
ఫొటోలు జయ వద్దన్నారు
అన్నాడీఎంకే కార్యకర్త జోసెఫ్ మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం (పిల్)ను ఇటీవల దాఖలు చేశాడు.
చెన్నై :
అన్నాడీఎంకే కార్యకర్త జోసెఫ్ మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం (పిల్)ను ఇటీవల దాఖలు చేశాడు. అస్వస్తతకు లోనైన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీన అపోలో ఆసుపత్రిలో అడ్మిటై 74 రోజులపాటూ చికిత్స పొంది డిశంబరు 5వ తేదీన మరణించారు. జయ మృతిపై అనుమానాలు ఉన్నాయని ప్రజలు భావించగా, ఐదు మంది రిటైర్డు న్యా యమూర్తులతో విచారణ జరిపించాల్సిందిగా కోర్టులో పిటిషన్లు దాఖలైనాయి.
నాగపట్నం జిల్లాకు చెందిన అన్నాడీఎంకే కార్యకర్త జ్ఞానశేఖరన్, సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరి పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి వైద్యనాధన్ జయ మృతిలో తనకు సైతం సందేహాలు ఉన్నాయని, సమాధి నుండి జయ భౌతికకాయాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయా అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా జోసెఫ్ పెట్టిన ఈ కేసు గతంలో విచారణకు రాగా ప్రధాని కార్యాలయ ముఖ్య కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరక్టర్ తదితరులు బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు మద్రాసు హైకోర్టు ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి హెచ్ రమేష్ ముందుకు గురువారం విచారణకు వచ్చింది. కేంద్రం తరుపున బదులు పిటిషన్ దాఖలు చేసేందుకు మరో రెండువారాలు గడువు కావాలని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరగా న్యాయమూర్తి మంజూరు చేశారు.
వివరణ ఇచ్చిన అపోలో:
కాగా, అపోలో ఆసుపత్రి యాజమాన్యం తరుపున గురువారం ఒక బదులు పిటిషన్ కోర్టులో దాఖలు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందే చిత్రాన్ని విడుదల చేయవద్దని జయలలిత కోరినట్లుగా అపోలో తెలిపింది. ఆమె అభీష్టాన్ని అనుసరించి ఫోటో, వీడియోను విడుదల చేయలేదని చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ నియమ నిబంధనలను అనుసరించి రోగికి జరుగుతున్న చికిత్స వివరాలను వెల్లడించ కూడదని వారు అన్నారు. అయితే ఎప్పటికప్పుడు జయ చికిత్స వివరాలపై బులెటిన్లు విడుదల చేశామని తెలిపారు. ఈ బులెటిన్లు సైతం జయ ఆమోదం మేరకే విడుదల చేశామని అన్నారు.
ప్రభుత్వ వివరణ :
అలాగే తమిళనాడు ప్రభుత్వం సైతం బదులు పిటిషన్ దాఖలు చేసింది. వైద్యల సలహామేరకే జయకు చికిత్స చేశామని, ఇందులో ఎటువంటి గోప్యం లేదని స్పష్టం చేసింది. అయితే పిటిషన్ల తరుపు న్యాయవాది అసంతృప్తి వ్యక్తం చేశారు. జయకు బాగా చికిత్స చేశామని మాత్రమే చెబుతున్నారు, తాము కోరిన వివరాలు కోర్టు ముందు ఉంచలేదని న్యాయవాది వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వివరణ సైతం ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చిన వివరణనే పోలి ఉందని అన్నారు. జయ మృతిపై పూర్తిస్తాయి వివరణ ఇచ్చేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది కోరగా న్యాయమూర్తి ఈ కేసు విచారణను రెండువారాలకు వాయిదావేశారు.