మరింత ఉధృతం

Cauvery protests: MDMK leader Vaiko's nephew, who immolated self over water dispute, dies in Madurai - Sakshi

16న మళ్లీ అఖిల పక్షం

ఆత్మాహుతికి యత్నించిన శర్వణ సురేష్‌ మరణం

సాక్షి, చెన్నై : కావేరి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి డీఎంకే నిర్ణయించింది. ఈ విషయంగా చర్చించేందుకు ప్రతిపక్షాలను ఆహ్వానిస్తూ మళ్లీ అఖిల పక్షం సమావేశానికి స్టాలిన్‌ నిర్ణయించారు. ఈనెల 16న జరిగే సమావేశం మేరకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక, కావేరి కోసం ఆత్మాహుతియత్నం చేసిన  ఎండీఎంకే నేత వైగో బంధువు శర్వణ సురేష్‌ మరణించాడు.కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ సాధన లక్ష్యంగా రాష్ట్రంలో  పలు రూపాల్లో ఆందోళనలు సాగినా కేంద్రం నుంచి స్పందన కరువే. రాష్ట్ర ప్రభుత్వం సైతం మమా అనిపించే చర్యలతో ముందుకు సాగుతోంది.

 దీంతో తమ పోరును మరింత ఉధృతం చేయడానికి ప్రతిపక్షాలు సిద్ధం అవుతున్నాయి. ఇందుకోసం మరోమారు అఖిల పక్షం సమావేశానికి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ శనివారం పిలుపునిచ్చారు. 16వ తేదీ సాయంత్రం అన్నా అరివాలయం వేదికగా ఈ సమావేశం సాగనుంది. ఈ విషయంగా స్టాలిన్‌ మీడియాతో మాట్లాడుతూ, అఖిల పక్షం సమావేశంలో పోరు మరింత ఉధృతం లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నామన్నారు. అలాగే, 16వ తేదీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వ్యవహారంలో కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ వళ్లువర్‌కోట్టంలో ప్రతిపక్షాల నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమానికి నిర్ణయించామన్నారు. 

కావేరి వ్యవహారంలో కేంద్రం చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పోరు ఎంత ఉధృతం చేయడానికైనా తాను సిద్ధమేనని హెచ్చరించారు. అన్నింటా కాషాయం రంగును పులిమే రీతిలో కేంద్రం అడుగులు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. కాగా, తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ చిత్తిరై ఒకటో తేదీన తమిళ కొత్త సంవత్సరం అని ప్రకటించడం శోచనీయమని విమర్శించారు. తై ఒకటో తేదీ తమిళ కొత్త సంవత్సరంగా అసెంబ్లీలో సైతం కరుణానిధి తీర్మానం తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇక, 16వ తేదీ తమిళ మానిల కాంగ్రెస్‌ సైతం కావేరి సాధన నినాదంతో భారీ ఆందోళన కార్యక్రమాల్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు నిర్ణయించింది.

 ఇక, కావేరి వ్యవహారంలో తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరిగేందుకు డీఎంకే, కాంగ్రెస్‌లే కారణం అని డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పట్లో ఈ రెండు పార్టీలు కలిసి ఆడిన నాటకాల కారణంగా, ఇప్పుడు రైతన్నలు కావేరి కోసం అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తమ ప్రభుత్వం అన్ని రకాలుగా కేంద్రం మీద ఒత్తిడి తెస్తూనే ఉందని, తీర్పు అనుకూలంగానే ఉంటుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. 

శర్వణ సురేష్‌ మృతి
కావేరి సాధన నినాదంతో ఎండీఎంకే నేత వైగో బంధువు శర్వణసురేష్‌(55) శుక్రవారం విరుదునగర్‌లో ఆత్మాహుతి యత్నం చేసిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ సురేష్‌ను తొలుత విరుదునగర్‌ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం మదురైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం సురేష్‌ మరణించాడు. ఈ సమాచారంతో వైగో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. సురేష్‌ మృతదేహం వద్ద బోరున విలపించారు. ఇక, మీదట ఎవరూ  ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని వేడుకున్నారు. కాగా, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం పేర్కొంటూ, కావేరి కోసం ఆత్మహత్యలు, ఆత్మాహుతుల జోలికి దయ చేసి వెళ్ల వద్దని వేడుకున్నారు. ఇప్పటివరకు మరణించిన వారి కుటుంబాల్ని ఆదుకునేందుకు  ప్రభుత్వం పరిశీలన చేస్తోందని, త్వరలో మంచి ప్రకటన చేస్తామన్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top