
బిహార్‌లో జోరుగా బెట్టింగ్‌లు
బిహార్ అసెంబ్లీకి బుధవారం ఓ పక్క హుషారుగా పోలింగ్ జరుగుతుండగా, మరోపక్క జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి.
పాట్నా: బిహార్ అసెంబ్లీకి బుధవారం ఓ పక్క హుషారుగా పోలింగ్ జరుగుతుండగా, మరోపక్క జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న విశ్వాసంతో 'సత్తా' మార్కెట్ తన సత్తాను చాటుకుంటోంది. బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటకు అవసరమైన 122 స్థానాల లక్ష్యాన్ని ఎన్డీయే కూటమి సునాయాసంగా అధిగమిస్తుందని అక్రమ బెట్టింగ్‌లో పంటర్లు పెట్టుబడులు పెడుతున్నారు.
అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకుగాను ఎన్డీయే కూటమికి 150 నుంచి 152 స్థానాలు వస్తాయని, బీజేపీకి ఒంటరిగా 110 నుంచి 112 సీట్లు వస్తాయని పంటర్లు భావిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరిష్మాను ఈ ఎన్నికల్లో పణంగా ఒడ్డడం, నితీష్ కుమార్ అభివృద్ధి నినాదాన్ని బీజేపీ విజయవంతంగా అందిపుచ్చుకోవడం ఈ ఎన్నికల్లో తమకు కలసివచ్చే అవకాశాలని పంటర్లు వాదిస్తున్నారు. అలాగే లాలూ ప్రసాద్‌తో నితీష్ కుమార్ చేతులు కలపడం మహా కూటమికి చేతులు కాల్చుకోవడమేనన్న వాస్తవ పరిస్థితులను కూడా తాము పరిగణలోకి తీసుకున్నామని వారు చెబుతున్నారు.
నితీష్ నాయకత్వంలోని జేడీయూకు 44 నుంచి 46 సీట్లు వస్తాయని, మిత్రపక్షమైన ఆర్జేడీకి 27-29 సీట్లు, కాంగ్రెస్‌కు 8-10 సీట్లు వస్తాయని పంటర్లు అంచనా వేస్తున్నారు. జేడీయూ, ఆర్జేడీ పార్టీలు చెరో వంద సీట్ల చొప్పున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, సూరత్, ముంబై తదితర నగరాలకు తమ పార్టనర్లు విస్తరించి ఉన్నారని.. పాట్నా మార్కెట్ పంటర్లు తెలియజేస్తున్నారు. నలుగురైదుగురు పెద్ద ప్లేయర్ల నేతృత్వంలో ఈ బెట్టింగ్ వ్యాపారం నడుస్తుందని వారు తెలిపారు. పోలీసులకు చిక్కకుండా తమ వ్యాపారులు ఎప్పటికప్పుడు తమ కాంటాక్ట్ నెంబర్లు మారుస్తారని చెప్పారు. తమ బాస్‌లందరూ ఒకరికొకరు బాగా తెలిసినవారేనని, వారి మధ్య ఎలాంటి మోసాలు ఉండవని స్థానిక పంటర్ ఒకరు మీడియాకు తెలిపారు.
ఎన్డీయేపైనా 80పైసలు, మహాకూటమిపైన 1.20 రూపాయలు బెట్టింగ్ నడుపుతున్నట్టు పంటర్లు తెలిపారు. ఎవరైనా ఎన్డీయేపై లక్ష రూపాయలు బెట్టింగ్ పెడితే ఎన్డీయే గెలిచిన పక్షంలో అతనికి 80వేల రూపాయల లాభం వస్తుంది. పంటర్ల అంచనాలు చాలాసార్లు తలకిందులవుతుంటాయి. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి 20 సీట్లు వస్తాయని మొదలు పెట్టిన సత్తా మార్కెట్ 34 సీట్ల వరకు వెళ్లింది. ఏకంగా 67 సీట్లను సాధించి ఆమ్‌ఆద్మీ పార్టీ అందరి అంచనాలు తలకిందులు చేసింది.