ఈ పాన్‌బీడాకు 115 ఏళ్లు

Haji Baba Pan Since 1903 In Shivaji Nagar Karnataka - Sakshi

హాజీ బాబా పాన్‌ రుచికి ప్రశంసలు

బెంగళూరు శివాజీనగరలో ప్రత్యేకం

శివాజీనగర: మంచి భోజనం చేశాక పాన్‌ బీడా లేకుంటే ఏదో లోటే. తమలపాకు–వక్క–తీపి–కొన్ని సుగంధ ద్రవ్యాలతో కూడిన పాన్‌ను ఆరగిస్తే ఆ ఆనందమే వేరు. అలాంటి పాన్‌కు  ఈ దుకాణం ప్రసిద్ధి. బెంగళూరు శివాజీనగర్‌లో ఉన్న రస్సెల్‌ మార్కెట్‌ ప్రజలందరికీ చిరుపరచితమే. సుమారు 50 సంవత్సరాలకు పైగా పాత బడిన రస్సెల్‌ మార్కెట్‌ శివాజీ నగరంలో కేంద్ర బిందువు. అయితే రస్సెల్‌ మార్కెట్‌ కంటే పురాతనమైనది ఒకటి ఉంది, అదే హాజీ బాబా పాన్‌ బీడా దుకాణం. 1903లో దివంగత అబ్దుల్‌ ఖలీక్‌ ద్వారా ప్రారంభించిన ఈ పాన్‌ షాపు వయసు 115 సంవత్సరాలంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు.

రాత్రి పూట మాత్రమే
అబ్దుల్‌ ఖలీక్‌ మనవడు అబ్దుల్‌ బషీర్‌ ఇప్పుడీ అంగడిని నడుపుతున్నాడు. విందు భోజనం తరువాత మనోల్లాసం కలిగించే పాన్‌ బీడా తయారీలో మూడుతరాలుగా వీరు ఆదరణ చూరగొంటున్నారు. ఇక్కడ వ్యాపారం రాత్రి 8 గంటల నుంచి తెల్లవారజామున 3 గంటల వరకు మాత్రం జరుగుతోంది. ఆంగ్లేయుల పాలన నుంచి రద్దీ అలాగే ఉందని వారు చెబుతారు.

ప్రముఖులతో ప్రశంసలు
పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి వారిచేత కూడా పాన్‌బీడా తయారీదారులు ప్రశంసలు అందుకున్నారు. మాజీ మంత్రి శివాజీనగర ఎమ్మెల్యే ఆర్‌. రోషన్‌ బేగ్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు హాజి పాన్‌ బీడా అంటే చాలా ఇష్టపడుతారు. పాన్‌ తినటానికే నగరంలోని ఎక్కడెక్కడి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.

4 రకాల పాన్‌లు
ఇక్కడ బషీర్‌ తయారు చేసేది కేవలం నాలుగు రకాలైన పాన్‌లను మాత్రమే. స్వీట్‌ పాన్, మగై, సాదా, జర్దా ఈ నాలుగు విధాల పాన్‌లను మాత్రం ఆయన తయారు చేస్తారు. అయితే హాజి బాబా పాన్‌ దుకాణం రోజంతా ఓపెన్‌లో ఉండదు. పాన్‌ తయారీకి వీరు ఉపయోగించేది కలకత్తా, బనారస్‌ ఆకులు మాత్రమే. ప్రారంభంలో ఒక పాన్‌ ధర 10 పైసలు ఉండేది. ప్రస్తుతం రూ.15 అయింది.

ఆ రుచే రప్పిస్తోంది: బషీర్‌
తమ దుకాణంలో కేవలం నాలుగు విధాల పాన్‌లు మాత్రం తయారు చేస్తున్నా కూడా ప్రజలు చాలా ఇష్టపడటానికి కారణం సాటి లేని రుచే కారణమని బషీర్‌ అంటున్నారు. తాము పాన్‌ బీడాకు ఉపయోగించే దినుసులు ప్రత్యేకమని చెబుతారు. వక్కను తాము కత్తిరించే విధానం కర్ణాటకలో ఏ షాప్‌లోనూ కనిపించదంటారు గర్వంగా. పాన్‌లో యాలకులు, లవంగం ఉపయోగించటంతో రుచి పెరుగుతుందని చెప్పారు.
రంజాన్‌లో వ్యాపారం మరింత పెరుగుతుందన్నారు. వంశపారంపర్యంగా కొనసాగించిన ఈ పాన్‌ బీడా షాపును నడిపేందుకు తమ బిడ్డలు ఇష్టపడడం లేదని చెప్పారు. ఇద్దరు కుమారులు ఉన్నత చదవులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని బషీర్‌ తెలిపారు. ఈ విద్యను ఎంతో మందికి నేర్పామని, వారు చుట్టుపక్కల సుమారు 50 షాపులు పెట్టుకుని ఉపాధి పొందుతున్నారని తెలిపారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top