ఆ ఇన్స్‌పెక్టర్‌కు రూ.కోటి ఇవ్వాలట

Inspector Demands money To Women In Karnataka - Sakshi

కేసులు పెట్టి వేధిస్తున్నారు  

హోంమంత్రికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు  

ఓ మహిళ ఆరోపణలు

కర్ణాటక, శివాజీనగర: సీసీబీ పోలీస్‌ అధికారి ఒకరు రూ.1 కోటికి పైగా డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తనపై 3 తప్పుడు కేసులను నమోదు చేసి అమానుషంగా దాడి జరిపారని, తక్షణమే ఆయనను సస్పెండ్‌ చేయాలని నగరానికి చెందిన స్పందనా ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు జీ.టీ.వీణా డిమాండ్‌ చేశారు. సోమవారం ఆమె ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ సీసీబీ ఇన్‌స్పెక్టర్‌ షరీఫ్‌.. డబ్బు ఇవ్వాలని తనను బెదిరింపులకు గురిచేయటమే కాకుండా మానసిక వేధింపులకు గురిచేశారని తెలిపారు. ఆ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోమ్‌శాఖ మంత్రికి, పోలీసు అధికారులకు విన్నవించినా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం రాలేదని ఆమె వాపోయారు.

ఖాళీపత్రాలు, చెక్కులపై సంతకాలు  
పెద్ద నోట్ల రద్దు సమయంలో తన ట్రస్ట్‌కు అక్రమంగా రూ.4 కోట్ల నిధులు వచ్చాయని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్‌కు పిలిపించి 7 రోజుల పాటు కస్టడీలో పెట్టి అసభ్యకరమైన పదజాలంతో దూషించటమే కాకుండా తీవ్రంగా దాడి జరిపారని వీణా చెప్పారు. ఆ సందర్భంలో పలు పత్రాలు, 10 ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకున్నారని చెప్పారు. ఈ విషయాన్ని లోకాయుక్త, పోలీసు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశానని పేర్కొన్నారు. డబ్బు ఇవ్వాలని వేధిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ షరీఫ్‌ను సస్పెండ్‌ చేయాలని, లేనిపక్షంలో న్యాయం లభించేవరకు పోరాటం చేపడుతానని చెప్పారు. వీణా కుమార్తె మేఘనా మాట్లాడుతూ ఇన్‌స్పెక్టర్‌ షరీఫ్‌ బెదిరింపులు తట్టుకోలేక మిత్రుల నుంచి రూ.1 లక్ష సరిచేసి ఆగస్టు 22న షరీఫ్‌కు ఇచ్చామన్నారు. అతనిపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన వల్ల తాము మానసికంగా, శారీరకంగా నలిగి పోయామని, ఈ విషయంలో న్యాయస్థానానికి మొరపెట్టుకొంటామని తెలిపారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top