
అన్నానగర్ (చెన్నై): ముసలి వయసులో పిల్లలు వెలివేయడంతో ఆ వృద్ధుడు ఒంటరయ్యాడు. భిక్షాటనతో బతుకు బండి లాగిస్తున్నాడు. భిక్షమెత్తగా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని ఓ స్కూలుకు అంది స్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. తమిళనాడు, తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళం సమీపంలోని ఆలంగినరుకి చెందిన భూల్‌పాండి(68). ఇతని భార్య సరస్వతి. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. సరస్వతి 24 ఏళ్ల కిందట మృతి చెందింది. భూల్‌పాండి తన పిల్లలకి పెళ్లిళ్లు చేశాడు.
క్రమంగా వారు అసహ్యించుకోవడంతో భూల్‌పాండి ఇంటి నుంచి బయటకి వచ్చాడు. ఆకలి తీర్చుకోవడానికి భిక్షమెత్తుకోవడం ప్రారంభించాడు. భిక్షాటనతో వచ్చిన డబ్బుతో పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు అందజేశాడు. నెల్లై, తూత్తుకుడి, తిరుచ్చి, తంజావూరు, నాగపట్టణం జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలకు పలు పరికరాలను కొనిచ్చాడు. భూల్‌పాండితో మాట్లాడగా పెరుంతలైవర్ కామరాజర్ మీద ఉన్న అభిమానంతోనే భిక్షాటనతో పాఠశాలలకు సహాయం చేస్తున్నానన్నాడు. దాదాపు 20 వేల మొక్కలను నాటానన్నాడు. దినతంతి పేపర్‌ని చూసి తాను రాయడం, చదవడం నేర్చుకున్నానని చెప్పాడు.