అట్టహాసంగా జయ నామినేషన్


 చెన్నై ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థిగా ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు. నెచ్చెలి శశికళ వెంటరాగా నామినేషన్ ప్రక్రియను ముగించారు.

 

 చెన్నై, సాక్షి ప్రతినిధి:గత ఎన్నికల్లో (2011) శ్రీరంగం నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా గెలుపొందిన జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు శిక్షపడిన కారణంగా అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయారు. శ్రీరంగం నియోజకవర్గంలో గత ఏడాది జరిగిన ఉప ఎన్నికలో అమ్మ స్థానంలో వలర్మతి ఎన్నికయ్యారు. ఆస్తుల కేసు నుంచి గత నెల 11వ తేదీన వెలువడిన తీర్పులో జయ నిర్దోషిగా బైటపడడంతో 23వ తేదీన ముఖ్యమంత్రిగా మళ్లీ అధికారం చేపట్టారు. అయితే ఆరునెలల్లోగా అసెంబ్లీ సభ్యురాలిగా గెలవాల్సి ఉన్నందున చెన్నైలోని ఆర్కేనగర్ నియోజకవర్గాన్ని సిద్ధం చేసుకున్నారు. అర్కేనగర్ అన్నాడీఎంకే ఎమ్మెల్యే వెట్రివేల్ రాజీనామా చేయగా ఉప ఎన్నిక వచ్చింది. ఈనెల 3వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం కాగా తొలిరోజున ఐదు మంది నామినేషన్లు వేశారు. రెండోరోజైన 4వ తేదీన ఒక్క నామినేషన్ కూడా పడలేదు.

 

 జయహో:

    అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం ముందుగా ప్రకటించినట్లుగానే పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలిత శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు పోయెస్‌గార్డెన్ నుంచి తండయార్‌పేటకు బయలుదేరారు. బీచ్‌రోడ్డు, ప్యారిస్, రాయపురం మీదుగా సాగుతున్న జయకు దారిపొడవునా అభిమానుల ఘన స్వాగతం పలికారు. అనేక కూడళ్లలో కారుపై పూల వర్షం కురిపించారు. బ్యాండు మేళాలు, అనేక వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ అమ్మ కాన్వాయ్ సాగింది. పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు తరలివచ్చి రోడ్లపై నృత్యాలు చేశారు. ఆర్కేనగర్ అభ్యర్థిగా అమ్మ తొలిసారిగా అడుగుపెట్టిన వేళ జయ జయ ధ్వానాలతో మార్మోగి పోయింది. అమ్మ రాకపోకలు సాగించే మార్గం పోలీసుల భారీ బందోబస్తు నిండిపోయింది. 1.30గంటల సమయంలో తండయార్‌పేట కార్పొరేషన్ నాల్గవ మండల కార్యాలయానికి చేరుకున్న జయకు మంత్రులు ఘనస్వాగతం పలికారు. శశికళతో కలిసి లోనికి వెళ్లిన జయలలిత ఎన్నికల అధికారి శౌరిరాజన్‌కు తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. సుమారు పది నిమిషాల అనంతరం జయ తిరుగు ప్రయాణమయ్యారు.

 

 మూడో రోజు పది నామినేషన్లు:

 ఆర్కేనగర్‌లో పోటీకి శుక్రవారం జయ సహా మొత్తం పది మంది నామినేషన్లు వేశారు. రాందాస్ (భారత మక్కల్ ఇయక్కం),  మనోహరన్ (తృణమూల్ కాంగ్రెస్), వెంకటేశన్, వసంతకుమార్ (హిందూ సత్యసేన), పీ కుమారస్వామి, ఈ. మధుసూధన్ (అన్నాడీఎంకే ప్రత్యామ్నాయ అభ్యర్థి), జే మోహన్‌రాజ్, అబ్దుల్ వహీద్, మారిముత్తు నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 15 నామినేషన్లు వచ్చాయి. జయ, మధుసూధన్ మినహా మిగిలిన వారిని స్వతంత్య్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు.

 

 బీజేపీ ఊగిసలాట:

   ఆర్కేనగర్‌లో పోటీకి పెట్టడంపై కూటమి పార్టీల నిర్ణయంపై ఆధారపడిన భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఊగిసలాటగా మారింది. డీఎండీకే అధినేత విజయకాంత్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఇటీవల సమావేశమైనారు. డీఎంకే, పీఎంకే, ఎండీఎంకే, తమాకా పార్టీలన్నీ ఎన్నికలను బహిష్కరించినందున విపక్షాల ఓట్లు కొల్లగొట్టవచ్చని విజయకాంత్ భావించి పోటీకి సుముఖత వ్యక్తం చేశారు. ఇంతలో పోటీకి దిగుతున్న సీపీఐ ప్రకటించడంతో కెప్టెన్ వెనక్కుతగ్గారు. విజయకాంత్ ఎటూతేల్చక పోవడంతో బీజేపీలో డోలాయమాన పరిస్థితి కొనసాగుతోంది. కాగా, ప్రధాన అభ్యర్థులు రంగంలో లేకపోయినా అమ్మకు భారీ మెజారిటీ కట్టబెట్టాలని అన్నాడీఎంకే పట్టుదలతో ఉంది. మంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో 50 మంది ప్రముఖ నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించగా, వీరితోపాటూ విద్యుత్‌శాఖా మంత్రి నత్తం విశ్వనాథం సైతం ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తున్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top