అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఐఏఎస్ అధికారి డీ.కే రవికి సంబంధించిన కేసులో సాక్ష్యాలు నాశనం చేయడానికే సీఐడీ దర్యాప్తు పేరుతో ఆధికార కాంగ్రెస్ పార్టీ....
సాక్షి,బెంగళూరు: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఐఏఎస్ అధికారి డీ.కే రవికి సంబంధించిన కేసులో సాక్ష్యాలు నాశనం చేయడానికే సీఐడీ దర్యాప్తు పేరుతో ఆధికార కాంగ్రెస్ పార్టీ నాటకాలు అడుతోందని శాసనసభలో జేడీఎస్ ఫ్లోర్ లీడర్ కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఓ రెండు ఫైల్స్‌లోని సమాచారం నాశనం చేయడానికే దర్యాప్తు పేరుతో సీఐడీలోని కొంతమంది అధికారులు తరుచుగా డీ.కే రవి కార్యాలయానికి వెలుతున్నారని పేర్కొన్నారు. బెంగళూరులో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఐడీ దర్యాప్తు మొత్తం నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందన్నారు.
డీ.కే రవి కేసుకు సంబంధించి ఓ మహిళా ఐఏఎస్ అధికారిని రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకూ ఎందుకు విచారణ చేశారు. మహిళ, అందులోనూ ఐఏఎస్ అధికారి అని చూడకుండా అర్ధరాత్రి వేళ విచారణ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అంతేకాకుండా దర్యాప్తునకు సంబంధించిన విషయాలను సీఐడీ అధికారులు కావాలనే కొన్ని మీడియాలను ఎంపిక చేసుకొని లీక్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడే సమయంలో దర్యాప్తు విషయాలను వెల్లడిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘మహిళా ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. ఆమెకు కర్ణాటకలో ఓ వ్యక్తి నుంచి వేధింపులు ఉన్నాయని ఆమె అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సలహాదారుకు చెప్పారు.
ఆయన సూచనల మేరకు కర్ణాటక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కౌషిక్‌ముఖర్జీకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.’ అని సీఎం సిద్ధరామయ్య తనకు అనుకూలంగా ఉన్న ఓ పత్రికలో ప్రచురితం అయ్యేలా చూశారన్నారు.’ ఈ విషయాలనే తాను ప్రశ్నించానన్నారు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తానే దర్యాప్తునకు సంబంధించి అనవసర రాద్దాంతం చేస్తున్నానని సీఎం సిద్ధరామయ్య అనవసరంగా ఆరోపిస్తున్నారని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోలారు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్తూరు ప్రకాశ్ డీ.కే రవి బదిలీ అవుతారని చెబుతూ ఓ అధికారిపై బెదిరింపులకు పాల్పడిన సంఘటన కు సంబంధించిన ఓ సీడీని కుమారస్వామి ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. కాగా, ఈ సీడీలో ఉన్న గొంతు తనది కాదని వర్తూరు ప్రకాశ్ మీడియాతో పేర్కొన్నారు.