
ఊరట
ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపై కొందరు ఇంకా ఉత్కంఠను ఎదుర్కొంటుండగా మరికొందరు ఆమె ఆరోగ్యం
అమ్మ ఆరోగ్యం మరింత మెరుగు
అపోలో ఆసుపత్రి వర్గాల వెల్లడి
అభిమానుల ఆనందోత్సాహాలు
త్వరలో డిశ్చార్‌జ : పార్టీ వెల్లడి
యథావిధిగా మంత్రుల రాక
40 మందిపై పోలీసు కేసులు
ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపై కొందరు ఇంకా ఉత్కంఠను ఎదుర్కొంటుండగా మరికొందరు ఆమె ఆరోగ్యం కుదుటపడిందని నమ్ముతూ ఊరట చెందుతున్నారు. కాగా, అమ్మ ఆరోగ్యం మరింత మెరుగుపడిందని పేర్కొంటూ అపోలో ఆసుపత్రి ఆదివారం రాత్రి ఒక బులెటిన్‌ను విడుదల చేసింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చేరి ఆదివారానికి పదిరోజులైంది. కేవలం రెండు, మూడు రోజుల్లో అమ్మ డిశ్చార్జ్ అవుతారని ఎదురుచూసిన పార్టీ శ్రేణులు, అభిమానులు రోజులు గడిచిపోతున్న కొద్దీ లోలోన నిరాశకు లోనయ్యారు. అయితే అపోలో ఆసుపత్రి వారు, పార్టీ అధికార ప్రతినిధులు మాత్రం అమ్మ వేగంగా కోలుకుంటున్నారని, త్వరలో డిశ్చార్జ్ అవుతారని ఎప్పటికప్పుడు ధీమాను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా జయలలిత ఆరోగ్యంపై కొందరు వ్యక్తులు గత నెల 30వ తేదీన వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ సాంఘిక మాధ్యమాల ద్వారా అవాంఛనీయమైన వదంతులు పుట్టించారు.
ఈ వదంతులు అనేక రాష్ట్రాల్లో హల్‌చల్ చేయడంతో అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ప్రాం తీయ, జాతీయ మీడియాకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అపోలో ఆసుపత్రి ముందు శనివారం ఉదయానికి వాలిపోయారు. ఇదిగో ప్రకటిస్తారు...అదిగో ప్రకటిస్తారని హడావిడి చేసి మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పారు. ఇంతలో తమిళనాడు గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం రాత్రి అపోలో ఆసుపత్రికి చేరుకుని చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి సహా ఇతర వైద్య బృందాన్ని కలవడం, సీఎం క్షేమంగా ఉన్నారంటూ గవర్నర్ ప్రకటించడంతో 48 గంటల ఉత్కంఠకు తెరపడింది. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మీడియా వారు మాత్రం ఇంకా చెన్నైలోనే ఉన్నారు.
పూజలు...సంబరాలు:
ఇదిలా ఉండగా, అపోలో ఆసుపత్రి వద్ద ఆదివారం ప్రశాంత వాతావరణం నెలకొంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు యథావిధిగా అపోలోకు చేరుకుని తిరిగి వెళ్లారు. అమ్మ ఆరోగ్యం మరింత మెరుగుపడుతున్నట్లు అధికారికంగా సమాచారం రావడంతో అన్నాడీఎంకే శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అపోలో ఆసుపత్రి ముందు మహిళా కార్యకర్తలు గుమ్మడికాయ దిష్టితీసి పూజలు చేశారు. మరికొందరు కార్యకర్తలు అమ్మ ఫొటోకు హారతులు ఇస్తూ నాట్యాలు చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన జయ అభిమానులు అపోలో ముందు కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి అవాకులు చవాకులు పేలుతున్నారని మాజీ మంత్రి వలర్మతి ఆరోపించారు. అమ్మ కోలుకుంటున్నారు, త్వరలో డిశ్చార్జ్ అవుతారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధులు సీఎస్ సరస్వతి, పొన్నయ్యన్ తెలిపారు.
వదంతి బాబులపై 40 కేసులు:
సీఎం జయలలిత ఆరోగ్యంపై అనధికార సమాచారంతో వదంతులు పుట్టించిన 40 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మ ఆరోగ్యం విషయంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునేలా ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ల ద్వారా ప్రచారం చేశారు. దీంతో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మ ఆరోగ్యం ఉన్నట్లు తెలుసుకుని ఊరట చెందిన అభిమానులు దుష్ర్పచారం చేసిన వారిపై ఆగ్రహోద్రులైనారు. మొత్తం 40 పోస్టింగులపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆదివారం ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల విభాగం అదనపు పోలీస్ కమిషనర్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ, వదంతులు ప్రచారం చేసిన వారిపై అందిన ఫిర్యాదుల మేరకు 40 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఆయా మాధ్యమాల సర్వర్ యూఎస్‌లో ఉన్నందున నిందితులను వెంటనే గుర్తించడంలో కొంత జాప్యం జరుగుతుందని అన్నారు. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.