ఇక రంకెలే!


► మదురైలో జల్లికట్టు కోలాహలం

► నేడు అవనీయాపురంలో శ్రీకారం

► సర్వం సిద్ధం      

► 9న పాలమేడు

► 10న అలంగానల్లూరులో

►  ఆరున క్రీడాకారులకు టోకెన్లు




సాక్షి, చెన్నై : మదురై జిల్లాలో జల్లికట్టు కోలాహలం నెలకొంది. ఆదివారం అవనీయాపురం వేదికగా జల్లికట్టుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు సర్వం సిద్ధం చేశారు. వందలాది బసవన్నలు వాడి వాసల్‌ మీదుగా రంకెలేస్తూ క్రీడాకారులతో ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇక, తొమ్మిదో తేదీన పాలమేడు, పదో తేదీన అలంగానల్లూరులో జల్లికట్టు సాగనుంది. ఇందుకుగాను ఆరో తేదీ నుంచి క్రీడాకారులకు టోకెన్లు, ఎద్దుల రిజిస్ట్రేషన్లు సాగనున్నాయి. ఇక, తమ సంప్రదాయ, సాహస క్రీడ కనుమరుగైనట్టేనా అన్న ఆందోళనలో పడ్డ జల్లికట్టుకు ప్రఖ్యాతి గాంచిన మదురైలో ప్రస్తుతం ఆనందకర వాతావరణం నెలకొంది. విద్యార్థి ఉద్యమంతో ప్రభుత్వం దిగి రావడం, కోర్టు సైతం పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో ఇక, జల్లికట్టులో రంకెలు కొట్టేందుకు బసవన్నలు, రంకెలేస్తూ, వాటికి ముక్కుతాడు వేసితమ సాహసాన్ని చాటుకునేందుకు  క్రీడాకారులు సిద్ధమయ్యారు.


జల్లికట్టు తమిళుల సంప్రదాయ, సాహస క్రీడ అయినా, జల్లికట్టు అంటే, మదురై జిల్లా అన్నది ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాల్లో జల్లికట్టును తొలుత అవనీయాపురంలో తదుపరి పాలమేడులో, అనంతరం ప్రపంచ ప్రసిద్ధి చెందిన అలంగానల్లూరులో నిర్వహించడం సంప్రదాయం. ఈ ఏడాది సంక్రాంతి పర్వదినం వేళ జల్లికట్టుకు దూరంగా ఉద్యమం సాగింది. అందుకే, మంచి మూహూర్తంతో ఆదివారం నుంచి మదురై జిల్లాలో వారం రోజుల పాటు జల్లికట్టు సందడి చోటు చేసుకోనుండంతో అక్కడి ప్రజలకే కాదు, రాష్ట్రంలో ప్రతి మూలా ఉన్న తమిళుడికీ ఆనందమే.



ఇక రంకెలే: అవనీయాపురం వేదికగా ఉదయం ఎనిమిది గంటలకు జల్లికట్టుకు శ్రీకారం చుట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. క్రీడాకారులకు, ఎద్దుల యజమానులకు కట్టుదిట్టమైన ఆంక్షల్ని, నిబంధల్ని విధించారు. నిఘా నేత్రాల నీడలో జల్లికట్టు గురునాథ ఆలయం మైదానం వాడి వాసల్‌ వద్ద సాగనుంది. గ్యాలరీల నుంచి జనం వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.తొలుత ఆలయ ఎద్దు, తదుపరి గ్రామపెద్ద ఎద్దు రంకెలేస్తూ కొడుతూ వాడి వాసల్‌ నుంచి దూసుకు రానున్నాయి. వాడి వాసల్‌ నుంచి పదిహేను మీటర్ల తదుపరి ఎద్దుల్ని పట్టే విధంగా క్రీడాకారులకు ఉపదేశాలు ఇచ్చారు. ఎద్దును హింసించే విధంగా ఏ క్రీడాకారుడైనా వ్యవహరిస్తే, ఇక, అతడికి మరో అవకాశం అన్నది లేనట్టే. అవనీయాపురం తదుపరి నామక్కల్‌లోనూ ఈ సారి జల్లికట్టు సందడికి శ్రీకారం చుట్టేందుకు సర్వం సిద్ధం చేసి ఉండడం విశేషం.



అలంగానల్లూరులో: మదురై పాలమేడులో 9న, అలంగానల్లూరులో పదో తేదీన జల్లికట్టు సాగనుంది. ఇందుగాను ఎద్దులు రిజిస్ట్రేషన్లు, క్రీడాకారులకు టోకెన్లు సోమవారం నుంచి పంపిణీ చేయనున్నారు. వాడి వాసల్‌ వద్ద ఏర్పాట్లలో జల్లికట్టు నిర్వహణ కమిటీలు నిమగ్నమయ్యాయి. సీఎంతో పాటుగా పలు పార్టీల నాయకులు సైతం హాజరు కానుండడంతో అందుకు తగ్గ ప్రత్యేక ఏర్పాట్లలో నిర్వహకులు ఉన్నారు. అలంగానల్లూరులో అయితే, ఈ ఏడాది క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులు ఎదురు చూస్తున్నాయి. ఈ విషయంగా నిర్వాహకులు సుందరరాజ్, సుందర రాఘవన్, గణేష్‌ పేర్కొంటూ, ఈ ఏడాది కారు, మోటారు బైక్, బుల్లెట్, ట్రాక్టర్‌ వంటి బహుమతులతో పాటు  పలు రకాల వస్తువులు బహుమతులుగా పంపిణీ చేయడానికి నిర్ణయించినట్టు వివరించారు.



స్టాలిన్ కు ఆహ్వానం : పాలమేడు, అలంగానల్లూరుల్లో జల్లికట్టుకు హాజరు కావాలని కోరుతూ ఆయా నిర్వహక కమిటీల పెద్దలు శనివారం డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కు ఆహ్వానం పలికారు. చెన్నైకు చేరుకున్న నిర్వాహకులు అన్నాఅరివాలయంలో స్టాలిన్ తో భేటీ అయ్యారు. ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈసందర్భంగా నిర్వాహకులు చెల్లదురై, రఘుపతి మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్ కు ఆహ్వానం పలికామని, ఆయన జల్లికట్టు వీక్షణకు రానున్నారని తెలిపారు.



చిక్కిన ఖాకీలు : ఆటోలకు నిప్పు పెట్టిన పోలీసులు చిక్కారు. ఆ ముగ్గుర్ని ఎట్టకేలకు గుర్తించారు. జల్లికట్టు ఉద్యమం చివరి రోజున ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. కొన్నిచోట్ల పోలీసులే వాహనాలకు నిప్పుపెట్టడం, ప్రజల్ని చితక్కొట్టడం వంటి దృశ్యాలు ఆయా ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థల్లో ఉన్న నిఘా నేత్రాల ద్వారా  వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ పెరిగింది. రుద్రపురంలో ఆటోడ్రైవర్‌ను చితక్కొట్టడం, నిప్పు పెట్టడం వంటి దృశ్యాలు సోషల్‌ మీడియాల్లో హల్‌ చల్‌చేశాయి.


ఆ వీడియోల ఆధారంగా నిప్పుపెట్టిన పోలీసుల్ని గుర్తించారు. ఓ పోలీసు ఉన్నతాధికారికి సహాయకుడిగా ఉన్న తూత్తుకుడికి చెందిన కానిస్టేబుల్‌ రంగరాజన్, ఎంజీయార్‌ నగర్‌ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ లక్ష్మి అలియాస్‌ మహాలక్ష్మి, అన్నానగర్‌ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ గుణ సుందరిగా వారిని శనివారం గుర్తించారు. ఇక, వీరిపై ఎలాటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top