వ తేదీ (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తానని సీఎం కుమారస్వామి తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌– జేడీఎస్‌ పార్టీల ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం భారీగా పోటీ పడుతున్నారు. తమకే మంత్రిమండలిలో బెర్తు ఖరారు కావాలంటూ పార్టీ పెద్దల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దేవెగౌడ ఇంటికి క్యూ జేడీఎస్‌ పార్టీలోని ఎమ్మెల్యేలందరు మంత్రి పదవుల కోసం ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడను ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. బెంగళూరు నగరంలోని పద్మనాభనగర్‌లోని దేవేగౌడ నివాసానికి క్యూ కడుతున్నారు. ఆయన ఓకే చేస్తే తమకు బెర్తు ఖరారు అవుతుందని విశ్వాసంతో భారీ లాబీయింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో జేడీఎస్‌ నుంచి 37 మంది ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే.  

రాహుల్‌ వద్దనే పంచాయితీ..
అదేవిధంగా కాంగ్రెస్‌ జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. ఈమేరకు కొత్త జాబితా తీసుకుని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ ఢిల్లీ తరలివెళ్లారు. ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చించి తుది జాబితా ఖరారు చేయనున్నారు. విదేశాల్లో ఉన్న రాహుల్‌గాంధీ శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈనేపథ్యంలో ఆదివారం కర్ణాటక కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమై మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు ఉండాలి? ఏ శాఖ కేటాయించాలనే దానిపై తుది నిర్ణయానికి వస్తారు. కాంగ్రెస్‌లో మొత్తం 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 

ఆ ముగ్గురికి చోటు దక్కినట్లే(నా)?
కర్ణాటకలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటాపోటీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు స్వతంత్రులు, ఒక బీఎస్పీ అభ్యర్థి విజయం సాధించారు. కాగా వారిలో స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. అలాగే బీఎస్పీ ఎన్నికలకు ముందే జేడీఎస్‌తో జత కట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్, స్వతంత్ర ఎమ్మెల్యేలు నగేష్, ఆర్‌.శంకర్‌కు మంత్రివర్గంలో చోటు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురికీ ఏ శాఖలు ఇస్తారనేది ఇంకా తెలియరాలేదు. 

జేడీఎస్‌లో ఎవరెవరంటే..
జేడీఎస్‌ సీనియర్‌ నాయకులు హెచ్‌డీ రేవణ్ణ, బసవరాజు హొరట్టి, హెచ్‌.విశ్వనాథ్, బీఎం ఫరూఖ్, సీఎస్‌ పుట్టరాజు, జీటీ దేవేగౌడ తదితరులకు మంత్రివర్గంలో చోటు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మరో వైపు బండప్ప కాశంపూర్, ఏటీ రామస్వామి, హెచ్‌కే కుమారస్వామి, శ్రీనివాసగౌడ, గోపాలయ్య, కంపెనగౌడ నాడెగౌడ, బి.సత్యనారాయణ్, ఎస్‌ఆర్‌ శ్రీనివాస్, కేఎం శివలింగేగౌడ, ఎంసీ మనగుళి తదితరులు మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. 

కాంగ్రెస్‌లో మాజీలతో పాటు మరికొందరు..
కాంగ్రెస్‌ పార్టీలో కూడా మంత్రి పదవుల కోసం చాలామంది పోటీలో ఉన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన డీకే శివకుమార్, శామనూరు శివశంకరప్ప, ఆర్‌వీ దేశ్‌పాండే, హెచ్‌కే పాటిల్, ఎంబీ పాటిల్, కేజే జార్జి, రామలింగారెడ్డి, కృష్ణభైరేగౌడ, రోషన్‌బేగ్, తన్వీర్‌ సేఠ్, ప్రియాంక ఖర్గే, ఈశ్వర్‌ ఖండ్రే తదితరులు ఈసారి కూడా కేబినెట్‌ బెర్తు ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాధ్యక్షులు ఎస్‌ఆర్‌ పాటిల్, దినేష్‌ గుండూరావు, సీనియర్‌ ఎమ్మెల్యేలు సతీష్‌ జారకిహోళి, శివానంద పాటిల్, అమరేగౌడ బయ్యాపుర, లక్ష్మీ హెబ్బాళ్కర్, అజయ్‌సింగ్, యశవంతరాయపాటిల్, ఉమేశ్‌యాదవ్, పుట్టరంగశెట్టి, డాక్టర్‌ సుధాకర్, సీఎస్‌ శివెళ్లి, అభయ్‌ప్రసాద్, బసవరాజు పాటిల్‌ తదితరులు మంత్రి పదవిని ఆశించే వారిలో ఉన్నట్లు సమాచారం. 

హస్తినకు కాంగ్రెస్‌ నేతలు
ఆదివారం ఏఐసీసీ చీఫ్‌ రాహుల్‌గాంధీతో సమావేశం కావడానికి కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు శనివారం ఢిల్లీ తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ జాబితా ఖరారు చేస్తారు. ఎవరికి ఏ శాఖ ఇస్తారనే దానిపై ఢిల్లీలోనే ఫైనల్‌ అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సోమ లేదా మంగళవారం కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీల మంత్రుల జాబితా పూర్తి కానుంది. అనంతరం బుధవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది.

మంత్రి పదవి అడగలేదు..
తనకు మంత్రి పదవి కావాలని ఎవరినీ అడగలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సతీష్‌ జారకిహోళి తెలిపారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారన్న విలేకరుల ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. మంత్రి పదవుల కేటాయింపులో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌దే తుది నిర్ణయమని అన్నారు. తనకు ఏ శాఖ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మనసులో మాట చెప్పారు.   

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top