అన్యాక్రాంతమైన అటవీ భూములకు సంబంధించి ఇప్పటి వరకూ 1.10 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇందులో 2.04 లక్షల ఎకరాలు కబ్జాకు గురైనట్లు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
అన్యాక్రాంతమైన అటవీ భూములకు సంబంధించి ఇప్పటి వరకూ 1.10 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇందులో 2.04 లక్షల ఎకరాలు కబ్జాకు గురైనట్లు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో పది ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణంలో కబ్జాకు సంబంధించి 1.09 లక్షల కేసులు నమోదయ్యాయి. వీటిలో 1,86,197 ఎకరాల అటవీభూమి అన్యాక్రాంతమైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ భూములను కొంత అపరాధ రుసుంతో సక్రమం చేసి సంబంధితవ్యక్తులకు యాజమాన్య హక్కులను కట్టబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర అటవీశాఖ న్యాయశాఖకు లేఖ రాసినట్లు సమాచారం. అయితే కర్ణాటక అటవీ భూముల సంరక్షణ చట్టం-1963 సెక్షన్ 24 ప్రకారం అటవీ భూములను ఆక్రమించడం నేరం. దీంతో ఆక్రమణే నేరమయినప్పుడు సక్రమం ఎలా చేస్తారని న్యాయశాఖ వాదిస్తోంది. అంతే కాకుండా అన్యాక్రాంతమైన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కర్ణాటక హై కోర్టు ప్రభుత్వానికి సూచించిందని న్యాయశాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ‘సక్రమం’ చేస్తే కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని వారు కుండబద్ధలు కొడుతున్నారు. ఈ విషయమై రాష్ట్ర అటవీశాఖ మంత్రి రామనాథరై మాట్లాడుతూ... ‘పదెకరాల కంటే తక్కువ విస్తీర్ణంలోని భూములను సక్రమం చేసే ఆలోచన ఉంది. అయితే ఈ విషయంలో న్యాయపరమైన ఇబ్బందులున్నాయి. చట్టసభల ఆమోదం పొందిన తర్వాత సక్రమం చేస్తాం.’ అని పేర్కొన్నారు.
తేకలవట్టి చెరువు లోతట్టు ప్రాంతాల వాసులకు మంత్రి పరామర్శ చిత్రదుర్గం :
జిల్లాలోని హొసదుర్గ తాలూకాలో కురిసిన వర్షానికి తేకలవట్టి చెరువు నిండి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో సుమారు వందకు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి హెచ్.ఆంజనేయ ఆదివారం గ్రామానికి వచ్చి తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
జలానయన (వాటర్‌షెడ్) శాఖ ఆధ్వర్యంలో చెరువు పైభాగంలో రెండు చెక్‌డ్యాంలు నిర్మించామని, అయితే అధిక వర్షం కురవడంతో చెక్‌డ్యాంలు నిండి చెరువులోకి నీరు రావడంతో చెరువు నిండి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇళ్లలో ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేవలం ఇళ్లలో ఉన్న ఆహార ధాన్యాలు మాత్రం తడిసి పోయాయి. నీటి ప్రవాహానికి పంట నష్టం జరిగింది. పంచాయతీ తరఫున తాత్కాలిక గంజి కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది.
దెబ్బతిన్న ఇళ్లు, పంటలకు నష్టం పరిహారం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సంబంధిత అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత లోతట్టు ప్రాంత వాసులకు ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు. మంత్రి వెంట ఎంపీ బీఎన్.చంద్రప్ప, జిల్లాధికారి తిప్పేస్వామి, అడిషనల్ జిల్లా ఎస్పీ శాంతరాజ్, తహశీల్దార్ లక్ష్మణప్ప, రెవిన్యూ శాఖ అధికారులు, గ్రామ నేతలు ఉన్నారు.