ప్రముఖ పాప్ గాయకుడు దలేర్ మెహందీతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్‌లో చేరనున్నారు.
కాంగ్రెస్‌లో చేరనున్న దలేర్ మెహందీ
Aug 28 2013 1:39 AM | Updated on Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పాప్ గాయకుడు దలేర్ మెహందీతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆర్జేడీ తరపున ఢిల్లీ విధానసభకు ఎన్నికైన మహ్మద్ ఆసిఫ్‌ఖాన్, బదర్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న బీఎస్పీ ఎమ్మెల్యే రామ్‌సింగ్ నేతాజీ, మాజీ కౌన్సిలర్, ఎన్పీపీ నాయకుడు రామ్‌వీర్ సింగ్ బిదూరీతోపాటు బీజేపీ మాజీ కౌన్సిలర్ డాక్టర్ వీకే మోంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. దలేర్ మెహందీతోపాటు ఈ నేతలు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోవడాన్ని అభినందిస్తూ కాంగ్రెస్ శాసనసభా పక్షం మంగళవారం అభినందన తీర్మానాన్ని ఆమోదించింది.
దలేర్ మెహందీతోపాటు కాంగ్రెస్‌లో చేరిన నే తలకు విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగేందుకు అవకాశం లభిస్తుందని అంటున్నారు. దలేర్ మెహందీని తిలక్‌నగర్ లేదా హరినగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించవచ్చని భావిస్తున్నారు. డాక్టర్ వీకే మోంగాను కృష్ణానగర్ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ హర్షవర్ధన్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దింపే అవకాశముంది. ఓఖ్లా నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆసిఫ్ మహ్మద్‌ఖాన్‌ను అదే నియోజకవర్గం నుంచి పోటీచేయవచ్చని, రామ్‌సింగ్ నేతాజీ కూడా బదర్‌పూర్ నుంచి పోటీచేయవచ్చని సమాచారం. రామ్‌వీర్‌సింగ్ బిదూరీకి తుగ్లకాబాద్ టికెట్ లభించవచ్చని అంటున్నారు.
Advertisement
Advertisement