ముప్పై పట్టుకుని రా.. పని అయిపోతది | counselor husband voice record hulchal in social media | Sakshi
Sakshi News home page

ముప్పై పట్టుకుని రా.. పని అయిపోతది

Nov 12 2016 12:05 PM | Updated on Sep 22 2018 8:25 PM

రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందిస్తామని, మున్సిపల్‌ పరిధిలో ఏ అనుమతి కావాలన్నా మీసేవ ద్వారా ఆన్‌లైన్‌లోనే అనుమతులు ఇప్పిస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు.

సిరిసిల్లలో కౌన్సిలర్‌ భర్త కాసుల బేరం 
నిర్మాణ అనుమతులకు రూ.30వేలు డిమాండ్‌
అధికార పార్టీ నాయకుడి వసూళ్ల పర్వం
కమిషనర్‌ అడుగుతున్నారని డిమాండ్‌
సోషల్‌ మీడియాలో వాయిస్‌ హల్‌చల్‌
 
సిరిసిల్ల: రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందిస్తామని, మున్సిపల్‌ పరిధిలో ఏ అనుమతి కావాలన్నా మీసేవ ద్వారా ఆన్‌లైన్‌లోనే అనుమతులు ఇప్పిస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. కానీ ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే అందుకు భిన్నంగా అధికారపార్టీకి చెందిన ఓ మహిళా కౌన్సిలర్‌ భర్త ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యాపారితో బేరాలు ఆడిన వైనం శుక్రవారం వెలుగుచూసింది. రూ.30 వేలు తీసుకుని రా.. అంటూ సదరు కౌన్సిలర్‌ భర్త కోరడం విశేషం. మున్సిపల్‌ కమిషనర్‌కు, టీపీఓకు ఇవ్వాలంటూ డబ్బులు అడుగుతున్న వాయిస్‌ మెసేజ్‌ శుక్రవారం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసింది. మూడు నిముషాల నిడివి గల ఆ వాయిస్‌ రికార్డులో కౌన్సిలర్‌ భర్త కాసులబేరమాడిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. వారి సంభాషణ ఇలా సాగింది.    
 
వ్యాపారి : ఓం నమఃశివాయా.. స్వామి..
కౌన్సిలర్‌ భర్త : ఆ.. ఓం శివాయా..
కౌన్సిలర్‌ భర్త: గా బిల్లు కట్టద్దా.. ఇయ్యాలా..
వ్యాపారి: బిల్లు కట్టాలే.. జెర అది కావాలే.. ఆ పని కావాలే ప్లీజ్‌.
కౌన్సిలర్‌ భర్త: పర్మిషన్‌కు పైసలు కట్టద్దా.
వ్యాపారి: కడుత.. కడుత.. ఎంతండు.. స్వామి.
కౌన్సిలర్‌ భర్త: ఇప్పుడు అన్నీ కలిపి.. అవి.. ఇవీ.. ఆ.. ఒక్క నిముషం లైన్‌లో ఉండు.. (కొద్దిసేపటి తర్వాత) కమిషనర్‌ గారు.. మన ఏపీవో, టీపీవో ముగ్గురు కలిసి అడుగుతుండ్రు.. వాళ్ల ముగ్గురికి ఎంతిద్దాం.
వ్యాపారి: ఇగ నువ్వే స్వామి.. మేం చిన్నోళ్లం కదా.. గరీబోళ్లం కదా..
కౌన్సిలర్‌ భర్త: అదే ఎంతిద్దాం.. అంటున్న..
వ్యాపారి: గరీబోళ్లం కదా స్వామి.. చెప్పు.. గవర్నమెంట్‌ చాలన్‌ ఎంతుంటది స్వామి..
కౌన్సిలర్‌ భర్త : ఇప్పుడు వీళ్లకు ఎంతిస్తవో చెప్పు.. దాని మీదికేయి మారుస్తా అంటుండ్రు..
వ్యాపారి: అట్ల కాదు.. గవర్నమెంట్‌ చాలన్‌ పోంగ ఏమిమ్మంటరో మీరే చెప్పుండ్రి స్వామి..
కౌన్సిలర్‌ భర్త: వాళ్లు ముప్పై అడుగుతుండ్రు.
వ్యాపారి: నవ్వుతూ.. అంతా ఏ టూ జెడా..?
కౌన్సిలర్‌ భర్త: ఆల్‌రడీ కాసనగొట్టు రాజు దగ్గర నలభైవేలు తీసుకున్నరట..
వ్యాపారి: ఏదో స్వామి... ఏదో చెయ్‌ నువ్వే..
కౌన్సిలర్‌ భర్త: వాళ్లు ముప్పై అడుగుతుండ్రు.. 
వాళ్ల దగ్గర నలబై తీసుకున్నరు.. 
వాళ్ల తమ్ముడేనాయే... ఈయనకు తక్కువ తీసుకుంటే మంచిగుండది.. ఈనె వాళ్లకు చెప్తె లేని ఇబ్బంది 
అయితది అంటుండ్రు..
వ్యాపారి: కరక్టే స్వామి.. వాళ్లది మాత్రం ఎంతుందో తెలుసా.. దాదాపు ఫేసింగ్‌ 47.. లోతు 55 వాళ్లది.. నాది ఎంత స్వామి.
కౌన్సిలర్‌ భర్త: అందుకే పది తక్కువ చెప్పిండ్రు కదా..
వ్యాపారి: ఏ.. స్వామి.. ఓ పదిహేను ఇస్తా..
కౌన్సిలర్‌ భర్త: ఏ.. కూరగాయల బేరమా.. ఏమన్నా.. నీకర్థం కాదు..
వ్యాపారి: స్వామి.. స్వామి.. జెర సూడు..స్వామి.. 
మేం చిన్నోళ్లం కదా.. సరే గానీ ఓ ఇరవై వేలు ఇద్దామని చెప్పు..
కౌన్సిలర్‌ భర్త: బిల్లు తక్కువ చేపిస్తా.. సెట్‌ చేపిస్తా.. ముప్పై వేలు పట్టుకుని రా.. 
వ్యాపారి: అబ్బ.. మంచోడు కాదు.. దయా..
కౌన్సిలర్‌ భర్త: ముప్పై కానీ.. పైసలు పట్టుకుని రా..
వ్యాపారి: అబ్బ అబ్బ నేను ఇప్పుడు వేరే జాగల ఉన్న స్వామి..చేస్తా..చేస్తా..
కౌన్సిలర్‌ భర్త: ఏడున్నవ్‌.. 
వ్యాపారి: చేస్తా.. చేస్తా.. వేరే ఊరిలో ఉన్న స్వామి.. వస్తా..
కౌన్సిలర్‌ భర్త: మంచి మూడ్‌లో ఉన్నడయా.. 
కిరికిరి ఒడగొట్టుకో..
వ్యాపారి: నీకు కంపల్సరీ చేస్తాను.. ఓకే..
కౌన్సిలర్‌ భర్త: ఏడున్నవ్‌ ఇప్పుడు.. అరగంట వరకు తొందరగా రా.. నీ పని అయిపోతది.. రా.. 
అంటూ.. ఫోన్‌ సంభాషణ ముగుస్తుంది.. 
మున్సిపల్‌ కౌన్సిల్‌లోని కీలక వ్యక్తుల పేర్లు ఉటంకిస్తూ.. సదరు కౌన్సిలర్‌ భర్త వ్యాపారితో మాట్లాడిన సంభాషణలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.  అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ భర్త మాట్లాడిన మాటలు కీలక నాయకుల పేర్లు సైతం ఆయన మాటల్లో రావడం విశేషం. 
 
ఆ మాటలతో మాకు సంబంధం లేదు
సంభాషణను నేను విన్నాను. ఆయన మాటలతో మాకు సంబంధం లేదు. మా పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు స్పష్టమవుతుంది. ఎవరైనా మా పేర్లు చెప్పి డబ్బులు అడిగితే.. వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. 
నిబంధనల ప్రకారం మేం నడుచుకుంటున్నాం.                         
- బి.సుమన్‌రావు, కమిషనర్‌
 
ఇంకా చాలా రికార్డులున్నాయి..  
కౌన్సిలర్‌ భర్తవే కాదు.. నా దగ్గర ఇంకా చాలా రికార్డులు ఉన్నాయి. మున్సిపల్‌ వాళ్లు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. అందుకే రికార్డు చేశాను. 
- కాసనగొట్టు రమణయ్య, వ్యాపారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement